Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)

August 27, 2025 by Rishi

.

జగపతిబాబు గారు హీరోగా అక్కినేని నాగార్జున గారు నిర్మించిన “ఆహా” చిత్రానికి నేను కోడైరెక్టర్.

సత్య, ప్రేమ, భాషా, అన్నామలై వంటి హిట్ చిత్రాలు తీసిన అగ్రదర్శకులు “సురేష్ కృష్ణ” గారు దర్శకులు.

Ads

ఆ సినిమాలో ఆయన ఓ అరుదైన సాహసాన్ని చేశారు.

“హీరో తన ప్రేమ గురించి బాధపడుతుంటే తల్లి (అన్నపూర్ణ), వదిన (జయసుధ), బామ్మ, తాత, అందరూ తాము తండ్రి (విజయకుమార్)ని ఒప్పిస్తామని చెప్పటం, అప్పుడే వచ్చిన ఆయనకి హీరో ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడని అబద్ధం చెప్పటం, ఈలోగా అమ్మాయి తండ్రి (చంద్రమోహన్) సంబంధం మాట్లాడటానికి రావటం, కొంత చర్చ తరువాత అతను కేవలం వంటవాడని తెలిసి హీరో తండ్రి తిట్టడం, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, అతను వెళ్ళాక తండ్రి కొడుకుని తిట్టడం, హీరోని వదిన ఓదార్చి వెళ్ళాక అన్న (రఘువరన్) ఇంట్లోకి రావటం, ఫోన్ రింగ్ అయితే హీరో లిఫ్ట్ చేస్తే అవతల నుండి ఓ ఆడ గొంతు అన్నయ్య గురించి అడగటం, ఫోన్ తీసుకున్న అన్నయ్య సార్ సార్ అంటూ మాట్లాడి అర్జెంట్ మీటింగ్ ఉందని తిరిగి వెళ్ళిపోవటం, తండ్రి అన్నయ్యని చూసైనా నేర్చుకో అని తిట్టడం, అన్నయ్య అబద్ధం ఎందుకు చెప్పాడు అని హీరో ఆలోచించడం” ,……. ఇదంతా సినిమాలో ఒక రీల్ కి సరిపోయేంత లెంగ్త్ ఉన్న సన్నివేశం.

దాదాపు తొమ్మిదిన్నర నిముషాలకు పైగా వొస్తుంది.

అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో అంతకుముందు “నిన్నే పెళ్ళాడుతా” సినిమా కోసం వేసిన ఇంటి సెట్‌నే మార్చి కొత్తరంగులు వేసిన సెట్‌లో షూటింగ్.

సాధారణంగా ఏ దర్శకులైనా ఆ సన్నివేశాన్ని ఎన్నో షాట్స్ గా విభజించి చిత్రీకరణ జరుపుతారు. అలా చేస్తే కె.బాలచందర్ గారి శిష్యుడెందుకవుతారు సురేష్‌ కృష్ణ గారు.

మొత్తం సింగిల్ షాట్‌లో చిత్రీకరించాలనుకున్నారు.

అదీ “స్టడీ క్యాం”లాంటివి ఉపయోగించకుండా కేవలం ట్రాక్ & ట్రాలీ తో… అప్పటికి “గింబల్” రాలేదు. అదెంత కష్టమో సినిమావాళ్ళకు తెలుస్తుంది.

దాదాపు 10 మంది ఆర్టిస్ట్‌లతో 12 పేజీల సీన్ సింగిల్ షాట్‌లో ఎలా సర్ అన్నాను. “చూడు” అన్నారు నవ్వుతూ.

షూటింగ్ అయ్యాక అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ని, కెమేరా అసిస్టెంట్స్‌ని, ఆర్ట్ అసిస్టెంట్స్‌ని నటీనటుల స్థానాలలో సెట్లో అటూఇటూ నడిపిస్తూ ఎప్పుడెవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెబుతూ, ఏ టైంలో కెమేరా ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎక్కడిదాకా వెళ్ళాక క్రింద పడుకుని వుండే ట్రాక్ & ట్రాలీ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు క్రింద ట్రాక్ సైలెంట్‌గా పీకేసి, దానికి రౌండ్‌ట్రాలీ ఎలా ఫిక్స్ చెయ్యాలో అంతా క్లియర్‌గా వివరిస్తుంటే మతిపోయింది అందరికీ.

ఆయన షాట్ కంపోజిషన్ అద్భుతం.

నటీనటులైతే విషయం చెప్పగానే అమ్మో సాధ్యమా అన్నారు.

అప్పుడే డైరెక్టర్‌ గారు నా నెత్తిన ఓ బండ వేశారు.”మీరేం కంగారుపడకండి. మీరు ప్రిపేర్ అవ్వండి. దేవీ మొత్తం డైలాగ్స్ ప్రాంప్ట్ చేస్తాడు”అన్నారు.

మామూలుగా సీన్‌పేపర్ చూస్తూ ప్రాంప్టింగ్ ఇవ్వడం కష్టంకాదు. కానీ కెమేరా సెట్ అంతా తిరుగుతూ వుంటుంది కనుక దాని వెనకే ఫాలో అవుతూ ఓ పక్క కింద, ప్రక్కన చూసుకుంటూ పేపర్స్ చూస్తూ ప్రాంప్ట్ చేయటం సాధ్యం కాదు.

కెమేరా వెనక నడిచేది డైరెక్టర్, కెమేరా ఫోకస్ పుల్లర్, నేను మాత్రమే. టెక్నీషియన్స్ ఎవ్వరూ సెట్‌లో ఉండటానికి అవకాశం లేదు.

అప్పట్లో డిజిటల్ కాదు. మానిటర్స్ లేవు.

అప్పట్లో షూట్‌ చేసే నెగెటివ్ క్యాన్‌లో 400 అడుగులు నెగెటివ్ మాత్రమే ఉంటుంది. స్పెషల్‌గా బోంబే నుండి 1000 ఫీట్ క్యాన్ తెప్పించారు.

రేపు షూటింగ్ అనగా ముందురోజు రాత్రి నేను నిద్రపోకుండా డైలాగ్స్ అన్నీ బట్టీ పట్టాను.

ఉదయం 9 గంటలకు నటీనటులని మేకప్ లేకుండా రమ్మని సెట్ లో కెమేరాతో సహా అన్ని కదలికలనూ వివరించారు డైరెక్టర్. వెళ్ళి మధ్యాహ్నం 4 గంటలకు మేకప్ తో రమ్మన్నారు.ఈ లోపు సెట్ అంతా లైటింగ్ చేశారు కెమేరామెన్ శరవణన్.

మధ్యాహ్నం నటీనటులు రాగానే ఒక్కసారి రిహార్సల్ చేసి టేక్ అన్నారు.

నటీనటులందరూ ప్రాప్టింగ్ చేయాల్సిన నావైపు నీదే భారం అన్నట్లు చూస్తుంటే టెన్షన్ వచ్చేసింది. షాట్ మధ్యలో ఎక్కడ ఆగినా 1000 అడుగుల నెగెటివ్ వేస్ట్ అయిపోతుంది.

డైరెక్టర్‌ గారు యాక్షన్ అనగానే యజ్ఞం మొదలైంది.

ఎవరిపని వాళ్ళు కరెక్ట్ గా చేశారు.

ఫిల్మ్ 892 అడుగులు తిరిగాక సీన్ పూర్తయ్యి డైరెక్టర్‌ కట్ అని అరిచారు. ఓకే అనగానే చప్పట్లు మారుమ్రోగాయి.

అంతసేపు కెమేరా వ్యూఫైండర్‌లోనే చూడటం వల్ల కెమేరామెన్ కన్ను కాసేపు బ్లర్ అయ్యింది.

అప్పటికప్పుడు ల్యాబ్ కి వెళ్ళింది నెగెటివ్.

ఇంతా చేస్తే తెల్లారిపొద్దున్నే చావు కబురు చల్లగాచేరింది.

1000 ఫీట్ క్యాన్స్ వాడకంలో లేకపోవటం వల్ల ఆ నెగెటివ్ ఫాగ్ అయ్యి ప్రింట్ పైన మచ్చలు వచ్చాయని ల్యాబ్ రిపోర్ట్.

మరొక దర్శకుడైతే మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోరు. కానీ ఆయన సురేష్‌కృష్ణ. నో కాంప్రమైజ్.

మళ్ళీ అందరినీ మోటివేట్ చేసి అదేతరహా చిత్రీకరణకి సిద్ధమయ్యారు.

బోంబే ల్యాబ్ వాళ్ళు ఈసారి 1000 ఫీట్ క్యాన్ చెక్ చేసి మరీ ఫ్రీగానే పంపారు.

రెండోసారి అందరూ టెన్షన్ పడకుండానే చేశారు.

ఇప్పుడా షాటే సినిమాలో ఉన్నది.

సరదాగా చూడాలనుకున్నవారు యూట్యూబ్‌లో చూడొచ్చు.

“సినిమాలో ఓ షాట్ చిత్రీకరణ జరిగిందంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది మళ్ళీ మార్పుచేర్పులుండవు”అనే స్పృహని ఎల్లప్పుడూ కోల్పోకుండానే ఉంటారు గొప్ప దర్శకులు.

ఆయనే “భాషా” సినిమాలో రజనీకాంత్‌తో “నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు” అనే డైలాగ్ చెప్పించినట్లు “సురేష్‌కృష్ణ గారితో నేనొక్క సినిమాకే పనిచేసినా అది వందసినిమాలకు సమానం…. దేవీప్రసాద్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
  • రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )
  • పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)
  • ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
  • అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
  • ర్యాప్ అస్త్రంగా ఓ యువతి చైతన్య పోరాటం..! (రమణ కొంటికర్ల)..
  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions