.
నిన్నో మొన్నో ఓ చిన్న వీడియో బిట్ కనిపించింది… ఆధ్యాత్మిక ప్రచారకుడిగా కనిపిస్తున్న ఒకాయన్ని ఒకామె అడుగుతోంది…
‘‘తమిళనాడులోని చారిత్రక బృహదీశ్వరాలయం ప్రధాన ద్వారం గుండా దర్శనానికి వెళ్లిన ఇందిరాగాంధీ కొన్నాళ్లకే మరణించింది… తనతోపాటు వెళ్లిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రాంచంద్రన్ కూడా మరణించాడు…
Ads
మొరార్జీ దేశాయ్ కూడా అంతే… కానీ కరుణానిధి మాత్రం ప్రధానద్వారాన్ని అవాయిడ్ చేసి, పక్కనున్న వేరే ద్వారం నుంచి లోపలకు వెళ్లాడు, అందుకే తప్పించుకున్నాడు… అధికారంలో ఉన్నవాళ్లు ప్రధాన (సింహ) ద్వారం నుంచి గుడి లోపలకు వెళ్తే మరణిస్తారని కదా నమ్మకం…
మరి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెళ్లాడు, మరేమిటి..?’’ ఇదీ ఆమె ప్రశ్న… దానికి ఆ పెద్ద మనిషి డెస్టినీ, వాస్తు అని ఏవేవో చెప్పుకొచ్చాడు గానీ సరైన సమాధానం లేదా వివరణ చెప్పలేదు.,.
నిజమా..? నరేంద్ర మోడీ గంగాజలాలు తీసుకెళ్లాడు సరే… కానీ ఆ గుడిలో దర్శనం మీద ఉన్న నమ్మకాలు తెలియవా అనే సందేహం తలెత్తింది… కాస్త చెక్ చేస్తే… తమిళనాడులో ఉన్నవి రెండు బృహదీశ్వరాలయాలు…
మొదటిది తంజావూరులోని బృహదీశ్వరాలయం… ఇది చోళుల పాలనకాలంలోనే, 1010లో రాజరాజ చోళుడు- 1 కట్టించింది… పెరువుడైర్ కోవిల్ అంటారు దీన్ని… ప్రపంచంలోనే ఎత్తయిన విమానగోపురం, భారీ శివలింగం, ఎక్కడా గుడి నీడ కనిపించదు, విశిష్టమైన చోళ వాస్తుకళ తదితర విశేషాలున్నాయి ఈ గుడికి సంబంధించి…
ఇందులోకి ఇందిరా గాంధీ, ఎంజీఆర్ వెళ్లిన మాట నిజమే… 1984లో రాజరాజ చోళుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు… తరువాత కొన్నాళ్లకే ఆమె అంగరక్షకులు జరిపిన కాల్పుల్లో మరణించింది… ఎంజీఆర్ కూడా కొన్నాళ్లకే తీవ్ర అనారోగ్యంపాలై, మళ్లీ కోలుకోలేదు… మూడేళ్ల తరువాత 1987లో మరణించాడు… వెంటవెంట సంభవించిన మరణాలు కావు ఇవి…
ఇక మొరార్జీ దేశాయ్ ఈ ఆలయాన్ని 1977లో సందర్శించాడు ప్రధాని హోదాలోనే… కానీ తను మరణించింది 1995లో… అదీ 99 ఏళ్లు బతికి… సో, అధికారంలో ఉన్న ప్రముఖ నేతలు సింహద్వారం నుంచి గుడిలోకి వెళ్తే మరణిస్తారనేది జస్ట్, ఓ మూఢనమ్మకం మాత్రమే…
పైగా ఈ శాపం ఎలా వచ్చిందో చెప్పడానికి… రాజరాజ చోళుడికీ తన గురువుకూ నడుమ సంస్కృత- తమిళ భాషల్లో అర్చనల మీద విభేదాలు అంటూ ఏవేవో కథలు అల్లబడ్డాయి… ఆ కథల్ని కాసేపు వదిలేస్తే… మరి కరుణానిధి..?
తను వీర నాస్తికుడు… తన జీవితకాలం మొత్తం హిందూ దేవుళ్లను నిందించిన ఆయన అధికారిక కార్యక్రమాల కోసం గుడిని సందర్శించాడు… కానీ అంతటి నాస్తికుడు అయి ఉండీ, ఇలాంటి నమ్మకాలను దగ్గరకు రానివ్వనివాడే అయినా సింహద్వారాన్ని (కేరళాంతన్ ప్రవేశద్వారం) అవాయిడ్ చేసి, శివగంగ పార్క్‌గేట్ అని పిలవబడే పక్క ద్వారం నుంచి లోపలకు వెళ్లాడు…
దేవుళ్లు, నమ్మకాలు, మహత్తులు అన్నీ ట్రాష్ అని చెప్పే కరుణానిధి ఎందుకు భయపడ్డాడు..? పైకి అలా కనిపిస్తాడు గానీ ముఖ్యమైన విషయాలకు జ్యోతిష్యులను సంప్రదిస్తాడని అప్పట్లోనే చో రామస్వామి వెక్కిరించాడు… గుడి సహస్రాబ్ది వేడుకల కోసం పక్క ద్వారం అనగా శివగంగ పార్క్ గేట్ గోడను కొంత కూల్చేసి, వీవీఐపీల ప్రవేశం కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు… సో, నమ్మకాలకు, భయాలకు ఎవరూ అతీతం కారన్నమాట…
మరి మోడీ..? ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల సందర్శించింది తంజావూరులోని ఈ బృహదీశ్వరాలయం కాదు… తను వెళ్లింది గంగైకొండ చోళాపురంలోని బృహదీశ్వరాలయం… ఇవి రెండూ వేర్వేరు… ఈ గంగైకొండ ఆలయాన్ని రాజరాజచోళుడి కొడుకు రాజేంద్ర చోళుడు-1 నిర్మించాడు 1035లో… రెండూ ఒకేతీరులో ఉంటాయి గానీ, తంజావూరు విమానగోపురంకన్నా ఉద్దేశపూర్వకంగానే తక్కువ ఎత్తుతో విమానగోపురాన్ని కట్టించాడు ఇక్కడ…
సో, మోడీ బృహదీశ్వరాలయాన్ని దర్శించాడు, అప్పట్లో ఇందిరాగాంధీకి అయినట్టే తనకూ ఏదో ప్రమాదం తప్పదు అనే వార్తలు, అభిప్రాయాలు ఉత్త హంబగ్… అప్పట్లో గంగైకొండ ఆలయ విగ్రహాన్ని గంగాజలంతో అభిషేకించాడు ఆ రాజు.,. తను గంగాపరీవాహక ప్రాంతాల్ని జయించి, ఆ ఉత్సవ సంకేతంగా గంగాజలాన్ని తెచ్చాడు… మోడీ గంగాజలాన్ని తీసుకుపోయింది ఓ స్పిరిట్యుయల్ సిగ్నల్… రెండూ వేర్వేరు… లింక్ లేదు..!!
సేమ్, ఈ రెండు బృహదీశ్వరాలయాల తరహాలోనే దారాసురంలో 1166లో రాజరాజ-2 చోళుడు మరో గుడి కట్టించాడు… దాన్ని ప్రధానంగా ఐరావతేశ్వర ఆలయం అంటారు… కాబట్టి ఇక్కడ పొరబడే అవకాశం లేదు… ఇందిర, ఎంజీఆర్, కరుణానిధి, మొరార్జీ దేశాయ్ దర్శించిన గుడి వేరు, మోడీ వెళ్లిన గుడి వేరు కదా… మూణ్నాలుగు ఎఐ ప్లాట్‌ఫారాలను అడిగితే అన్నీ మోడీ వెళ్లింది తంజావూరు గుడికే అని పొరపడ్డాయి..!!
Share this Article