.
‘‘నేను ఎవరినీ శత్రువుగా చూడటం లేదు… నాకు శత్రువు కావాలంటే ఓ రేంజ్ ఉండాలి… కోపాన్ని ప్రదర్శించడానికి సీఎంను కాలేదు… అలా చూపితే నాకంటే మూర్ఖుడు ఉండడు…
వారి దుఖానికి నా గెలుపు ఒక్కటి చాలు… నేను సీఎంగా సంతకాలు చేస్తుంటే వాళ్ల గుండెలపై గీతలు పడుతున్నయ్… వాళ్లు చేసిన పాపాలకు వాళ్లే పోతారు… ఐనా ఆల్రెడీ పెద్దాయన తనే స్వీయ జైలు శిాక్ష విధించుకున్నాడు కదా…
Ads
జైలులో పోలీసులుంటారు… ఫామ్‌హౌజులోనూ పోలీసులే ఉంటారు… అప్పుడుప్పుడూ విజిటర్లు వస్తూ పోతుంటారు… ఇంకా వేరే శిక్ష దేనికి..? ఏదో చేయబోయాడు, ఉన్నది పోయింది, ఉంచుకున్నదీ పోయింది… నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను… ’’
……….. అవును, ఇవన్నీ రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన భావాలే… వేర్వేరు సందర్భాల్లో కావచ్చుగాక… తన మాటలు ఇలాగే ఉంటున్నాయి ఈమధ్య… ఓ చిన్న ప్రశ్న పాలకా..? నాయకా..?
ఎవరి పాపాన వాళ్లే పోయే పక్షంలో మరి ఇన్ని విచారణలు దేనికి పాత ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై…! వదిలేస్తే దేవుడే చూసుకుంటాడు కదా… వాళ్ల పాపాలే వాళ్లను శిక్షిస్తాయి కదా… మరెందుకు కోట్ల ఖర్చుతో ఈ విచారణలు, ఈ దర్యాప్తులు… ఆయన కూడా సకల పాపపరిహార్థం ఏవో యాగాలు, హోమాలు చేసుకుంటాడు ఫాఫం…
అందుకేనా..? కేటీయార్ అరెస్టుకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెనుకాడుతోంది..? ఫాఫం, ఆయన కూడా మానసికంగా రెడీ అయిపోయి, జైలులో ఏమేం వ్యాయామాలు చేయాలో, ఏం డైట్ మెయింటెయిన్ చేయాలో కూడా ప్రిపేరైపోయాడు… నువ్వే కదా తీవ్రంగా నిరాశపరిచావు తనను..?
అవునూ, ఆ పాత ప్రభుత్వం అరాచకంగా పాలిస్తోంది, అక్రమాలు చేస్తోంది, దీటుగా మాట్లాడుతున్నావు, నువ్వయితేనే ఆ అక్రమాల నిగ్గు తేల్చి శిక్షిస్తావు అని కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది… ఇదేమిటిలా అకాల వైరాగ్యం నాయకా..? ప్చ్, తెలంగాణ సమాజం ఏదేదో ఆశించింది నీ నుంచి..! నువ్వు జైలు నుంచి బయటికి రాగానే మీసాలు తప్పి, నీ అంతు చూస్తాను అని భీషణ ప్రతిజ్ఞ ఏదో చేసినట్టు కూడా గుర్తుంది…
కోపం అక్కర్లేదు, పగ అక్కర్లేదు, ప్రతీకారం అక్కర్లేదు… సరే గానీ… ప్రభుత్వం తన పని తాను చేయాలి కదా… ఎవరు చేస్తేనేం..? తప్పొప్పులను తెలంగాణ సమాజం ఎదుట ఉంచాలి కదా.., మీ పార్టీయే కదా, నువ్వే కదా ఎన్నికల ముందు బోలెడు ఆరోపణలు చేసింది… ప్రభుత్వం వచ్చాక కూడా…? మరి అవన్నీ లాజికల్ ఎండ్‌కు తీసుకుపోవాలి కదా…
పోనీ, ఎవరి పాపాన వాళ్లే పోతారు అనుకుంటే… ఓ విధాన ప్రకటన చేసెయ్… కేసీయార్‌ను, కేటీయార్‌ను, హరీష్ రావును క్షమించేస్తున్నాను అని… (అది ఓ సీఎంగా చేయకూడని పనే ఐనా సరే)… ఎహె, నన్ను క్షమించడానికి రేవంత్ రెడ్డి స్థాయి ఎంత..? నన్ను క్షమించేంత సీన్ ఉందా తనకు అనుకుని… కేసీయారే ఫామ్ హౌజ్ వీడి, బయటికి వచ్చి.., తనే కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసి, లొంగిపోతాడో ఏమో..!!
Share this Article