కామెడీ… సున్నితంగా, ఎవరినీ కించపరచకుండా… కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదంగా ఆనందించేలా ఉండాలి… ప్రత్యేకించి మనుషుల ఆహారం, ఆహార్యం, ఆకారం, భాష, సంస్కృతులపై వెకిలిగా స్కిట్లు గనుక ఉంటే అది నీచం… అసలైన కామెడీని వదిలేసి, క్రియేటివిటీ కొండెక్కి, చివరకు కమెడియన్లతో పిచ్చి వేషాలు వేయిస్తూ, చేష్టలు చేయిస్తూ హాస్యాన్ని పండించాలనే ఆలోచన, ప్రయత్నం మరీ నీచం… ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ ఆ కృషిలోనే బిజీగా ఉన్నయ్… మరీ అతి చేస్తున్నాయి ఈ రెండు చానెళ్లు… ఓసారి చెప్పుకోవాలి… ఎందుకంటే..? ఈ కరోనా పీడదినాల్లో జనం టీవీల్లో వచ్చే కామెడీ షోల మీద ఆసక్తి చూపిస్తుంటారు… ఇప్పుడవి కరోనాను మించి ఇన్ఫెక్షన్కు గురైనట్టు కనిపిస్తోంది…
దిగువన ఓ ఫోటో ఉంది చూడండి… మాటీవీ వాడి కామెడీ స్టార్స్ అనే షో… (తాజా రేటింగ్స్‌లో 3… పరమ దరిద్రమైన రేటింగ్స్)… ఒకరి మొహాల మీద మరొకరు పౌడర్ కొట్టుకుంటున్నారు… అది హాస్యమట… అది క్రియేటివిటీ అట… ఈటీవీ నుంచి జంపై మాటీవీలో చేరిన శేఖర్ మాస్టర్, తెలుగు సరిగ్గా మాట్లాడలేని వర్షిణి, విచిత్రంగా నవ్వే శ్రీదేవి… భలే చేరారక్కడ… వీళ్లకు తోడు స్వయంప్రకటిత ఎంటర్టైనర్ అవినాష్ సరేసరి… ఇలా పౌడర్లు కొట్టుకోవడం వెగటు పుట్టించింది… మరి ఆ జడ్జిలకు పడీ పడీ నవ్వొచ్చేంత హాస్యదనం ఏం కనిపించిందో…
Ads
అన్నింటికన్నా ఘోరం మొన్న సుడిగాలి సుధీర్ నేతృత్వంలో వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ… వెగటు కాదు, మరో పదాన్ని వెతకాలి… అంత నాసిరకంగా ఉంది… అంతకుముందు మనమే కాస్త మెచ్చుకున్నాం, గతంలో ఉన్న టీంకన్నా సుధీర్ వచ్చాక కాస్త నాణ్యత పెరిగిందీ అని… నో, నో, మల్లెమాల ప్రొడక్ట్ అంటే చెత్తచెత్తగా ఉండాల్సిందే అని మళ్లీ నిరూపించుకున్నారు… అందులోనూ ఇలాగే ఓ కమెడియన్ ఓ పెద్ద పాత్రలో అన్నం తీసుకుని, అక్కడున్న వాళ్లందరి నోళ్లల్లోనూ కొడుతూ పోయాడు… అదేం హాస్యమో… పైగా అది తమిళ, తెలుగు వంటల ప్రోగ్రాముల నడుమ తేడా అట… దరిద్రంగా ఉంది… పోనీ, ఏదో ప్రయత్నించారు సరే… ఎందుకు భయపడ్డారో తమిళ అనే పదం వచ్చిన ప్రతిచోట మ్యూట్ చేశారు… అంతేకాదు, ఏదో టీంకు గద్దలకొండ అని పేరు పెట్టినట్టున్నారు… దానికీ భయపడ్డారు… వివాదం వస్తుందని… అది కనిపించకుండా ఎడిట్ చేసి, ఆ పదం వచ్చిన ప్రతిచోటా మ్యూట్ చేశారు… మరీ ఘోరం ఏమిటంటే..? స్క్రిప్ట్, డైలాగ్స్ ఆటో రాంప్రసాద్ గనుక రాసి ఉంటే తనను చూసి జాలిపడాల్సిందే ఇక… లేక హైపర్ ఆది తన సొంత పైత్యాన్ని గనుక ప్రదర్శించి ఉంటే అది మరీ ఘోరం… చాలా డైలాగుల్లో పదాల్ని బూతు పదాల్ని పరోక్షంగా స్ఫురించేలా యథేచ్ఛగా వాడేశారు…
ఇంకా నయం… ఈ కామెడీ పైత్యపు పోటీల్లో జీతెలుగు వాడు రాలేదు… వాడికి కామెడీ ప్రోగ్రాములు చేతకావు… లేకపోతే ఈ రెండు చానెళ్లకు తోడు అదీ జతకలిసి తెలుగు కామెడీని మరింత బురదమయం చేసేది… అసలు ఈటీవీ జబర్దస్త్ అంటేనే బూతు… ఆ విమర్శ ఎంతోకాలంగా ఉన్నదే… చూస్తున్నదే… ఇప్పుడిక ఈ డ్రామా కంపెనీ దాన్ని ఇంకాస్త పెంచుతున్నది… ఆ బూతులకు తోడు ఈమధ్య జబర్దస్త్ ఎంత చెత్తగా మారిపోయిందీ అంటే… స్కిట్లలో కమెడియన్లు వాళ్ల జీతాలు, ల్యాగులు గట్రా మాట్లాడుతూ అదే హాస్యంగా భావించేస్తున్నారు… మధ్యమధ్యలో జడ్జిల పైత్యం సరేసరి… ఒక్కటంటే ఒక్క స్కిట్ పూర్తిగా ఇలాంటి ఈ పైత్యాలేవీ లేకుండా ప్రసారం జరగలేదు కొంతకాలంగా… మరీ హైపర్ ఆది ఓ ఇద్దరు కమెడియన్లు విశాఖలో బూతు రాకెట్లో పట్టుబడిన సంఘటనను వాడుకోని స్కిట్ ఉండటం లేదు… పైగా మొత్తం కామెడీ స్కిట్లలో, షోలలో మరో పైత్యమూ పెరిగింది… ఢీ, వావ్, క్యాష్, జబర్దస్త్, కామెడీ స్టార్స్, డ్రామా కంపెనీ… ఏదైనా సరే, పార్టిసిపెంట్లు రికార్డింగ్ డాన్సులు చేయాల్సిందే… ఇప్పుడిక వాటర్ బెలూన్లతో కొట్టుకోవడాలు, నేల మీద జారుడు పదార్థం ఏదో పోసి వాటి మీద కమెడియన్లను నడిపిస్తూ, పడేస్తూ, గెంతులు వేయించడం, స్కేటింగ్ షూస్ కట్టి కమెడియన్లు ఉసురుపోసుకోవడం, చెంపల మీద కొట్టేయడం, ఏదో రాడ్‌ను పట్టుకుని తిరుగుతూ కింద నీళ్లలో పడిపోవడాలు… ఆడ కమెడియన్లను తడిపేస్తూ, వేదిక మీదే రెయిన్ డాన్సులు కూడా…….. ఇది హాస్యమేమిట్రా..?!
Share this Article