.
Bharadwaja Rangavajhala …. రాజనాల …. తెలుగు సినిమాల్లో ఒకే ఇంటిపేరుతో ఒకే టైమ్ లో ఇద్దరు విలన్లు ఉండేవారు. అందులో ఒకరు ఒంటి పేరుతోనే పాపులర్ అయితే రెండో వారు ఇంటి పేరుతో పాపులర్ అయ్యారు.
మొదటి వారు ఆర్.నాగేశ్వరరావు. రెండవ వారు రాజనాలగా పాపులర్ అయిన కల్లయ్య ఉరఫ్ కాళేశ్వరరావు. ఇద్దర్నీ తెలుగు సినిమా రంగం బాగానే ఆదరించింది.
Ads
ఆర్.నాగేశ్వరరావు ఇంటిపేరు రాజనాల అని సాధారణ ప్రేక్షకులకు తెలియదు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు రాజనాలలూ దూరపు బంధువులు కూడా. తెలుగు సినిమా తొలి గ్లామరస్ విలన్ ఆర్.నాగేశ్వర్రావు. తన ఇంటిపేరు తెలియాలని తనే అనుకోలేదు.
అలీఘర్ యూనివర్సిటీలో చదువుకు స్వస్తి చెప్పాక పూర్ణా అండ్ ప్రిమియర్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలో మేనేజరుగా చేరాడు.
అక్కడ మానేసి సికిందరాబాద్ వచ్చేశారు.
పారమౌంట్ థియేటర్ లో మేనేజరుగా పనిచేశారు. అక్కడ నచ్చక మళ్లీ ప్రీమియర్ కు తిరిగి వెళ్లారు.
ప్రీమియర్ సంస్ధ విజయా వారి చిత్రాలను పంపిణీ చేసేది. ఆర్.నాగేశ్వరరావు పర్సనాల్టీ చూసిన చాలా మంది నువ్వు సినిమాల్లో నటించకూడదూ అనేవారు. కానీ తను ఇంట్రస్టు చూపించేవాడు కాదు.
ప్రీమియర్ కంపెనీ పనిమీదే విజయా వాహినీ స్టూడియోలో జరుగుతున్న షావుకారు షూటింగుకు హాజరయ్యారు ఆర్.నాగేశ్వరరావు.
అక్కడే డైరక్టర్ ఎల్వీ ప్రసాద్ ను కలసి నేను సినిమాలకు పనికొస్తానా అని అడిగారట. ఆయన ఓసారి పైకీ కిందకీ చూసి ఎందుకు పనికిరావూ, బానే ఉన్నావుగా కాస్త వాచికం … నటనా గురించి తెలుసుకో చాలు … సినిమా నటులు కావాలంటే ఉత్సాహంతో పాటు అబ్జర్వేషను ఉంటే చాలు అని తన పనిలో తాను పడిపోయారట.
ప్రీమియర్ వారు మాత్రం ఆర్.నాగేశ్వరరావు సినిమాల్లోకి పోతే కష్టమౌతుందని ఆపేందుకు ప్రయత్నించారు.
అయినా నాగేశ్వరరావు తన మిత్రుడైన పూర్ణా పిక్చర్స్ కామరాజుతో విషయం చెప్పారు. ఆయన సినిమాల్లోకి వెళ్లడమే బెటరని ఎడ్వైజ్ చేయడమే కాకుండా బి.ఎ సుబ్బారావును కలవమని ఓ ఉత్తరం రాసిచ్చి మరీ మద్రాసు పంపారు.
పూర్ణా కామరాజు ఉత్తరం చూసిన సుబ్బారావు గారు అప్పటికి తను ప్లాన్ చేస్తున్న రాజు పేద చిత్రంలో విలన్ వేషానికి కన్ఫర్మేషన్ ఇచ్చారు.
అయితే ఆర్.నాగేశ్వరరావుకి వేషం దొరికింది రాజు పేదలోనే అయినా మొదటగా రిలీజైన సినిమా మాత్రం సంక్రాంతి.
చమ్రియా వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన సంక్రాంతిలో పాపారావు పాత్రలో ఆర్.నాగేశ్వరరావు నటన ఇండస్ట్రీ పెద్దల్ని ఆకట్టుకుంది.
చెరపకురా చెడేవు, కన్నతల్లి చిత్రాల్లో వెంటనే అవకాశం వచ్చింది.
దొంగరాముడు, పెళ్లినాటి ప్రమాణాలు చిత్రాలతో పాపులార్టీ పెరిగిపోయింది. దొంగరాముడులో రావోయి మా ఇంటికీ పాటతో స్టార్ విలనైపోయారు.
అదే సినిమాలో నాగేశ్వరరావు ఊతపదం బాబులుగాడి బెబ్బ గోలకొండ అబ్బా అనాలి కూడా మారుమ్రోగింది.
దేవదాసులో అక్కినేని సోదరుడుగా నటించారు ఆర్.నాగేశ్వరరావు.
కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ లో దుశ్శాసనుడుగా నటించి భళా మామ భళా … అదే మన తక్షణ కర్తవ్యం అనే డైలాగుతో పాపులర్ అయ్యారు.
అప్పు చేసి పప్పుకూడులో అదే దెబ్బ డైలాగు చాలా పాపులర్.
చాలా ఫాస్ట్ గా యాభై సినిమాలు పూర్తి చేశారు ఆర్.నాగేశ్వరరావు.
పాలిష్డ్ విలనీ చాలా సినిమాల్లో చేశారాయన. వాటిలో ఇల్లరికం, దొంగల్లో దొర , ముందడుగు తదితర చిత్రాలున్నాయి.
తన కెరీర్ లో చంద్రహారం లాంటి జానపద చిత్రాలతో పాటు భక్తశబరి తదితర పౌరాణిక చిత్రాలు కూడా చేశారాయన.
జస్ట్ మూడు పదులు నిండని వయసులోనే అంతులేని పాపులార్టీ సంపాదించిన అరెస్టింగ్ పర్సనాల్టీ అతనిది.
వేట అంటే చాలా ఉత్సాహం చూపించే ఆర్.నాగేశ్వరరావుకు ఓ సారి అడవిలో పులి ఎదురయ్యింది. దాన్ని కారుతో గుద్దేశారు. పులి చచ్చిపోయింది. కారు తలకిందులయ్యింది. ఆర్.నాగేశ్వరరావు తలకు బలంగా దెబ్బలు తగిలాయి.
ఆ గాయాలు తగ్గాయి గానీ సిగరెట్ల అలవాటు వలన క్షయ వ్యాధికి గురై 33 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.
ఆర్.నాగేశ్వరరావు మరణానంతరం రాజనాల హవా ప్రారంభమయ్యింది…
Share this Article