Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!

September 2, 2025 by M S R

.

Raghu Mandaati …..  గతం గట్టిగా తలుపు తడుతున్నట్టుంది రఘు… మనసులో పుటలు తిరగేస్తుంటే, ప్రతి జ్ఞాపకం ఒక వాసన, ఒక ఆప్యాయత తెచ్చిపెడుతోంది. కొందరి సహవాసమే మనం గ్రహించకుండానే మన ఆత్మకు ఒక ఆధారం అవుతుంది.

ఒకావిడ గురించి చెప్తా రఘు… ఒక ఉన్నతాధికారి ఆవిడ. తన ప్రతిభతో, పట్టుదలతో, ఎన్ని అవరోధాలున్నా ఒక్కొక్కటిగా అధిగమించి, చివరికి గౌరవప్రదమైన పదవితో విరమణ తీసుకుంది. ఆమె పేరు, ఖ్యాతి, విజయాలు ఇవన్నీ సమాజానికి ఒక ప్రేరణ. కానీ ఆమె జీవితంలో ఒక చిన్న పాత్ర ఉంది…

Ads

ఎన్నో సంవత్సరాలుగా తన దగ్గర పనిచేసిన ఒక సాధారణ పనిమనిషి, ఎవరూ లేరు ఈ అమ్మాయికి అని ఎవరో ఆఫీస్ కి తీసుకొస్తే పనిలో పెట్టుకుంది. ఆమెకు పెద్దగా విద్యలేదు, గొప్ప పరిజ్ఞానం లేదు. కానీ ఒక నీడలా, ఒక నిశ్శబ్ద గాలి ప్రవాహంలా ఆవిడ జీవితంలో కలిసిపోయింది.

ఇంటి పనుల్లో చిన్న చిన్న సహాయం, ఒక మాటలో చెప్పలేని మమకారం, తల్లిలా చూసుకునే శ్రద్ధ… ఇవి ఏవీ ఆవిడ అడగలేదు, కానీ ఆ పనిమనిషి నిశ్శబ్దంగా ఇస్తూనే ఉంది. కాలం కదిలింది. ఆవిడ భర్త మరణించాడు.

పిల్లలు పెళ్లిళ్లతో తమ తమ గూట్లలో కలిసిపోయారు. ఆ ఇంట్లో గోడలు పెద్దవే, హాళ్లు విశాలమే కానీ, లోపల మాత్రం ఒక గాఢమైన శూన్యత మిగిలింది. ఆ సమయంలో కూడా ఆ పనిమనిషి అక్కడే ఉంది. ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కాలేదు.

డబ్బుకోసమా? కాదు.
గౌరవం కోసమా? కాదు.
బహుశా కేవలం “ఉండాలనిపించింది” అన్న కారణమే కావచ్చు.
ఒకరోజు చిన్నపాటి విషయం మీద వాగ్వాదం జరిగింది.
కోపంతో ఆవిడ ఒక్క మాట అనేసింది
“వెళ్ళిపో”…

ఆ మాట విన్న కూడా మా అమ్మ గారే కదా అని, అప్పటికి తప్పయిందమ్మా క్షమించండి అని కూడా ప్రాధేయ పడింది. వినకుండా మొండిగా వెళ్లిపోమంది ఆవిడ…
ఆ అమ్మాయి మరో గత్యంతరం లేక నిశ్శబ్దంగా ఏడుస్తూ వెళ్లిపోయింది.
తరువాతి రోజు ఉదయం, ఇల్లు ఖాళీగా అనిపించింది.

గోడల మధ్య ప్రతిధ్వనించే మౌనం, కడుపు బాదినట్టుగా గట్టిగా వినిపించింది.
నిన్నటి వరకు కనిపించని చిన్న పనులు, మెల్లగా పెట్టిన నీళ్లు, వంటింట్లో వినిపించిన పల్లెటూరి పాటలు… అన్నీ ఒకేసారి జ్ఞాపకాలుగా కళ్ళ ముందుకు వచ్చాయి.
అప్పుడు ఆవిడ గుండె లోతులోంచి ఒక నిజం ఉబికింది…

ఆమె వల్లే నా ఒంటరితనం ఇంతకాలం చేరలేదు… ఆమె వెళ్లిపోయింది కాబట్టి, ఇప్పుడు నా గుండె ఇంత భారంగా ఉంది అని…
తరువాత ఆవిడ కోసం తన పిల్లలు కేర్ టేకర్స్ ని పెట్టారు. ఆరోగ్యం బాలేకపోతే నర్స్ ని అప్పాయింట్ చేశారు.
జీవితం అప్పుడే నేర్పింది..
సహవాసం, మమకారం, స్నేహం… వీటి విలువను డబ్బులో కొలవలేము.

ఎందుకు మనతో ఉన్నారో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వారు ఉన్నారనే విషయమే ఒక వరప్రసాదంగా భావించింది. వెళ్లిన అమ్మాయి గురించి ఎన్నో రోజులుగా ఆరా తీస్తూనే ఉంది కానీ లాభం లేకుండా పోయింది. పిచ్చిముండా కనీసం తిరిగి రావొచ్చు కదా… ఒక్క మాటకే వదిలేసి పోవాలా… కనీసం ఎలా ఉన్నానో కూడా చూడ్డానికి ఒక్కసారైనా రావొచ్చు కదా… అని ఆవిడ ఎన్నోసార్లు మనసులో తిట్టుకుంది, ఏడ్చింది, బాధపడుతూనే ఉంది…

ఎవరో కాదు, ఆ ఉన్నతాధికారిని నేనే రఘూ.

పదే పదే ఆ అమ్మాయి గుర్తుకొస్తోంది రఘు. గతం తాలుకు నొప్పులు సలుపుతున్నాయి…
చాలా సార్లు మనకోసం. మన రోజువారీ జీవితాల్లో, మన ప్రయాణాల్లో కొందరు ఎలాంటి అంచనాలు ఎలాంటి కోరికలు లేకుండా మనతో ఉంటారు. మనకు తోడుగా ఉంటారు.

వారు గొప్పగా ధన సహాయమో లేదా గొప్ప విజయాలో, ఆస్తులో, అంతస్తులో కోరకపోవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు, కానీ వారు ఎందుకు ఉంటారో కూడా మనకు తెలీదు, కానీ ఉంటారు. ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించం కదా…

నాకు ఆ అమ్మాయి ఇచ్చిన నిశ్శబ్ద సహవాసం నేడు నా జీవితానికి గొప్ప పాఠమైంది.
చివరికి జీవితం ఒకే విషయం చెబుతుంది.
మన పక్కన నిలబడటానికి శ్రమపడిన వారిని ఎన్నటికీ తక్కువ అంచనా వేయకూడదు.
వారు లేకపోతే మన హృదయంలో గాఢమైన ఖాళీ తప్ప మరేమీ మిగలదు రఘూ…

ఏమో ఏదో ఒక రోజు నా ప్రాణాలు పోతాయి. నా ఊపిరి గాలిలో కలిసేలోగా ఒక్కసారి ఆ పిచ్చిది… నా పిచ్చిపిల్ల… వచ్చి నా పక్కన కూర్చుంటే… తనివి తీరా గుండెలో ఉన్న భారం దిగిపోయేంతలా ఏడవాలని ఉంది రఘూ….

**
మీ మనసు బాధ వింటుంటే నా కళ్లలో కూడా నీళ్లు చేరాయి మా… మీరు చెప్పిన ఆ అమ్మాయిలాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే నిజం.
మనమందరం ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టే విలువ తెలియదు, లేరు కాబట్టే గుండె భారమవుతుంది అనే స్థితిలో పడతాం.

కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం మా..
ఆ అమ్మాయి మీ జీవితంలో వదిలిన జాడలు, ఇచ్చిన ఆప్యాయత, నిశ్శబ్ద సహవాసం… ఇవి ఎప్పటికీ చెరగవు.
ఎప్పుడో ఒక రోజు ఆమె తిరిగి రాకపోయినా, మీరు ఆమెను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ మాటలే ఆమె ఉనికిని అమరం చేస్తాయి. ఎందుకంటే ఇలాంటి హృదయం నుండి వచ్చిన అనుభవాలు మరువలేము, మాయం చేయలేము.

మీరు బాధపడుతున్నదీ సహజం.
కానీ ఆ అమ్మాయి కూడా ఎక్కడో తనలోపల, మిమ్మల్ని తలుచుకుంటూ ఆవిడను “నా వారు” “మా అమ్మగారు” అని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.
బహుశా తిరిగి రావడానికి తాను ధైర్యం చేయలేకపోయి ఉండొచ్చు.
జీవితం కొన్నిసార్లు మన మధ్య దూరాన్ని పెడుతోంది… కానీ మనసుల మధ్య కాదు.
ఆమె మిమ్మల్ని వదిలిపోలేదు మా…
ఆమె జ్ఞాపకాల రూపంలో, మీ హృదయం లోపలే ఉంది.

మీ కళ్లలో కన్నీరు తుడవడానికి, మీ ఒంటరితనాన్ని తగ్గించడానికి అదే చాలు.
నీతో కూడా ఒక విషయం పంచుకోవాలి మా..
ఒక యువకుడు జీవితంలో ఓటములతో చితికిపోయాడు…
తన కలలు, తన శ్రమ అంతా బూడిదలో పోసినట్టయింది…
ప్రపంచం అంతా దూరమైంది.
స్నేహితులు కూడా ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు.

ఒకరోజు ఆ యువకుడు రెంట్ కు ఉంటున్న రూమ్ కి వర్షంలో తడుస్తూ చాలా కాలం తర్వాత తన తలుపు తట్టాడు…
ఏమీ అడగలేదు, “ఏమైంది?” అని కూడా అనలేదు.
వచ్చి, కూర్చున్నాడు.
చల్లని వర్షంలో వేడి వేడి కాఫీ చేసి పెట్టాడు.
రాత్రంతా నిశ్శబ్దంగా పక్కన కూర్చున్నాడు.

తరువాతి ఉదయం యువకుడు కన్నీళ్లు ఆపుకోలేక అన్నాడు. నువ్వు ఎందుకు ఉన్నావు నా పక్కన?
ఆ స్నేహితుడు నవ్వుతూ అన్నాడు.
నువ్వెందుకు రాత్రంతా నా పక్కన కూర్చొని ఉన్నావో నేను అడిగానా?
జీవితం కొందరితో మనల్ని ఎందుకు కలిపిందో మనకే తెలియదు మా..

ఆ యువకుడిని నేనే...
ఇప్పటికి నాకు నా స్నేహితుడి మధ్య పెద్దగా మాటలు ఉండవు కానీ వాడు ఉంటాడు అంతే… వాడిలాగే నేను ఉంటా పక్కనే… ఎందుకో తెలీదు అదంతే…

కొన్ని బంధాలు రక్తంలో కాదు…
హృదయం ఇచ్చే నిశ్శబ్ద వాగ్దానాల్లో పుడతాయి మా..
నిజమైన స్నేహం అనేది…
మన లోపాలను దాచే అద్దం కాదు,
మన బలహీనతల దగ్గర కాపలాగా నిలిచే నీడ.
మనసుకు దగ్గరైన వారు పెద్ద బహుమతులు ఇవ్వరు…
వారి ఉనికే పెద్ద బహుమతి.

మనతో ఉండి కాపాడిన వారి జ్ఞాపకాలే మనకు గొప్ప ఆస్తి మా… మీ విషయంలో ఆమె ఒక “పని అమ్మాయి” కాదు, మీ జీవితంలో నిశ్శబ్దంగా దేవదూతలా వచ్చిన ఒక ఆశీర్వాదం.
మీ లేఖ మీ బాధను మాత్రమే కాదు, ఆ అమ్మాయి విలువను ప్రపంచానికి గుర్తు చేసింది.
ధైర్యంగా ఉండండి.
మీరు ఆమెను మరిచిపోలేదు.
ఆమె కూడా మిమ్మల్ని మరిచిపోలేదు.

ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చే వారు…
వారే మన నిజమైన బంధాలు.
వెళ్లిపోయిన వారి జ్ఞాపకాలే
మనకు ఎప్పటికీ విడిపోని సహచర్యం.
నిజంగా మన పక్కన కూర్చున్నవారు ఎందుకు కూర్చున్నారు అనేది ముఖ్యం కాదు…
మనతో కూర్చున్నారు అనేదే నిజమైన అద్భుతం…
మనసుకు అతి పెద్ద సంపద, మనకోసం కృషి చేసిన, మన కోసం ఉన్న ఆ హృదయాలని గమనించడం, గుర్తించడం, గుర్తించి కాపాడుకోవడమే…
.
.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
  • మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!
  • నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!
  • సినిమా ఆటంటేనే ఓ లాటరీ… నష్టానికి సిద్ధపడే ఆట మొదలెట్టాలి…
  • పంచెలో ఉన్న భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి..!!
  • సాక్షాత్తూ కేసీయార్ బిడ్డే చెబుతోంది… కాళేశ్వరంలో అవినీతి నిజమేనని..!!
  • కితకితలు గీతాసింగ్… జోవియల్ సెల్ఫ్ పంచుల నడుమ కళ్లల్లో చెమ్మ..!!
  • సినిమా అంటేనే పత్తాలాట… ఏడిస్తే లాభం లేదోయీ ‘బార్బరికా..’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions