.
Raghu Mandaati
….. మనం గమనించం కానీ, కొన్ని విషయాలు ఫోటోల్లో చూసినప్పుడు గతం తాలూకు విషయాలను వెనక్కినెడుతూ వర్తమానం వరకు ఎంత దూరంగా ప్రయాణించామోనని…
ఉదయం మొదలవగానే ఇంట్లో ఒక ప్రత్యేకమైన గంధం వ్యాపించేది. నూనె సువాసన, కొత్తగా మరిగిన వేడి నీటి ఆవిరి, కొన్ని సార్లు జమవాయిల్ ఆకులను కానీ, వేప ఆకులను కానీ, గళ్ళ ఉప్పు పసుపు కానీ వేసి కట్టెల పొయ్యి మీద కొప్పెరలో చాలా సేపు నీళ్ళని మరిగిస్తున్నప్పుడు వచ్చే వేడి వాసన, సున్నిపిండి పరిమళం… వీటన్నీ కలిసిపోయి ఒక పసితనపు గీతంలా వినిపించేవి.
Ads
అటు పక్కనే కిటికీ తలుపులు ఓపెన్ చేసి వుంచినప్పుడు, ఆ పొగమంచు గాలిలో ఆవరణలోని నల్లని గోడలపై కొబ్బరి ఆకుల నీడలు ఆడేవి. ఆవరణలో పసి ఎద్దు గాలిని వాసన చూసి గుసగుసలాడుతుంటే, కోళ్ళ కూతతో పొలాలనుంచి మేల్కొన్నట్టుండేది.
ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు ఉదయం మబ్బుల గాలి, కొబ్బరి తోటల మధ్య సూర్యకాంతి. ఆ ఇంటి ఆవరణలో కప్పిన చూరులోంచి మెల్లగా పొగరేగుతుంది. ఒక బామ్మ చిన్నారిని తన మోకాల్లపై బోర్లా పడుకో పెట్టి గోరువెచ్చని నువ్వుల నూనె రాస్తోంది.
పసిపిల్లాడిని దగ్గరికి తీసుకున్నప్పుడు బుగ్గలపై, జుట్టులో పూల వాసనతోనే పెరిగినట్టే ఉంటుంది. చంటి పిల్లలను బామ్మ చేతుల్లోకి తీసుకున్నప్పుడు, ఆ చేతుల స్పర్శలో శతాబ్దాల సంస్కృతి దాగి ఉండేది.
మొదట బిడ్డ శరీరమంతా నూనె రాసేవారు. ఆ నూనె కేవలం శరీరానికి మర్ధన కాదుగానీ, ఒక మాతృత్వపు కవచం.
ప్రతి వేళ్ల తాకిడి, ముద్దుగా వేళ్ళతో చేసే ఒత్తిడి బిడ్డ శరీరానికి బలం ఇస్తూ, ఆత్మకు సాంత్వన ఇస్తూ ఉండేది.
అది ఒక ధ్యానం లాంటిది.
తర్వాత ప్రత్యేకమైన సున్నిపిండి.
చర్మం మీద రుద్దితే బిడ్డ నవ్వేది, ఏడ్చేది, అలిగి మళ్లీ అమ్మ ఒడిలో చేరేది.
ఆ సున్నిపిండి ఒక సహజ వైద్యమే. చెమట వాసనలు పోగొడుతుంది, చర్మానికి బలాన్నిస్తుంది, దోమలు, కీటకాలు దూరం చేస్తుంది.
అమ్మమ్మలకి ఇది ఒక శాస్త్రం, పిల్లలకి అది ఒక ఆట.
తల శనగపిండితో రుద్దినప్పుడు, చిన్నారి జుట్టు మెరుస్తూ, ఆ తల నుండి సువాసన వ్యాపించేది.
మరిగిన నీరు గిన్నెలో ఎగిసిపడుతుండగా, దానిని చల్లార్చి, ఆ వేడిని సరిపడా చూసి, ఒక్కో మగ్గుతో నెమ్మదిగా ఒకలాంటి కూని రాగం తీస్తూ, ప్రాంతానికి తగ్గట్టు గ్రామ దేవతలను చేరుస్తూ లీలగా గానం చేసేవారు…
ప్రతి నీటి చుక్క బిడ్డ శరీరాన్ని కమ్ముతుంటే, బిడ్డ ఒక్క క్షణం వణికినా, ఆ తర్వాత ఆ శరీరం మత్తులోకి జారిపోతుంది.
- ఆ తరువాతి అత్యంత పవిత్రమైన భాగం సాంబ్రాణి పొగ.
చిన్న గిన్నెలో ఎగిసే పొగలో బిడ్డను చూపించేవారు.
ఆ పొగలో ఒక అలౌకికమైన శాంతి ఉంటుంది.
అది కేవలం ఒక వాసన మాత్రమే కాదు, ఒక రక్షణ గీతం.
ఈ బిడ్డకు చెడు జరగకూడదు, దృష్టి పట్టకూడదు అనే ఆత్మీయమైన విన్నపం…
ఆ ఇంటి వెనుక ఆవరణలో పెద్ద వేపచెట్టు. దాని నీడలో మట్టి నేలపై వేప పూలు రాలుతుంటే, గాలి వీస్తే ఆ పొగ మెల్లగా కొమ్మల్లో కలిసిపోతుంది. పొలాల నుంచి వస్తున్న ఎద్దుల మ్రోగులు, చెరువులో ఆడుతున్న పిల్లల నవ్వులు ఇవన్నీ ఆ క్షణంలో కలిసిపోయి ఒక గ్రామ గీతంలా వినిపిస్తాయి.
తరువాత బిడ్డ అమ్మ ఒడిలోకి చేరుతుంది.
ఆ ఒడిలో బిడ్డ మత్తెక్కిన శరీరం అలసటతో తేలికగా మారిపోతుంది.
కళ్ళు మూసుకుపోతాయి, శ్వాస సాంత్వనగా మారుతుంది. ఆ బంగారు నిద్రలో బిడ్డ శరీరం పెరుగుతుంది, ఆత్మ విశ్రాంతి పొందుతుంది.
ఈ ఆచారం కేవలం స్నానం కాదు.
ఇది ఒక పరంపరాగత వైద్యం.
ఇది ఒక జీవన శాస్త్రం.
ఇది ఒక సంస్కృతిని నిలిపే తాత్విక గీతం.
ఈ రోజు ఆధునికతలో వేగం పెరిగినా, ఈ పద్ధతులు మెల్లగా మసకబారుతున్నా…
మనం జ్ఞాపకాలలో తిరిగి చూసుకుంటే, ఇది కేవలం ఒక స్నానం కాదు అని తెలుస్తుంది.
ఇది ప్రేమతో చేసే పూజ.
ఇది జీవనాన్ని ఆరాధించే ఒక ధ్యానం.
.
.
.
.
.
రఘు మందాటి
Share this Article