ఆ షో పేరు మాత్రమే ఆలీతో సరదాగా… కానీ మరీ అంత పూర్తి సరదాతనం ఏమీ ఉండదు షోలో… ఏ సెలబ్రిటీ వచ్చినా సరే, ఏదో వ్యక్తిగత విషయాన్నిఆలీ ద్వారా కెలికించి, కన్నీళ్లు పెట్టేలా చేసి… ప్రొమో కట్ చేయించి… దాన్నే ఎడాపెడా ప్రచారం చేస్తుంటుంది ఈటీవీ… ముందే చెబుతారేమో ఏమో… ఏడవడం తప్పదు అని…! ఎక్కువగా వచ్చేది సినిమా వాళ్లే కాబట్టి అప్పటికప్పుడు అర్జెంటుగా ఏడ్చేస్తారు సెలబ్రిటీలు కూడా… అంటే వాళ్ల కష్టాలు ఫేక్ అని కాదు… కృత్రిమంగా ఈ ఏడుపు కోసం కుటుంబ విషయాలు, వ్యక్తిగత కష్టాల్ని ప్రస్తావించడం అనేది అబ్సర్డ్, ఆడ్… నిజానికి ఇది లోతుగా సాగే ఇంటర్వ్యూ ఏమీ కాదు… ఆలీ అలాంటి ఇంటర్వ్యూలు చేయలేడు… ఓ చిట్‌చాట్ టైపు… మరి అందులో కూడా ఈ ఏడుపులు అవసరమా అనే ప్రశ్న కొన్ని సైట్ల నుంచి ఈమధ్య బాగా వినిపించింది… హహహ… దానికి మొన్నటి షోలో ఆలీయే సమాధానం ఇచ్చాడు… అది మరింత సరదా అనిపించింది…
వెటరన్ నటులు సురేఖా వాణి, రజిత జాయింట్ గెస్టులు… ఈ ఇద్దరూ ఎలా జంట అయ్యారో తెలియదు… ‘‘నా షోలో సెలబ్రిటీలు తప్పకుండా ఏడవాలనీ, అలాంటి ప్రశ్నలు కావాలనే వేస్తానని అందరూ అంటున్నారు… నిజానికి నాకు ఏ పాపమూ తెలియదు… వచ్చిన సెలబ్రిటీతో చిట్‌చాట్ మాత్రమే నా పని… ఎవరిని పిలుస్తున్నారో కూడా నాకు కొన్నిసార్లు స్టూడియోకు వచ్చేదాకా తెలియదు… అందుకని ఈ ఏడుపు పాపంతో నాకు సంబంధం లేదు’’ అన్నట్టుగా వివరణ ఇస్తూ వెళ్లాడు… ఏడుపులు, బొబ్బలు నిజమే కానీ, అందరూ ఎత్తిచూపుతున్నారు కానీ, నా పాపం మాత్రం లేదు సుమా అని చెబుతున్నట్టుగా సాగింది… సురేఖావాణి కూడా ‘ఆలీ ఏం అడిగినా సరే ఏడవకూడదని ఫిక్సయి పోయి వచ్చాను’ అని చెప్పింది… అంటే ఆలీ షో మీద సెలబ్రిటీ సర్కిళ్లలో ఆ అభిప్రాయం, ఆ చర్చ నడుస్తూనే ఉన్నాయన్నమాట… ఏడవకూడదని ఫిక్సయిపోయి వచ్చిన సురేఖావాణి తన భర్త మరణం ప్రస్తావనకు వచ్చేసరికి ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతం అయిపోయింది… సహజమే కదా… ఆమె బతుకులో అతి పెద్ద విషాదం అది… కాకపోతే షాపింగు, పబ్బులు, రెండో పెళ్లి వంటి విషయాలొచ్చినప్పుడు కాస్త ఓపెన్‌గానే సమాధానాలిచ్చింది… పెళ్లి చేసుకోని రజిత కూడా ఏదో ప్రశ్నకు, ఎవరో వీడియోలో వచ్చి ఏదో పలకరించేసరికి ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది… సో, ఆలీ షో అంటే సెలబ్రిటీలు ఏడవాల్సిందే… సోలోగా వచ్చినా, జంటగా వచ్చినా…! అలా ఏడిపించే ప్రశ్నలు పక్కాగా ప్రిపేరై ఉంటయ్… అఫ్ కోర్స్, కొందరు ఈ ప్రశ్నల్ని లైట్ తీసుకుంటారు, కానీ అది అందరివల్లా కాదు…!! అవును గానీ… నిజమా..? సెలబ్రిటీలు ఎవరొస్తున్నారో కూడా కొన్నిసార్లు ఆలీకి ముందు తెలియదా..? అబ్బఛా… భలే పెడతావు బ్రదర్… చెవుల్లో ‘ఖాళీ’ఫ్లవర్లు..!! థాంక్ గాడ్… వచ్చే ఎపిసోడ్లో కార్తీకదీపం సీరియల్ హీరో నిరుపమ్ దంపతులు… ప్రొమో ప్లెయిన్‌గా, సరదాగా ఉంది… అస్సలు ఏడుపుగొట్టు సీన్ కనిపించలేదు..!!
Ads
Share this Article