.
ప్రసేన్ బెల్లంకొండ ....
అతనలా ఏడుస్తూ వీడియో పోస్ట్ చెయ్యడం చూసి జాలేసింది. జాలి అతనికి వచ్చిన కష్టం వల్ల కాదు. అతని అమాయకత్వానికి. కనీసం పదిమందైనా థియేటర్లో లేరు అన్నది అతని కన్నీళ్ళ కారణం.
అతను ఇటీవలి పరిణామాలను తెలుసుకోకపోయయినా ఉండాలి. లేదూ తనను తాను ఎక్కువగా ఊహించుకుని ఉండాలి. మొదటి రోజు మార్నింగ్, మాటినీ షోలకు పదిమంది కూడా రాకపోవడం అనేది ఇటీవలి సర్వ సాధారణ పరిణామం.
Ads
ఎన్నో సినిమాలు ఇద్దరో ముగ్గురో ప్రేక్షకులున్నందువల్ల రద్దయిన సందర్బాలు బోలెడు. హాల్ యాజమాన్యాలు ఆ ఇద్దరు ముగ్గురిని బతిమాలి డబ్బు వాపస్ ఇచ్చి తిప్పి పంపిన వార్తలు చదువుతూనే ఉన్నాం.
కొద్దో గొప్పో పేరున్న నటులు, కొద్దో గొప్పో పేరున్న దర్శకులకే ఈ బెడద తప్పలేదు. వాళ్లు కూడా మౌనంగా వాష్ రూమ్లో కుమిలే ఉంటారు. పైగా ఇతను కొద్దో గొప్పో పేరున్న దర్శకుడు కూడా కాదు. ఇతని సినిమాకు తారాబలమూ లేదు. అటువంటప్పుడు ఏ కారణంగా తన సినిమాకు ఎగబడి జనం వచ్చేస్తారని ఇతను అత్యాశపడ్డాడో మరి.
ఒకవేళ సినిమా నిజంగానే చాలా చాలా బాగుండి ఉన్నా కూడా జనం రావడానికి అవసరమైన మౌత్ టాక్ కైనా ఓ నాల్రోజులు పడుతుంది కదా. సినిమా చాలా బాగుందని చెప్పిన ఆ పదిమందీ బయటకు వెళ్లి మరో ముప్పైమందికి చెప్పడానికీ ఆ ముప్పై మందిలో మరో పదిమంది థియేటర్ కు రావడానికీ పట్టే వ్యవధి కూడా ఇవ్వకుండా ఇలా ఏడిస్తే ఎలా.
ఇవన్నీ ఆలోచించకుండా వాస్తవాలను అర్ధం చేసుకోకుండా, తన చుట్టూ ఉన్న థియేటర్లలో ఏం జరుగుతుందొ అధ్యయనం చెయ్యకుండా కన్నీళ్లను వృధా చేయడం జాలి పడాల్సిన అంశమే. మీరు సినిమా తీస్తున్నపుడే అది మంచి సినిమా అని గ్రహించి ప్రేక్షకులు క్యూ కట్టాలని అనుకోవడం మీ దురాశే సుమా.
నా సినిమా మీకు నచ్చకుంటే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అన్నంత మాత్రాన జనాలు వచ్చేస్తారని అనుకుంటున్న ఇతని అమాయకత్వానికి ప్రధానంగా జాలేసింది. చెప్పుతో కొట్టుకుంటే క్యూలు బారులు తీరేట్టుంటే ప్రతోడూ చెప్పులతో కొట్టుకునే ఫీల్డ్ కదా ఇది.
ఇటువంటి వీడియోలు అతన్ని ముందుకుపోకుండా ఆపుతాయే తప్ప ఎందుకూ ఉపయోగపడవు. నేనింతే సినిమాలో చివర్లో రవితేజతో ఒక మాటనిపిస్తాడు పూరీ జగన్నాధ్.
- ” మన సినిమా ఫ్లాప్ అవుద్ది. అయితే ఏంటి. మనం సినిమాలు తీయడం ఆపేస్తామా. సినిమాలే తీస్తాం. మనకింకొకటి తెలియదు. సినిమా హిట్టయినా సినిమా తీయాల్సిందే ఫ్లాప్ అయినా సినిమా తీయాల్సిందే ” అని.
ఇతనూ అలానే ముందుకు వెళ్ళాలి. దుఃఖం తరవాతే విజయం ఉంటుంది. నిజమే కానీ, దుఃఖం అన్ని వేళలా విషాదమే అవదు. ఒక్కోసారి అది హాస్యాస్పదం కూడా. పది శాతం మాత్రమే గెలుపు అవకాశాలుండి 90 శాతం ఓటమికే మొగ్గు చూపే ఆట ఆడుతూ గెలవలేదు అని ఏడవడం సరనిపించదు. కన్నీళ్లను దిగమింగి వాటితోనే కొత్తదారులు వేసుకోవాలి మై ఫ్రెండ్…
Share this Article