.
వద్దూవద్దంటున్నా సరే… వెంకయ్యనాయుడిని యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి, ఉపరాష్ట్రపతిని చేసినప్పుడే అనుకున్నాం… ఏదో రోజు తప్పక ఆయన విలువ తెలిసి, మోడీ లెంపలేసుకుని, తిరిగి పిలుస్తాడనీ, మార్గదర్శకత్వం కోరుతాడనీ… ఈ అమిత్ షాలు, ఈ రాజనాథ్‌సింగ్‌లు, ఈ నడ్డాలు కాదు, ఈ ఆదానీలు అసలే కాదు… చంద్రబాబు ట్విన్ బ్రదర్ వంటి ఆ వెంకయ్యనాయుడే తిరిగి అల్టిమేట్ రక్షకుడనీ…
చివరకు తన ఉనికికే ప్రమాదం వాటిల్లేసరికి… అటు అమెరికా సుంకాలు, ఇటు రాహుల్ గాంధీ వోట్ల దాడులు, మరోవైపు దిగజారుతున్న ప్రతిష్ట, ఆర్ఎస్ఎస్‌తో విభేదాలు… వెరసి,, మళ్లీ వెంకయ్యనాయుడే శరణం మమ అంటాడని ఫాఫం, ఆంధ్రజ్యోతికీ తెలుసు… కాకపోతే నిశ్శబ్దమే, కాలమే అన్నీ అందరికీ నేర్పిస్తాయని వేచిచూశారు…
Ads
చివరకు ఏమైంది..? వెంకయ్యనాయుడును ఉద్దేశించి ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని కబురు పంపించినట్టున్నాడు… దేశం కోసం, ధర్మం కోసం వెంకయ్యనాయుడు ఏ రాగద్వేషాలైనా వదిలేసి, మోడీ వంటి అర్థజ్ఞానులను క్షమించి ముందుకొస్తాడు కదా… వచ్చాడు… నమ్మడం లేదా..? ఆంధ్రజ్యోతి వార్త చదవండి ఓసారి…
చదివారు కదా… ఆర్ఎస్ఎస్‌తో సయోధ్య కోసం… ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు కోసం మాత్రమే కాదు… ట్రంప్ టారిఫ్, బీజేపీ కొత్త అధ్యక్షుడు, మన ఆర్థిక- విదేశాంగ విధానాలు వంటి కీలకాంశాలపైనా చివరకు వెంకయ్యనాయుడు మార్గదర్శకత్వమే దిక్కయింది ఫాఫం మోడీకి… అందుకే 40 నిమిషాలు మోడీకి హితబోధ చేశాడు…
అంతేకాదు, ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ భవనానికి వెళ్లి… గతం గతః మనకు ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం అని ఆర్ఎస్ఎస్ పెద్దలందరినీ నచ్చజెప్పాడు… తరువాత ఐబీ అధికారులు కూడా కలిసి పలు కీలక విషయాలను ఆయనకు చెప్పారు… వాళ్లకూ హితబోధ, కర్తవ్యబోధ చేశాడు వెంకయ్యనాయుడు గారు…
ఇక ఢోకా లేదు… దేశపాలన సజావుగా సాగుతుంది… డౌట్ లేదు… ఎప్పుడైతే తనను పిలిచి మోడీ త్వమేవ శరణం నాస్తి అన్నాడో ఇక మోడీకి ఢోకా లేదు… అడ్వాణీ తదితరులను మార్గదర్శక మండల్‌కు తరిమేసినట్టే వెంకయ్యనాయుడినీ అనవసరంగా దూరం చేసుకున్నానని మోడీ బాధపడుతున్నాడో తెలియదు గానీ వెంకయ్యనాయుడు తనను క్షమించినట్టే కనిపిస్తోంది…
(old photo)
ఏమిటీ నమ్మడం లేదా..? భలేవారే… ఆంధ్రజ్యోతిలో ఇంత వివరంగా చెప్పినా నమ్మకపోతే ఇక మీ ఖర్మ..!! అవునూ, ద్రౌపది ముర్ము పదవీకాలం ఇంకెంత మిగిలి ఉంది..? సార్, వెంకయ్యనాయుడు గారూ, దేశం కోసం మీరు రాష్ట్రపతి పోస్టుకు రెడీ కావల్సిందే… ప్లీజ్..!!
Share this Article