సరిగ్గా రాస్తే నాలుగైదు పెద్ద పుస్తకాలు అవుతుంది ఈ బెంగాలీ కొత్త ఎమ్మెల్యే బతుకు కథ… ఎక్కడ మొదలైంది, ఏ మలుపులు తిరిగింది, ఇప్పుడు ఎక్కడికొచ్చింది…. చదువుతుంటేనే ఓ అబ్బురం… మనం పదే పదే చెప్పుకున్నట్టు జీవితాన్ని మించిన కల్పన, డ్రామా ఇంకేముంటయ్..? ఎస్, డెస్టినీ మనిషిని ఎటు తీసుకుపోతుందో ఊహించలేం, ఊహిస్తే మనుషులం ఎలా అవుతామ్…? ఈయన పేరు మనోరంజన్ బ్యాపారి… ప్రస్తుతం టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు… అదీ బీజేపీ బలమైన స్థానం నుంచి… పుట్టుకతో దళితుడు… అదీ నామశూద్ర అనబడే దళిత ఉపకులం… ఇదీ ఆయన ముఖచిత్రం… మరి అసలు కథ..? అదే చెప్పుకుందాం…
బాల శరణార్థి..!
తూర్పు పాకిస్థాన్… అంటే దేశవిభజన సమయంలో బెంగాల్‌ను నిలువును చీల్చిన రోజులు అవి… ఇటు నుంచి ముస్లింలను, అటు నుంచి హిందూ సిక్కుల్ని కట్టుబట్టలతో తరుముతున్న రోజులు… విపరీతమైన హింస, అత్యాచారాలు, ఆస్తి దోపిడీలు… ఓ సివిల్ వార్… అరాచకం… ఓ చంటి పిల్లాడు, ఓ పిల్లతో ఓ దళిత కుటుంబం ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని మరీ ‘ఇండియా’లోకి వచ్చిపడ్డారు… శిరోమణిపూర్లో ఏర్పాటు చేయబడిన ఓ శరణార్థి శిబిరంలో చేరారు… ఆ పిల్లాడే మన ప్రస్తుత కథకు హీరో మనోరంజన్…
Ads
మొండిఘటం..!
వాళ్లు దళితులు, నిరక్షరాస్యులు… అటోఇటో తిరిగి ఏదో పని వెతుక్కోలేక… ఏ శరణార్థి శిబిరంలోనైనా చివరకు కుమిలిపోయేది వీళ్లే… ఈ కుటుంబమూ అంతే… ఆకలి, పేదరికం, అనారోగ్యం… భవిష్యత్తు ఏమిటో తెలియని అయోమయం… అగమ్యగోచరం… ఈ పిల్లాడు ఇక బతకడని ఓ రాత్రి బయట వదిలేశారు… కానీ మొండిఘటం బతికాడు… కానీ ఆయన సోదరి మాత్రం ఆకలితో మరణించింది… ఇక నావల్ల కాదనుకున్న ఆ పిల్లాడు ఆ వయస్సులోనే ఇల్లు (??) వదిలి పారిపోయాడు… రోడ్ సైడ్ చాయ్ బడ్డీలు, దాబాల్లో దొరికిన పనిచేస్తూ, కడుపు నింపుకుంటున్నాడు… పిల్లాడు అంటే తెలుసు కదా, కడుపులోకి కాస్త పడేసి, నానా చాకిరీ, శ్రమ దోపిడీ… ఇవే కాదు… లైంగిక దోపిడీ కూడా…!!
నక్సలైట్..!
మెల్లిగా సిలిగురి చేరాడు… అప్పుడప్పుడే నక్సలిజం పుట్టి, పెరుగుతోంది… సమాజం మీద కోపంతో ఉన్న మనోరంజన్‌ను కూడా నక్సలిజం ఆకర్షించింది… అందులో తిరిగేవాడు… అయిదేళ్లు అలా అలా గడిపేసి, ఆ తరువాత కలకత్తాకు వచ్చాడు… అప్పటికీ తల్లీదండ్రీ ఇంకా ఆ శరణార్థి శిబిరంలోనే ఉన్నారు… మనవాడి షెకల్ చూసి, గమనించి, వీడు నక్సలైటే అని తీర్మానించేసుకుని సీపీఎంలోని ఓ రౌడీ బ్యాచ్ ఓరోజు చితకబాదింది… చచ్చాడు అనుకున్నారు… మొండి కదా, మళ్లీ బతికాడు… అప్పట్లో నక్సల్స్ వర్సెస్ మార్క్సిస్టుల పరస్పర దాడులు కామన్… ఒకసారి ఒళ్లు దెబ్బలతో రాటుదేలాక ఇక భయమేముంది..? ఫుల్ టైమ్ సక్సలైట్ అయిపోయాడు…! విప్లవం, హింస తన కెరీర్ అయిపోయింది… చదువు లేదు, సంధ్య లేదు… తెలిసింది ఇదొక్కటే పని… ఓరోజు బాంబులు తయారు చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు… తీసుకెళ్లి జైలులో పడేశారు…
విద్యాగంధం..!
జైలులో ఒకాయన మన హీరోలోని ఫైర్ గమనించాడు… చదువు లేకపోవడమే తనకు పెద్ద అడ్డంకి అని గుర్తించాడు… ఎలాగూ బోలెడు టైం… చేసే పనేమీ లేదు… బ్యారకుల బయట, అంటే ఆరుబయట చెట్టు కొమ్మతో అక్షరాలు దిద్దించాడు… ఓసారి రక్తదానం చేస్తే అధికారులు 20 రూపాయలు ఇచ్చారు… వాటితో పెన్ను, పేపర్ కొన్నాడు… అవి తన జీవితాన్ని మార్చాయి… విచారణ, శిక్ష పూర్తయ్యాక జైలు నుంచి విడుదలయ్యాడు… బయటికి వస్తే ఏముంది..? ఏం చేయాలి..? సీపీఎం వాళ్లకు దొరికితే మళ్లీ తంతారు… వాళ్లు ఒకసారి ద్వేషించడం మొదలెడితే జీవితాంతం వేటాడుతూనే ఉంటారు… అద్దెకు ఓ రిక్షా దొరికింది… గిరాకీ లేనప్పుడు పుస్తకాలు చదువుకోవడం… గిరాకీ ఉంటే చెమటోడుస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకోవడం…
మహాశ్వేతాదేవి..!
జాదవ్‌పూర్ యూనివర్శిటీ పరిసరాల్లోనే ఎక్కువగా రిక్షాను తిప్పేవాడు… ఖాళీ దొరికితే లైబ్రరీ కావాలిగా మరి… ఓసారి ఓ మహిళ ప్రయాణికురాలు రిక్షా ఎక్కింది… ఏదో పుస్తకం చదువుతోంది… మన మనోరంజనుడు అంతకుముందే ఓ పుస్తకం చదివాడు… అందులో జిజిబిష అనే పదం ఉంది… ఎక్కువగా వాడే బెంగాలీ పదం కాదు అది… జీవనప్రేమ దాని అర్థం… ఆమెకు అర్థం తెలిసి ఉంటుందేమో అని ఆ పదానికి అర్థమేమిటమ్మా అనడిగాడు… ఆమె చెప్పింది… కానీ డౌటొచ్చింది… ఈ పదం నీకెలా తెలుసు అనడిగింది… తను చెప్పాడు… మరిన్ని ప్రశ్నలు వేసింది… ఓ రిక్షావాడు అడిగిన ప్రశ్న అంటూ తను నడిపే బర్తిక అనే సాహిత్య జర్నల్‌లో ఓ ఆర్టికల్ రాసింది… ఆయనతోనూ కొన్ని రాయించింది… ఇక్కడ మనోరంజన్ లైఫ్ మరో టర్న్ తీసుకుంది…
రచయిత..!
రిక్షా నడపడమే కాదు, తను ఓ ప్రభుత్వ స్కూల్లో వంటవాడిగా పనిచేసేవాడు… తను రాయడం కూడా మొదలెట్టాడు… తను చూసిన జీవితాల్నే అక్షరబద్ధం చేసేవాడు… బోలెడు పుస్తకాలు రాశాడు… interrogating my chandal life పేరిట ఓ దళితుడి ఆత్మకథ అనే సబ్ టైటిల్‌తో ఓ పుస్తకం బాగా పాపులర్… ది హిందూ ప్రైజ్ వచ్చింది… డజను నవలలు, వంద కథలు, బోలెడు వ్యాసాలు… సాహితీ క్షేత్రంలో బతుకు బండి సాగిపోతూనే ఉంది… ఇక్కడ తన బతుకు మరో టర్న్ తీసుకుంది…
ఎమ్మెల్యే…!
బాలాగఢ్… ఎస్సీలకు రిజర్వ్డ్ నియోజకవర్గం… ఓరోజు మమత బెనర్జీ పిలిచింది… నువ్వు ఇక్కడి నుంచి పోటీచేస్తున్నావ్ అని చెప్పింది… బీఫామ్ చేతిలో పెట్టింది… నసిగాడు, నాకేం తెలుసు పాలిటిక్స్ అన్నాడు… ఆమె నమ్మింది, జనం బాధల్ని రాసేవాడికి రాజకీయాలు ఎందుకు తెలియవు, నువ్వు నిలబడు, గెలుపోటముల మాట నాకు వదిలెయ్ అని చెప్పింది… 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ వోట్లు వచ్చినయ్ అక్కడ… ఈయన వయస్సు 70 ఏళ్లు… ఈసారీ బీజేపీ క్యాంపు నుంచి తీవ్ర పోటీ… ‘అసెంబ్లీలోకి పేదవాడి రిక్షా’ అనే నినాదం అందుకున్నాడు… క్లిక్కయింది… గెలిచాడు… నువ్వు న్యూట్రలే కదా, టీఎంసీ నుంచి ఎందుకు పోటీచేశావ్ అనడిగితే… ‘‘దీదీ గాక నన్ను ఎవరు నమ్మలేదు కదా, ఈ ఆఫర్ ఇవ్వలేదు కదా, బోళ్లు తోముకునేవాడిలాగే చూశారు… ఆమె గుర్తించింది, నిలబెట్టింది, అంతే…’’ అని బదులిచ్చాడు… అంతేకదా మరి…!!
Share this Article