.
“శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!”
ఇది భాగవత ప్రారంభంలో పోతన చేసిన దేవతా స్తుతి పద్యం. తెలుపు స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. శరత్కాల తెల్లని మేఘాలు,
తెల్లని చల్లని చంద్రుడు,
పరిమళాలు వెదజల్లే తెల్లని పచ్చ కర్పూరం,
తెల్ల చందనం,
తెల్లటి హంస,
తెల్లని మల్లెల హారం,
తెల్లని మంచు,
తెల్లని నురగ,
తెల్లని వెండి కొండ,
తెల్ల రెల్లుగడ్డి,
తెల్లని ఆదిశేషుడు,
తెల్లని కొండమల్లె,
తెల్ల మందారం,
తెల్లని గంగ…
పోతన తలపుల్లో సరస్వతి తట్టగానే ఇన్ని తెలుపులు ఉపమాలంకారాలుగా ఆయన ఘంటం ముందు పోటీలు పడ్డాయి. ఇన్ని తెలుపుల అందాలను మించి వెలిగే సరస్వతిని మదిలో ఎప్పటికి చూస్తానో అన్నాడు పోతన. అంటే ఆయన చూడలేదని కాదు. మనం అలాంటి సరస్వతిని చూడాలంటే ఇలా అడగాలి. ఇలా ఊహించాలి. ఇలా ప్రసన్నం చేసుకోవాలి…
Ads
పోతన ఎక్కడ తన భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తాడో అని సాక్షాత్తు సరస్వతీ దేవి బాధపడి… ఆయన ముందు కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటే-
“కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!”…. అని పోతన హామీ ఇచ్చాడంటారు.
(కాటుక కంటినీరు… పద్యం పోతనది కాకపోవచ్చు అని పండితులమధ్య చాలా కాలం చర్చ జరిగింది. అది ఇక్కడ అనవసరం)
లక్ష్మి, పార్వతి, సరస్వతి- ముగ్గురిలో మూలమై ఉన్న దుర్గమ్మను తెలుగు సాహిత్యంలో బహుశా పోతన ఆవిష్కరించినంత అందంగా ఇంకెవరూ ఆవిష్కరించలేదు. శారదనీరదేందు… పద్యం అర్థం తెలియకపోయినా చదివినప్పుడు, పాడినప్పుడు, విన్నప్పుడు సాక్షాత్తు సరస్వతి దిగివచ్చి ఆశీర్వదించి వెళ్లాల్సిన పద్యం. తెలుగు పద్యం జిగి బిగి తెలిపే పద్యం. తెలుగు అందచందాలను పద్యాల్లో పోతపోసి… తెలుగు కవిత్వ పటుత్వ మహత్వ సంపదను నిర్వచించిన పద్యం.
అలాంటి పోతనామాత్యుడు పుట్టిన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో ఇప్పుడు సరస్వతీదేవి నిజంగానే కాటుక కంటినీరు బుగ్గలపై ధారగా పడేలా వెక్కి వెక్కి ఏడుస్తోంది. అక్కడ పోతన స్మృతివనం, మ్యూజియం, కల్యాణ మండపం నిర్మించడానికి గత ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణాలు మొదలయ్యాయి. కొంత పనులు జరిగాయి.
ప్రభుత్వం మారింది. బమ్మెరలో పోతన ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రస్తుతం ముళ్ళపొదల్లో బమ్మెర పోతన చిక్కుకుని ఉన్నాడు. అంతటి పోతనకు ఇంతటి దుర్గతి ఏమిటని సరస్వతి విలపిస్తోంది. సరస్వతి బాధను చూడలేక పోతన గుండెలు బాదుకుంటున్నాడు. ఆ దారినే వెళుతూ ఉన్న మన తెలుగు పుట్టు గుడ్డి కళ్ళకు ఇది కనిపించదు. మన పుట్టు చెవిటి చెవులకు ఇది వినిపించదు.
అయినా… బమ్మెరలో మందిరాలు కట్టి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించాలని అనుకుంటున్నారు కానీ… తెలుగు పలక చేతబట్టి… తెలుగు బలపం వేలున పట్టి… తెలుగు పిల్లలు ఓం ప్రథమంగా దిద్దేది ఇంగ్లిష్ అక్షరాలే కదా! ఆ ఏ ఫార్ యాపిళ్ళు, సి ఫార్ క్యాట్లు చూసి పోతన, శారద తట్టుకోలేరు. అందుకే ఈ మందిరం ఆగిపోయి ఉందేమో! ఏమో!!
పోతే పోతాడు పోతన… మనకెందుకు?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article