.
ఎస్, నిజమే… ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీటిన దాంతో పూర్తిగా ఏకీభవిద్దాం…
‘‘కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు… కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు… ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు…
Ads
కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం…
మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటు పోయిన మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజిని గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి…’’
కరెక్టే కదా… చివరకు చిన్నాచితకా సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మన ప్రభుత్వమే ఏమీ చేయలేకపోతోంది… చివరకు ఈడీ రంగంలోకి దిగింది గానీ… దాని కేసుల సంఖ్యతో పోలిస్తే అదీ ఏమీ సాధించే సీన్ కనిపించడం లేదు…
చిరంజీవి మరీ కంట్రీ డిలైట్ అనే వివాదాస్పద కంపెనీని ప్రమోట్ చేస్తాడు… మహేష్ బాబు సరోగేట్ యాడ్స్ చేస్తాడు… చాలామంది ఇలా… వాళ్లకు ఈ సమాజం ఏం తక్కువ ఇచ్చింది..? ఇంకా దేనికి డబ్బు కక్కుర్తి అంటే ఫ్యాన్స్ ఊరుకోరు… పైగా అవే పిచ్చి ఫార్ములా సినిమాలు… ఒక్కటీ భిన్నమైన పాత్ర ఉండదు, ఇంత ఇచ్చిన సొసైటీకి మనమేమైనా ఇద్దామనే సోయి కూడా ఉండదు…
సజ్జనార్ చెప్పింది కేవలం కమర్షియల్ యాడ్స్‌లో రజినీకాంత్ నటించకపోవడం గురించి… ఆ డబ్బుకు కక్కుర్తిపడకుండా, సొసైటీకి నష్టం చేయకుండా ఉండటం గురించి… గ్రేట్… తను ఏ వాణిజ్య ఉత్పత్తి గురించి కాస్త మంచిగా చెప్పినా తన అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు, అందుకని వాటికి దూరంగా ఉంటున్నాననే రజినీ ఉద్దేశం కూడా గ్రేట్… కానీ అది ఇక్కడికే, ఈ అంశానికే పరిమితం…
ఎందుకంటే… తన వయస్సు 74 ఏళ్లు… 50 ఏళ్ల కెరీర్.,. ఇంకా ఇంకా ఎన్నేళ్లు ఈ రొడ్డకొట్టుడు ఫార్ములా సినిమాలు..? మానవాతీత శక్తుల హీరోయిజం వేషాలు, కథలు… సొసైటీకి ఏమైనా చేశాడా..? నిల్… చిరంజీవికి చెప్పుకోవడానికి ఓ బ్లడ్ బ్యాంకుంది, బాలకృష్ణకు కేన్సర్ హాస్పిటల్ ఉంది, మహేశ్ బాబు గుండె ఆపరేషన్లు చేయిస్తాడు… చివరకు బెట్టింగ్ యాప్స్ నిందితుడు ప్రకాశ్ రాజ్‌కూ ఓ దత్తగ్రామం ఉంది… మరి రజినీ..?
వందల కోట్ల సినిమాలు, హక్కులు, డబ్బులు… ఎంతసేపూ ఇదే యావ… రాజకీయాలంటే పిరికి… జయలలితతో వైరం మొదలైన ఆనాటి నుంచీ ఈనాటికీ పొలిటికల్ ఎంట్రీ అంటే భయమే… సినిమా ఫైట్లకు ఆరోగ్యం సహకరిస్తుంది గానీ, రాజకీయాలకు సహకరించదట… పోనీ, మోహన్‌లాల్, మమ్ముట్టిలా భిన్నమైన పాత్రలతో అలరిస్తాడా..? అదీ నిల్…
కూలీ సినిమాయే తీసుకొండి… ఎంతటి అడ్డదిడ్డం కథ, కథనలోపాలు… ఆ వసూళ్ల లెక్కల గురించి వదిలేయండి, వాటి బాగోతాలందరికీ తెలుసు… ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కార్టెల్ నడిపే విలన్లకు కూడా శవాల్ని మాయం చేయడం తెలియదు… ఓ బర్నింగ్ మెషిన్ అట… హేమిటో… అసలు రజనీకాంత్ ఫ్యాన్స్‌కే మింగుడుపడటం లేదు… చివరకు తమిళంలోనే మిక్స్‌డ్ టాక్…
అదే సొసైటీ అడిగేది… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది మహాశయా… ఇంకా ఇంకా సమాజం వందల కోట్లను ఇస్తూనే ఉండాలా..? ప్లాటినం జుబిలీ వయస్సు… అవతార్ బాబా శిష్యుడిని అంటావు… మాట్లాడితే హిమాలయాలు, యోగులు అంటావు..!! హేమిటో..!!
Share this Article