Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖర్చు, ప్లానింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్… సన్మానసభలంటే మాటలా మరి..?!

August 11, 2025 by M S R

.

సన్మానసభలు భిన్న రకములు… మరీ ప్రత్యేకించి భారీ ఖర్చు పెట్టుకుని, పేరొందిన సన్మానసభల కంపెనీ చేతుల మీదుగా… జబర్దస్త్ ప్లానింగుతో జరిపించుకునే సన్మానసభలు ఆ భిన్నత్వంలోనూ ఎక్కువ భిన్నత్వం… అసలు సన్మానసభలు జరిగే తీరు మీద పలు తెలుగు సినిమాల్లో సెటైరిక్ సీన్లు కనిపిస్తాయి…

అదేదో సినిమాలో బ్రహ్మానందానికి వి.పి. సన్మానసభ పేరిట రాజేంద్రప్రసాద్ ఓ వెరయిటీ సన్మానం ఏర్పాటు చేస్తాడు… అల్టిమేట్ సెటైర్ అన్నమాట… తరువాత టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల్లో ఏవీఎస్, గుండు హన్మంతరావు స్కిట్ కూడా… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… పదండి, ఓ వ్యంగ్యం అర్జెంటుగా చదువుదాం…

Ads



Gopi Reddy Yedula ……. సింపుల్ కొచ్చన్. మీకు రాంబాబు తెలుసా ? లేదా ?

ఆ రోజు సాయంత్రం పట్టణంలో ఎక్కడ చూసినా రంగు కాగితాల తోరణాలు రెప రెప లాడుతున్నాయి. అన్ని ప్రధాన కూడళ్లలో భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. రిక్షాల్లో తిరుగుతూ పాంప్లెట్స్ పంచుతున్నారు. పాంప్లెట్స్ మీద, కటౌట్స్ మీద రాంబాబు ఫోటో ఉంది.

ఆ ఫోటో కింద “విద్యాధికుడు, సామాజిక సేవకుడు, సాంస్కృతిక సేవకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏక సంధాగ్రహి, శత అవార్డుల గ్రహీత, శత శాలువాల, శతన్నర మాలల సన్మాన గ్రహీత, సంచలన కవి, రచయిత శ్రీశ్రీశ్రీ చందాల రాంబాబు గారికి ఘన, మహాఘన, అత్యున్నత ఘన సన్మానం” అని రాసి ఉంది.

“ప్రతి ఒక్కరూ చూసి ఆనందించవలసిన గొప్ప సన్మానం. ప్రతి మానవుడూ ఆహ్వానితుడే” అంటూ బజారుకొక మైకు తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

పూల మాలలతో అలంకరించిన ప్రచార రధం మీద నిలబడి చందాల రాంబాబు చేతులెత్తి ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తున్నాడు. రథానికి ఇరువైపులా బ్యాండు మోగిస్తున్నారు. రధం ముందు, వెనుక కార్ల కాన్వాయ్ అనుసరిస్తుంది. ముందు టపాసులు పేల్తున్నాయి. రాంబాబు జనసందోహానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి తరలివచ్చారు.

సభా ప్రాంగణం కోలాహలంగా ఉంది. సభకు వచ్చే ప్రతి ప్రేక్షకుడిని గేటు దగ్గర ఆపి ఒక శాలువా ఇస్తున్నారు. అలాగే ఒక పొగడ్త కొటేషన్ ఉన్న కార్డు ఇస్తున్నారు. సన్మాన గ్రహీతకు ఆ శాలువా కప్పి, ఆ కొటేషన్ ను అందరికీ వినపడేలా ఎలా ఉచ్చరించాలో శిక్షణ ఇస్తున్నారు. కవిని పొగడాలనే కనీస సంస్కారం లేని వాళ్ళు చాలామంది ఉన్నారని, వారు శాలువా కూడా తెచ్చుకోరని సభా నిర్వాహకులకు తెలుసు.

సభా ప్రాంగణంలో గ్రహీతకు చెందిన కంపెనీ ఉద్యోగులు సుమారు వందమంది ఉన్నారు. మీటింగుకు ఇంకా రాని వాళ్లకు ఫోన్ చేసి పిలుస్తున్నారు. కార్లలో, ఆటోల్లో వచ్చిన వారికి కిరాయి డబ్బులు చెల్లిస్తున్నారు. సభా ప్రాంగణం వెనకాల వంటశాలలో పొగలు తెరలు తెరలుగా పైకి లేస్తున్నాయి. ఆహ్వానితులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారిగా చీకట్లను చీలుస్తూ దేదీప్యమానంగా లైట్లు వెలిగాయి.

సభాధ్యక్షుడు రాంచందర్ మైకు ముందుకు వచ్చి పాటలు పాడుతున్న ఆర్కెస్ట్రా బృందానికి సైగ చేశాడు ఆపమని. సభని ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. “ఈనాటి సన్మాన గ్రహీతకు, ముఖ్య అతిథికి, వేదిక మీద ఆసీనులైన అతిరధ మహారధులైన కవులు, రచయితలకు నమస్కారాలు” అంటూ అభివాదం చేశాడు.

“నేను ఎన్నో సభలకు అధ్యక్షత వహించాను. కానీ, ఇన్ని వేల మంది ప్రజలు స్వచ్చందంగా, రాంబాబు మీద అభిమానంతో.. కాదు కాదు రాంబాబు రచనల మీద పిచ్చితో రావడం చారిత్రాత్మకం. ఆయన రచనలు ప్రజల్ని కదిలించాయనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. రాంబాబు గారు పలు రచనలు చేశారు. వాటన్నింటి గురించి చెప్పాలంటే సభను రెండు రోజులు జరపాల్సి ఉంటుంది. అందుకే, ముఖ్యమైన నాలుగు పుస్తకాలను సమీక్షించవలసిందిగా కవి సామ్రాట్ కంకణాల సుందరయ్య గారిని కోరుతున్నా” అని పక్కకు జరిగాడు.

“సభకు నమస్కారం. నేను కూడా ఎన్నో పుస్తకాలు రాశాను. కానీ, ఇంత ఘనం సభను అయితే నేను జరుపుకోలేకపోయాను. అయినప్పటికీ రాంబాబు గారు గొప్ప రచయిత అని చెప్పడానికి వెనుకాడను. వారి రచనల్లో మేలిమి పుస్తకాలను మీకు పరిచయం చేస్తాను” అని కళ్లద్దాలు సవరించుకున్నాడు సుందరయ్య.

“ముందుగా మన సన్మాన గ్రహీత గురించి రెండు మాటలు మాట్లాడడం సభా మర్యాద. అసలు వారి పేరు దందాల రాంబాబు. ‘చందాలు – సమాజ పరిణామ క్రమం’ అనే పరిశోధక వ్యాసం రాసిన తరువాత వారు చందాల రాంబాబుగా పరిణామం చెందారు” అని రాంబాబు వైపు చూశారు ప్రసంశా పూర్వక సైగ కోసం.

“వారు మొదట రచించిన పుస్తకం ‘అమ్మ పలుకు’ అనే కవితా సంపుటి. రచయిత ఊరి బయట ఉన్న అమ్మోరు గుళ్ళో కూర్చొని, ఒకే రాత్రిలో రచించిన కవిత్వం” అంటూ ఆ పుస్తకాన్ని గాల్లోకి లేపి ప్రదర్శించాడు.
“ఇక రెండవది ‘గుమ్మంలో బొమ్మ’ అనే ప్రేమ కవిత్వం. ఒక రోజు రచయిత రోడ్డుమీద దీర్ఘాలోచనాపరుడై నడుస్తూ ఉండగా.. ఒక గుమ్మంలో బొమ్మలా నిలుచున్న అమ్మాయిని చూశాడు. ఆమె మనసులోని సున్నిత ప్రేమను చిత్రించినదే ఈ కవిత్వం” అంటూ ఆ పుస్తకాన్ని గాల్లోకి లేపి ప్రదర్శించాడు.

“మూడవది ‘చెరువులో కప్ప’ అనే వచన కవిత్వం. ఒక రోజు రచయిత మన ఊరి చెరువు ఒడ్డున కూర్చొని దీర్ఘాలోచనలో ఉండగా రెండు కప్పలను చూశాడు. వాటి మాటల్లోని వ్యత్యాసాలను గమనించాడు. వాటిని పట్టి తెచ్చి తన ఇంట్లో గాబులో వేసి అనేక రాత్రులు పరిశీలించాడు. అందులో ఒకటి స్థానిక కప్ప అని, మరొకటి వలస కప్ప అని తేల్చిన వారి పరిశోధన మనల్ని అబ్బురపరుస్తుంది” అంటూ ఆ పుస్తకాన్ని గాల్లోకి లేపి ప్రదర్శించాడు.

“నాలుగవది ‘రచయితల కుంపటి’ అనే విమర్శా వ్యాసాల సంపుటి. తాను మూడు పుస్తకాలు రాసినప్పటికీ సాహితీ లోకం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతూ రాసిన తర్క సహిత వ్యాసాల సంపుటి” అంటూ ఆ పుస్తకాన్ని గాల్లోకి లేపి ప్రదర్శించాడు.

“ఇందులో రచయిత ప్రదర్శించిన ధర్మాగ్రహం సాహితీలోకాన్ని కుదిపేసింది. సాహిత్యకారులు పట్టించుకోక పోయినప్పటికీ అనేక స్వచ్ఛంద సంస్థలు మన రచయితకు భారీ సన్మానాలు చేశారు.

రాంబాబు గారి రచనా కౌశలానికి మెచ్చి, వారికి నేడు జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్న ‘కిన్నెరసాని వచ్చిందయ్యా’ అనే సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శ్రీ చక్రయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చక్రయ్య గారు నేను రాసిన అన్ని పుస్తకాలకూ సన్మాన సభ పెట్టారు. వారెంత గొప్పవారంటే.. నేను రాయబోయే పుస్తకానికి కూడా ఇటీవల ఒక సన్మాన సభ పెట్టారు” అనగానే సభకు రెండు వైపులా టై కట్టుకొని నిలబడ్డవాళ్లు కరతాళ ధ్వనులు చేశారు. సుందరయ్య అభివాదం చేసి వెళ్లి కూర్చున్నారు.

felicitation
“చాలా చక్కగా పుస్తకాలను పరిచయం చేసి, పనిలో పనిగా తన రచనా కౌశలాన్ని కూడా ప్రదర్శించిన సుందరయ్య గారికి ధన్యవాదాలు. ఇక వేదిక మీద ఎందరో అతిరధ మహారధులు ఉన్నారు. వారు మన సన్మాన గ్రహీత గురించి ఎన్నో వేదికల మీద చెప్పిందే చెప్పడం మీకందరికీ తెలుసు. అందుకే వారిని వదిలేసి, ఈనాటి ముఖ్య అతిధి, సాహితీ దురంధరుడు, నూతన సాహితీ ప్రక్రియల సృష్టికర్త శ్రీశ్రీశ్రీ రమణ గారిని తమ అమూల్య సందేశాన్ని ఇవ్వలిసిందిగా కోరుతున్నాను” అని కూర్చున్నాడు రాంచందర్.

ముఖ్య అతిధి రమణ తన మెడలో ఉన్న ఏడెనిమిది శాలువాలను సరిచేసుకొని మైకు దగ్గరికి వచ్చి రెండు చేతులెత్తి అభివాదం చేశాడు. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టాడు. “నేను కుల మతాలకు అతీతున్ని. నేను ఇలాంటి సభలకు వచ్చి మాట్లాడాలంటే తక్కువలో తక్కువ రెండు లక్షలు ఛార్జ్ చేస్తాను. కానీ, ఇలాంటి సహజ ప్రతిభ ఉన్న కవుల సన్మానానికి డబ్బులు తీసుకుంటే సాహిత్యం పలచబడుతుందనిపించింది.

అందుకే… కేవలం యాభై వేలు మాత్రమే ఛార్జ్ చేశాను. ఆ మాత్రం వీరికి ఓ లెక్కలోది కాదు. రెండు కాదు మూడు లక్షలు అడగాల్సింది అని ఈ ఏర్పాట్లు చూసిన తరువాత అనిపిస్తుంది. పేరుకు ‘కిన్నెరసాని వచ్చిందయ్యా’ అనే సంస్థ సన్మానం చేస్తున్నట్టు చెప్పినా.. అందుకయ్యే ఖర్చంతా ఎవరు పెట్టుకుంటారో మనందరికీ తెలుసు” అంటూ సన్మాన గ్రహీత వైపు చూశాడు.

సన్మాన గ్రహీత తన ముఖ కవళికల్లో ఎలాంటి మార్పూ రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిభాయించుకునే గుణం కవిగా మారిన తరువాత అబ్బింది.

felicitation

ముఖ్య అతిధి తన మెడలోని శాలువాలను మళ్ళీ సరిచేసుకొని “ఇక రాంబాబు గారి గురించి వక్తలు చాలామంది మాట్లాడారు. ఇప్పుడు వారి ప్రతిభ నాకు పూర్తిగా అర్ధం అయింది. ఈ అవార్డులూ గివార్డులూ వారి ప్రతిభకు గీటురాళ్ళు కావు. వారికి ‘తెలంగాణ పద్మశ్రీ’ గానీ, లేదా ‘తెలంగాణ రత్న’ గానీ తప్పకుండా రావాలి. ఒకవేళ, బై మిస్టేక్ వీరికి కవిగా అనుకున్నంత పేరు రాకున్నాగానీ.. ఎప్పుడో ఒకసారి ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడు. లేదా… కనీసం ఎంఎల్ఏ అన్నా అవుతాడు” అని కారతాళ ధ్వనులమధ్య ముగించాడు.

రమణ తన సీటు దగ్గరికి వెళ్లి హఠాత్తుగా మళ్ళీ మైకు దగ్గరికి వచ్చి “ఒక రచయిత రచనల మీద పాఠకులకు అవగాహన ఉన్నా లేకున్నా పరవాలేదు. కానీ, ఆ రచయితకు వచ్చిన అవార్డుల గురించి తెలుసుకోవడం పాఠకులుగా మీ బాధ్యత. నాకు వచ్చిన అవార్డుల వివరాలు ఉన్న చిన్న పుస్తకాన్ని గేటు దగ్గర కేవలం వంద రూపాయలకే అమ్ముతున్నారు. మీరు వెళ్ళేటప్పుడు కొనుక్కొని ఇంటి దగ్గర చదవండి.. కృతఙ్ఞతలు” అని ముగించాడు.

“ఇంకొక్క మాట” అంటూ మళ్ళీ మైకు దగ్గరికి వచ్చి “రాంబాబు గారి రచనలు చదివిన వారు ఒక్కసారి చేతులెత్తండి” అంటూ ప్రేక్షకుల వైపు ఆసక్తిగా చూశాడు. ఏడెనిమిదిమంది చేతులు ఎత్తారు. ఆ పుస్తకాల్లోనుండి ఏమైనా ప్రశ్నలు అడుగుతాడేమోనని ఆందోళన చెంది వెంటనే చెయ్యి దింపారు.

ఆశ్చర్యంగా వేదిక మీదికి చూశాడు. వేదిక మీద పదిహేను మంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే చేతులెత్తారు. ఒకరు పుస్తక సమీక్షకులు, రెండో వ్యక్తి సభాధ్యక్షులు, మూడోది సన్మాన గ్రహీత. సభాధ్యక్షులు తన చేతిని సగమే ఎత్తిన దృశ్యం సభికుల దృష్టిని ఆకర్షించింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రపంచదేశాలు ఆల్రెడీ లైట్ తీసుకుంటున్నాయి అమెరికాను… పార్ట్-2
  • ట్రంపు ఒక పాత్ర, అంతే… అమెరికా పతనం ఆరంభమైనట్టేనా..?
  • ఈ చరిత్రాత్మక కట్టడం కుప్పకూలిందే కేసీయార్ హయాంలో..!!
  • అన్యథా శరణం నాస్తి.., త్వమేవ శరణం మమ… మోడీకి కనువిప్పు…
  • పిటీ ఈనాడు… నాడు మర్కజ్ రవి… ఇప్పుడు మైనర్… ఎందుకో గడగడ..!!
  • చిరంజీవి పక్కకు… కందుల దుర్గేష్ తెరపైకి… ఫాఫం అన్నగారు..!!
  • ఖర్చు, ప్లానింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్… సన్మానసభలంటే మాటలా మరి..?!
  • హరిశ్చంద్రుడు, చంద్రమతినీ లాక్కొచ్చినా సరే… ప్చ్… పండలేదు…
  • పెద్ద సార్ వచ్చాడు… ఎంజాయ్ చేస్తాడట… నీళ్లు వదలండర్రా…
  • అతి పొడవైన గూడ్స్ బండి… సరుకు రవాణాలో ఓ కొత్త దశకు తొలి అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions