.
అలా బోల్తా కొట్టించా … ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయం … ఎర్రంనాయుడు , సముద్రాల వేణుగోపాలచారి ఎంపీలు … బహుశా కేంద్రంలో మంత్రులు కూడా కావచ్చు ….
ఏదో సమాచారం వేణుగోపాలచారి నుంచి తీసుకొని వార్త రాశా … అప్పుడు బ్యూరో చీఫ్ chvm కృష్ణారావు …. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు … అప్పట్లో బ్యూరో చీఫ్ అంటే అద్దాల గదిలో కూర్చుని టివి చూస్తూ కాలం గడిపే వారు కాదు …
Ads
రిపోర్టర్లకన్నా ఎక్కువ తిరిగేవారు . రిపోర్టర్‌కు ఒక్క పార్టీ సోర్స్ ఉంటే చీఫ్‌కు అన్ని పార్టీల్లోనూ సోర్స్ ఉండేవి … చివరకు క్రైం రిపోర్టింగ్‌లోనూ కృష్ణారావుకు సోర్స్ ఉండేది … ఒక్క స్పోర్ట్స్‌లో తప్ప అన్నింటిలోనూ ఉండేది … అన్ని పార్టీలోనే కాదు, అధికారుల్లో కూడా మంచి సోర్స్ ఉన్న జర్నలిస్ట్ …
నేను ఫైల్ చేసిన వార్త చూసి, ఇది నీకు ఎవరు ఇచ్చారు అని కృష్ణారావు అడిగారు … బాస్ కాబట్టి చెప్పను అనలేను కదా… చెబితేనేమో వేణుగోపాలచారికి ఫోన్ చేసి మాట్లాడతాడు … నా సోర్స్ పోతుంది … ఓ సందిగ్దత…
ఎవరు చెప్పారు అని తను అడగగానే ‘ఎర్రంనాయుడు చెప్పాడు’ అని బదులిచ్చాను … ఎర్రంనాయుడు కృష్ణారావు కు మంచి ఫ్రెండ్ … ఎర్రంనాయుడు పేరు చెప్పాక ఏం జరుగుతుందో నాకు తెలుసు ….
అందుకని అలా చెప్పేసి, బయటకు వెళ్లి, ఎర్రంనాయుడుకు ఫోన్ చేసి… ఇలా జరిగినట్టు తెలిసింది అని వేణుగోపాలచారి చెప్పిన విషయమే తన దగ్గర ప్రస్తావించి, అదే విషయం మీద ఏదేదో మాట్లాడాను …
ఇప్పుడు కృష్ణారావు ఎర్రంనాయుడుకు ఫోన్ చేసి, ఈ విషయం నిజమా ? నువ్వే చెప్పావా ? అని అడిగితే… చెప్పలేదు అని మాత్రం అనడు… ఔను,, మురళి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడాడు అని అంటాడు… నాకు అది చాలు …
ఇప్పుడంతా వాట్సాప్ జర్నలిజమే … నిజంగా ఏం జరుగుతుందో తెలియడం లేదు … ప్రతి మంత్రికి పిఆర్ఓ ఉంటున్నాడు . పిసిసి ప్రెసిడెంట్ మొదలుకొని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకూ పిఆర్ఓ లు … దీనితో రిపోర్టర్లకు ఫీల్డ్ లో తిరగాల్సిన శ్రమ తగ్గింది ….
నిజంగా ఏం జరుగుతుంది అని తెలిసే అవకాశం కూడా తగ్గింది . అవకాశమే కాదు, అవసరం కూడా తగ్గింది . ఢిల్లీలో రాహుల్ – రేవంత్ దోబూచులాటలో పత్రికలు వాళ్ళ పార్టీ విధానాల ప్రకారం రాస్తున్నారు కానీ నిజమేమిటో తెలియడం లేదు …
కృష్ణారావు ఉంటే రాహుల్ సమాచారం కూడా ఇట్టే పట్టేసేవారు అని భండారు శ్రీనివాసరావు గారితో మాట్లాడుతూ కృష్ణారావు లేని లోటు గుర్తు చేశా …. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓరోజు కృష్ణారావు చెప్పిన ఓ విషయంతో తెలంగాణ ఏర్పాటుపై మరింత ధీమా ఏర్పడింది …
అసదుద్దీన్ సోనియా గాంధీని కలిసినప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసి తీరుతాం అని చెప్పడంతో పాటు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు … అసదుద్దీన్ ఈ విషయాన్నీ కృష్ణారావుతో పంచుకున్నాడు … అదే నిజం అయింది … ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలలోనూ కృష్ణారావుకు సోర్స్ ఉండేవి …
రజా హుసేన్ ఆ కృష్ణారావు గురించి రాసిన పోస్ట్ చూసి ఇదంతా గుర్తుకు వచ్చింది … ఇప్పుడంతా పార్టీలు చెప్పిన వార్తలే తప్ప అసలు వార్తలు తెలియడం లేదు …. ఓనర్లు పార్టీల పంచన చేరి సంపన్నులు అవుతుంటే – రిపోర్టర్లు, చీఫ్ రిపోర్టర్లు వృత్తికి కట్టుబడి ఉండాలి అని కోరుకోవడం అత్యాశేనేమో…. బుద్దా మురళి
Share this Article