.
“జిస్ దేశ్ మే గంగా బెహతీ హై…” అని పులకింతగా గంగను, గంగావతరణాన్ని స్తోత్రం చేసే, గంగను పూజించే, గంగమీద సినిమాలు తీసే, గంగలో మునిగి సకల పాపాలను వదిలించుకునే భారత దేశంలో ఇన్ని దశాబ్దాలకు మేడిన్ ఇండియా మంచినీళ్ళు తయారయ్యాయి.
ఇదొక స్వదేశీ దాహం తీరిన సన్నివేశంగా, సముజ్వల జల దృశ్యంగా ఆ ఇండిపెండెన్స్ నీళ్ళ కంపెనీ దేశవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో మొదటి పేజీల్లో ప్రకటనలు ఇచ్చుకుంది. ప్రకటనలో ప్యూర్ వెజిటేరియన్ ఆకుపచ్చ గుర్తు కూడా ప్రముఖంగా ఉంది. (అంటే మిగతా కంపెనీల బాటిల్ నీళ్ళు నాన్ వెజ్ ఏమో!) “వాటర్ విత్ మినరల్స్” అని ట్యాగ్ లైన్ ఉంది. (అంటే మిగతావాటిల్లో మినరల్స్ ఉండవని సూచనేమో!)
Ads
మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అలాగే మినరల్ వాటర్ బాటిల్లో మినరల్స్ ఉండవు అని లోకానికి తెలుసు. అయినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లోనే మంచి (?)నీళ్ళు తాగుతూ అదే ఆరోగ్యమని అనుకునేలా చేయడంలో బహుళజాతి కంపెనీలు ఏనాడో పైచేయి సాధించాయి.
కర్ణుడికి కవచకుండలాలున్నట్లు బయటతిరిగే నాగరికులందరి చేతుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది. కలవారైతే పక్కన వారి పరిచారకుల చేతిలో వాటర్ బాటిల్ సదా సిద్ధంగా ఉంటుంది. కడుపుకు పట్టెడన్నం తినే హోటళ్ళ మొదలు, రోగం నయం చేసుకోవడానికి వెళ్ళే ఆసుపత్రులదాకా ఎక్కడైనా మంచినీళ్ళు ప్లాస్టిక్ బాటిళ్ళలోనే దొరుకుతూ ఉంటాయి. మేఘాలు దాటి పైపైన ఆకాశమార్గాన విమానాల్లో కూడా మంచి నీళ్ళు ప్లాస్టిక్ బాటిళ్లలోనే ఉంటాయి.
ఊళ్ళో ఊరుమ్మడి బావిలో నీళ్ళు చేది పోసుకుని తాగిన గొంతులు;
చెరువులో నీటిని కుండల్లో నింపుకుని తాగిన గొంతులు;
రెక్కలు ముక్కలయ్యేలా బోరు కొట్టి ఒంపుకుని తాగిన గొంతులు;
ఊరి కొళాయి తిప్పి… బిందెల్లో నింపుకుని తాగిన గొంతులు పాతరాతియుగం సంస్కృతికి గుర్తులు.
నవనాగరికులు ఎవరైనా బాటిల్లో నీళ్ళే కొనుక్కుని తాగాలి. ప్లాస్టిక్ బాటిల్ లో క్యాన్సర్ కారక ప్లాస్టిక్ కాకుండా ఏయే మినరల్స్ ఎంతెంత పాళ్లల్లో ఉంటాయో పెరుమాళ్ళకే ఎరుక! మనం తాగిన బాటిల్ నీళ్లద్వారా ఎన్నెన్ని మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఇప్పటికి ఎన్ని కోట్ల మంది కడుపుల్లో కుదుపు లేకుండా భద్రంగా నిక్షిప్తమై ఉందో మెడికల్ స్కానర్లు చెప్పలేవు. చెప్పినా మినరల్ వాటర్ బాటిళ్ళ కంపెనీలకు వినపడదు.
ఇలాంటి నేపథ్యంలో మేడిన్ ఇండియా ఖనిజ సహిత మంచినీళ్ళ ప్లాస్టిక్ బాటిళ్ళలో ఏయే మినరల్స్ ఎంత మోతాదులో దాగి ఉన్నాయో మరి! వికసిత్ భారత్ లో ఇన్నాళ్లకు స్వదేశీ “ఇండిపెండెన్స్” మంచి నీళ్ళు ఇంత అగ్గువకు దొరకడాన్ని చూసి నవ్వాలో? ఏడవాలో?
మినరల్ వాటర్ కంపెనీల ఈ దాహం తీరనిది!
మన దాహం ఆ బాటిళ్ళతో తీరినట్లు అనిపించినా… ఆ నీళ్ళతో మనకొచ్చే ప్రమాదాల కథ అంతులేనిది!
… అయినా మన ఇళ్ళల్లో కూడా ఖనిజాలన్నిటిని వడకట్టిన ఆర్ఓ, ఫిల్టర్ వాటరే కదా అతి జాగ్రత్తగా తాగుతున్నాం? ఇంట్లో తాగే నీళ్ళల్లో మినరల్స్ ను వడకట్టి, బయట మినరల్ వాటర్ బాటిళ్ళ వెంట పరుగులు తీసే మనతో ఎలా ఒక ఆటాడుకోవాలో నీళ్ళకంపెనీలకు నీళ్ళు తాగినంత సులభంగా, అలవోకగా తెలుసు!
నీరు పల్లమెరుగు!
నీళ్ళ బాటిళ్ళలో మినరల్స్ నిజం దేవుడెరుగు!!
అందుకే… ఇవేమీ ఆలోచించకుండా…
“ఓం కేశవాయ స్వాహా!
ఓం నారాయణాయ స్వాహా !
ఓం మాధవాయ స్వాహా !”
అని నీళ్ళు నోట్లో పోసుకోవడమే ఉత్తమం! ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా…జలాచమన పుణ్యమైనా వస్తుంది!
… ఎంత మాట్లాడినా ఇవన్నీ మినరల్ నీటిమీద రాతలే!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article