Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!

September 2, 2025 by M S R

.

 

శరీరం సహకరించడం ఇక ఆపేసినప్పుడు, కోలుకునే అవకాశం ఏమాత్రం లేనప్పుడు, ప్లీజ్, నాపై ఏ చికిత్సలూ చేయవద్దు… నన్ను ఇక ఈ లోకం వదిలి వెళ్లేందుకు అనుమతించండి….. – డా. లోపా మెహతా

Ads

ఎవరు ఈమె..? ముంబైలోని జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అక్కడ ఆమె అనాటమీ విభాగం అధిపతి…

ఆమె తన 78వ ఏట ఓ లివింగ్ విల్ (జీవన వీలునామా) రాసుకున్నారు. అందులో ఆమె స్పష్టంగా ఇలా పేర్కొన్నారు….

“నా శరీరం ఇక సహకరించడం ఆపేశాక… నాకు వెంటిలేటర్లు పెట్టవద్దు, ఏ ట్యూబులూ తగిలించవద్దు, ఆసుపత్రుల అనవసరమైన హడావిడి కూడా వద్దు… నా చివరి క్షణాలు ప్రశాంతంగా గడవాలి… అక్కడ చికిత్సల కోసం చేసే మొండి పట్టుదల కన్నా వివేకానికి ప్రాధాన్యత ఉండాలి…”

డా. లోపా ఈ పత్రాన్ని రాయడమే కాకుండా, మరణం గురించి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు. అందులో ఆమె మరణం అనేది సహజమైన, నిశ్చితమైన, జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే అని స్పష్టం చేశారు…

ఆమె వాదన ప్రకారం.., ఆధునిక వైద్యశాస్త్రం మరణాన్ని ఒక స్వతంత్ర భావనగా ఎప్పుడూ చూడలేదు… వైద్యశాస్త్రం ఎప్పుడూ మరణం ఏదో ఒక వ్యాధి వల్లే వస్తుందని, ఆ వ్యాధికి చికిత్స చేస్తే మరణాన్ని ఆపవచ్చని భావిస్తుంది… కానీ, శరీర విజ్ఞానం అంతకు మించి చాలా లోతైనది…

ఆమె ఇంకా ఏమంటున్నదంటే…. ‘‘శరీరం అనేది నిరంతరం పనిచేసే ఓ యంత్రం కాదు. అది ఒక పరిమిత వ్యవస్థ, దీనికి ఒక నిర్దిష్టమైన ప్రాణశక్తి ఉంటుంది… ఈ శక్తి ఏదో ఒక నిల్వ చేయబడ్డ ట్యాంకు నుంచి లభించదు, సూక్ష్మ శరీరం నుంచి వస్తుంది…

ఈ సూక్ష్మ శరీరం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించేదే, కానీ కనిపించనిది… మనసు, బుద్ధి, జ్ఞాపకాలు, చైతన్యం…ఇవన్నీ కలిపి ఏర్పడిన ఒక వ్యవస్థ ఇది.

ఈ సూక్ష్మ శరీరం ప్రాణశక్తికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది. ఈ శక్తి మొత్తం దేహంలో విస్తరించి, శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది. గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ, ఆలోచనా శక్తి ఇవన్నీ దాని ఆధారంపైనే నడుస్తాయి.
కానీ, ఈ శక్తి అపరిమితం కాదు. ప్రతి శరీరంలో దీనికి ఒక నిర్దిష్ట పరిమాణం ఉంటుంది… ఒక యంత్రంలో అమర్చిన ఫిక్స్డ్ బ్యాటరీ లాగా దాన్ని పెంచలేము, తగ్గించలేము… రాముడు ఎంత తాళం వేశాడో, బొమ్మ అంతే ఆడబడుతుంది అన్నట్లుగా…

శరీరంలోని ఈ శక్తి అయిపోయినప్పుడు, సూక్ష్మ శరీరం దేహం నుంచి వేరు అవుతుంది… ఆ క్షణమే దేహం కదలకుండా అవుతుంది… దీనినే “ప్రాణం పోవడం’’ అంటాం మనం… ఈ ప్రక్రియ ఏదో ఓ వ్యాధితో మాత్రమే సంబంధం ఉన్నది కాదు, లేదా ఏ తప్పుతోనూ సంబంధం ఉన్నది కాదు… ఇది శరీర అంతర్గత లయ…

ఇది గర్భంలోనే మొదలవుతుంది, పూర్తయి మరణానికి చేరుకుంటుంది… ఈ శక్తి ప్రతి క్షణం ఖర్చవుతూనే ఉంటుంది… ప్రతి కణం, ప్రతి అవయవం దాని జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటుంది. మొత్తం దేహం “కోటా” పూర్తయినప్పుడు, శరీరం ఇక శాంతంగా ఉండిపోతుంది…

మరణ క్షణం గడియారంతో కొలిచేది కాదు… అది ఒక జీవశాస్త్ర సమయం… ఇది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఒక్కొక్కలా ఉంటుంది… కొందరి జీవితం 35 ఏళ్లలో పూర్తవుతుంది.., మరికొందరిది 90 ఏళ్లలో… కానీ ఇద్దరూ తమ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తారు…

ఇది ఓటమి కాదు, బలవంతమూ కాదు… ఎవరూ అసంపూర్ణంగా చనిపోరు… డా. లోపా ప్రకారం… ఆధునిక వైద్యశాస్త్రం మరణాన్ని నివారించడానికి మొండి పట్టుదల పట్టినప్పుడు, కేవలం రోగి శరీరం మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అలసిపోతుంది… ఐసీయూలో ఒక నెల శ్వాస కోసం పెట్టే ఖర్చు కొన్నిసార్లు జీవితకాల పొదుపును నాశనం చేస్తుంది…

  • బంధువులు చెబుతూ ఉంటారు… “ఇంకా ఆశ ఉంది”, కానీ రోగి శరీరం ఎప్పుడో చెప్పేసి ఉంటుంది “ఇక చాలు”… అని…

అందుకే ఆమె ఇంకా ఇలా రాశారు… “నా సమయం వచ్చినప్పుడు, నన్ను కేవలం ఈ కేఈఎం ఆసుపత్రికి తీసుకురండి. అక్కడ అనవసరమైన జోక్యం ఉండదని నాకు నమ్మకం ఉంది. చికిత్స పేరుతో ఏవేవో బాధలు కలిగించరు… నా శరీరాన్ని ఆపొద్దు… దాన్ని వెళ్లనివ్వండి…”

కానీ ప్రశ్న ఏమిటంటే… మనం మన కోసం ఇలాంటిదేమైనా నిర్ణయించుకున్నామా? మన కుటుంబం ఆ కోరికను గౌరవిస్తుందా? గౌరవించిన వారికి సమాజంలో గౌరవం లభిస్తుందా?

మన ఆసుపత్రులలో ఇలాంటి కోరికకు గౌరవం ఉందా, లేక ఇంకా ప్రతి శ్వాస మీద బిల్లు అవుతుందా?  ఇది అంత సులభం కాదు… తర్కం,  భావోద్వేగాల మధ్య సమతుల్యత సాధించడం బహుశా అత్యంత కష్టమైన పని ఇదేనేమో…

మరణాన్ని మనం ప్రశాంతమైన, నిర్ణీతమైన, శరీర అంతర్గత గతి నుంచి వచ్చిన ప్రక్రియగా చూడటం నేర్చుకుంటే, బహుశా మరణ భయం తగ్గుతుంది.., అప్పుడు డాక్టర్ల నుండి ఆశించేవి మరింత వాస్తవికంగా ఉంటాయి…

నా అభిప్రాయంలో, మరణంతో పోరాడటం ఆపివేయాలి… ఆ క్షణం వచ్చినప్పుడు… ప్రశాంతంగా, గౌరవంగా దాన్ని ఎదుర్కోవాలి… బుద్ధుని మాటల్లో — మరణం అంటే జీవిత ప్రయాణంలో తర్వాతి దశ… అంతే… అంతే… (సోషల్ మీడియా నుంచి సేకరణ)

  • (ఈమె మరణించినట్టు రీసెంటుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే… నేనింకా బతికే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అని గత నెల 23న ఓ ప్రకటన జారీ చేసింది, ఇప్పుడామె వయస్సు 80 ఏళ్లు…)

(మీ ఫోన్‌లో క్రోమ్ ఓపెన్ చేసి muchata.com టైప్ చేయండి, సైట్ కనిపిస్తుంది… కుడివైపు పైన మూడు చుక్కలు ఉంటాయి… క్లిక్ చేయండి, కిందకు రండి, Add to Home Screen అని కనిపిస్తుంది… Install చేయండి… మీ ఫోన్ హోమ్ స్క్రీన్ మీద app రెడీ… ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి చదివేయడమే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
  • కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…
  • కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
  • మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!
  • నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!
  • సినిమా ఆటంటేనే ఓ లాటరీ… నష్టానికి సిద్ధపడే ఆట మొదలెట్టాలి…
  • పంచెలో ఉన్న భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions