.
విమానం రెక్కలు విప్పి ఆకాశంలో ఎంతెత్తుకు ఎగిరినా నేలకు దిగాల్సిందే. రన్ వే మీద ల్యాండయిన విమానం రెక్కల్లో ఇంధనం నింపుకుని, పొట్టలో ప్యాసింజర్లను పొదివి పట్టుకుని మళ్ళీ పక్షిలా గాల్లోకి ఎగరాల్సిందే.
త్రేతాయుగం నాటికే ఇప్పటి డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ కంటే మెరుగైన పుష్పక విమానాలు ఉండేవని రామాయణం సుందరకాండను ప్రస్తావిస్తూ నమ్మేవారు నమ్ముతారు. నమ్మనివారు కేవలం వాల్మీకి ఊహగా, కవి కల్పనగా కొట్టిపారేస్తారు.
Ads
1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా విమానాన్ని గాల్లో నడిపిన క్షణం నుండి రెక్కలు కట్టుకుని మనం దాటిన దేశాలెన్నో! ఖండాలెన్నో! సముద్రాలెన్నో! దూరాలెన్నో! లెక్కే లేదు. ఒకప్పుడు విమానయానం సంపన్నులకే పరిమితం. ఇప్పుడు విమానయానం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ ఎయిర్ లైన్స్ ఒకటే. ఇప్పుడు రెక్కలు విప్పిన ప్రయివేటు విమానయన సంస్థలు లెక్కలేనన్ని.
ప్రయాణికులను దోచుకోవడంలో పోటీలుపడే విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాయా అంటే… సమాధానానికి దేవుడే దిక్కు. ఆమధ్య అహ్మదాబాద్ నుండి లండన్ కు టేకాఫ్ ఆఫ్ అవుతూ రన్ వే దాటీ దాటకముందే మెడికల్ కాలేజీ మీద పడితే ఒక్కడు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయారు.
విమానం ఇంజిన్ కు ఇంధనం సరఫరా కావడానికి నొక్కే స్విచ్ ను ఒక పైలట్ ఆపడంవల్లే ఈ పెను ప్రమాదం జరిగిందని విచారణలో తేలినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అలా ఏమీ లేదు… అది కారణం కాదని మీడియాకు అధికారిక లీకులిచ్చారు కానీ… అంతటి ప్రమాదానికి అసలు కారణమేమిటో ఇప్పటికీ లోకానికి తెలియలేదు.
ఈలోపు విమానాశ్రయాల్లో ఎదురెదురుగా విమానాలు ఢీ కొట్టుకోబోయి ప్రయాణికుల పూర్వజన్మల పుణ్యఫలంవల్ల చివరి నిముషంలో పక్కకు తప్పుకుని వెళ్లిన సంఘటనలు ఒకటి రెండు జరిగాయి. తాజాగా కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి… అత్యవసరంగా చెన్నయ్ లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా ల్యాండింగ్ కు రన్ వే ఖాళీ లేక రెండు గంటలు చెన్నయ్ నగరం మీద మేఘాల్లో చక్కర్లు కొడుతున్నప్పుడే విమానంలో సగం మందికి పై ప్రాణాలు పైనే పోయాయి. తీరా రన్ వే ఖాళీ అయి… ల్యాండింగ్ కు గ్రౌండ్ కంట్రోల్ ఏటీసి అనుమతి వచ్చాక విమానాన్ని దించబోతే… రన్ వే మీద మరో విమానం అడ్డంగా ఉండడంతో అప్పటికప్పుడు విమానాన్ని కొద్దిగా పైకి లేపడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
అబ్బే… అలాంటిదేమీ లేదు… విమానంలో ఉన్న కాంగ్రెస్ ఎంపి కె. సి. వేణుగోపాల్ దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని చెన్నయ్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొట్టిపారేస్తున్నారు…
ఈనేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు ఇవి:-
# ఎదురుగా విమానం అడ్డుగా ఉందో లేదో పైలట్లతోపాటు ప్రయాణికులు కూడా చూసి చెప్పడానికే టేకాఫ్, ల్యాండింగ్ అప్పుడు కిటికీ తలుపులు తెరిచి పెడతారు. బాధ్యతగల ప్రయాణికులు ఇకపై ఎదురుగా ఏముందో ఒక కన్నేసి ఉండాలి!
# ఏటీసీ, ఆటోమేటిక్ సాంకేతిక వ్యవస్థలకంటే మన ఎడ్లబండి సైగలు, భాషలు కూడా పైలట్లకు నేర్పి… విమానం ముందు నౌకలకు పెట్టినట్లు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికయినా వినిపించేలా పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టాలి!
# రన్ వే లు బాగా బిజీగా ఉంటే మహానగరాల ఓఆర్ఆర్ లలో విమానాలను దించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి!
# ఒక్కో పైలట్ కు ఎన్ని వేల గంటల ఫ్లయింగ్ టైమ్ అనుభవముందో చెబుతున్నట్లే వారి సర్వీసులో ఎన్ని సార్లు విమానాలు అడ్డుగా ఉన్నా సునాయాసంగా, భద్రంగా, చాకచక్యంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలిగారో కూడా చెప్పాలి. వీలయితే ఫ్లైట్ స్టిమ్యులేటర్ మొదలు అసలు విమానం నడపడం దాకా శిక్షణలో విమానాల అడ్డును ఎలా దాటాలో శాస్త్రీయంగా, ప్రాక్టికల్ గా నేర్పాలి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article