మిత్రులు Prabhakar Jaini వాల్ మీద కనిపించింది ఇది… ఎవరో మిత్రుడు మరాఠీలో రాసిన పోస్టును తను తెలుగులోకి అనువదించి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు… ఇంట్రస్టింగుగా అనిపించింది… విషయం ఏమిటో ముందుగా తెలుసుకుందాం… ‘‘నాసిక్ హై వే… రోడ్డు మీద వెళ్తున్న జనాల వంక ఓ వృద్ధ జంట ఆసక్తిగా చూస్తోంది… చూడటానికి పేదవాళ్లలా ఉన్నారు… ఏదో అవసరంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు… ఆహారమో, ఇంకేదైనా సాయం కావాలో ఏమో… వెళ్లి అడిగాను… వాళ్లు మొహమాటపడుతున్నారు… వంద రూపాయల నోటు ఇచ్చాను… నిరాకరించారు… ఏమిటమ్మా..? అసలు ఎవరు మీరు..? ఎటు వెళ్తున్నారు..? ఏమిటీ మీ కథ, మీ వ్యథ అనడిగాను… వాళ్లు చెప్పిన వివరాలు విని మతిపోయింది… 2200 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన మూడు నెల్లో పూర్తి చేసి, ‘ద్వారక’కు తిరుగు ప్రయాణంలో ఉన్నారట వాళ్లు… మరో నెలలో ఇంటికి చేరుకుంటాం అన్నారు వాళ్లు… ఇంతకీ ఏమిటి వీళ్ల కథ..?
‘‘నా చిన్నప్పుడు నా రెండు కళ్లూ పోయాయి… అమ్మ ఓ డాక్టర్ దగ్గరకు తీసుకుపోయింది… ఈ డాక్టర్ మొత్తం పరీక్షలు చేసి, ప్రపంచంలో ఏ కళ్ల డాక్టరూ నాకు తిరిగి కళ్లు తెప్పించలేడు అని తేల్చేశాడుట… నేను చికిత్స చేయను అన్నాడు… కానీ అమ్మ వినిపించుకోలేదు… పట్టుపట్టింది… మీరు ఆపరేషన్ చేయండి, ఫలితం దేవుడి ఇష్టం… మానవ ప్రయత్నం మనం చేయాలి కదా అని వేడుకుంది… అంతేకాదు, నాకు కంటిచూపు గనుక వస్తే, నన్ను కాలినడకన పండరిపూర్, తిరుపతి యాత్రకు పంపిస్తానని ద్వారక గుడిలో మొక్కుకుంది… ఆపరేషన్ సక్సెసైంది… కంటిచూపు వచ్చింది… అదుగో ఇదుగో అంటూనే ఏళ్లు గడిచాయి… అమ్మ కోరిక ప్రకారం యాత్రకు పూనుకున్నాను… దర్శనాలు, మొక్కులు తీర్చుకోవడాలు అయిపోయాయి… ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నాం… ద్వారకలో పాదయాత్ర ముగించాలి…’’ ఇదీ ఆయన చెప్పిన కథ… మరి నువ్వెక్కడివే పాదయాత్ర చేయొచ్చు కదా, వెంట ఈమె ఎందుకు అనడిగాను…
Ads
దానికి ఆమె బదులిచ్చింది… ‘‘నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్లడం ఇష్టం లేదు… నెలల సమయం తీసుకుంటుంది… అందుకని నేనూ వస్తానన్నాను… ఆయన కూడా సరే అన్నాడు… ఇద్దరమూ కలిసి నడుస్తూ, ఎక్కడో ఓచోట ఆగడం, వండుకోవడం… అనుభవాల్ని జంటగానే స్వీకరించడం… కష్టమేమీ లేదు… సరదాగానే ఉంది… నడక కూడా అలవాటైపోయింది…’’ అని నవ్వేసింది… నేను మొదట్లో గమనించలేదు గానీ ఇద్దరూ చక్కటి ఇంగ్లిషు, హిందీల్లో మాట్లాడుతున్నారు… చదువుకున్నవాళ్లే… ఇంతకీ మీరేం చదువుకున్నారు అనడిగాను… వాళ్ల జవాబు విని మతిపోయింది మళ్లీ… ఆయన ఆక్స్ఫర్డ యూనివర్శిటీలో ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేశాడు… ఆమె కూడా లండన్‌లోనే హ్యూమన్ సైకాలజీలో పీహెచ్డీ చేసింది… బాగా చదువుకున్నారనే ఛాయలే కనిపించలేదు నాకు… వాళ్ల పేర్లు కూడా చెప్పారు… ఆయన పేరు దేవ్ ఉపాధ్యాయ్… ఆమె పేరు సరోజ్ ఉపాధ్యాయ్… వాళ్లకు వచ్చే పెన్షన్లను అంధులకు సాయం చేసే ఓ ట్రస్టుకు విరాళంగా ఇచ్చేస్తుంటారట…’’
ఇదండీ ఆ కథ… లోక్మత్, ఇతర పత్రికల్లో కూడా చదివిన వార్తే… 2019 సెప్టెంబరున రాశారు ఈ వార్త… ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ సర్క్యులేట్ అవుతోంది… తప్పులేదు… ఇలాంటి కథనాలతో ప్రమాదం ఏమీలేదు… దేవుళ్లపై వాళ్ల విశ్వాసాలు, తల్లి మొక్కు తీర్చడానికి అంత దూరం కాలినడకన ప్రయాణించడం వాళ్ల ఇష్టం… అయితే దాదాపు 4 నెలల పాటు, 4500 కిలోమీటర్లు నెలల కొద్దీ ప్రయాణించడం అనే పాయింటే ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించేది… అంటే రోజూ దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్లు నడవాలి… ఏ ఇబ్బందీ లేకుండా ఈ పాదయాత్ర జరగడానికి మంచి ప్లానింగ్ అవసరం, వసతికీ, తిండికీ బేసిక్ సౌకర్యాలూ కావాలి… సమకూర్చుకోవాలి… వాటిని ఓ బండిలో వేసుకుని తోసుకుంటూ సాగాలి… ప్రయాసే… అసాధారణం ఏమీ కాదు… కాకపోతే ఈరోజుల్లోనూ అంతగా చదువుకున్నవాళ్లు అమ్మ మొక్కు తీర్చడం కోసం ఈ ‘ఆపరేషన్’కు పూనుకోవడం ఒక విశేషం… అన్నీ వదిలేసి, నెలల కొద్దీ, వివిధ ప్రాంతాలు చూస్తూ, జనంతో మాట్లాడుతూ, ఆగుతూ, సాగుతూ… తిరిగిన అనుభవం కూడా మరో మొమరబుల్ విశేషం..!! ఎంత మందికి చేతనవుతుంది ఇలా..!?
Share this Article