.
రాఘవేంద్ర ఉడుపి, శరవణన్ భవన్, తాజా టిఫిన్ సహా ఏ సౌత్ బ్రాండ్ పాపులర్ హోటలైనా సరే… వడలు పెద్ద పెద్ద సైజులో ఉండి.., పైన కడక్ లేయర్ మినహాయిస్తే, లోపల గుజ్జు ముద్ద పిండి తిన్నట్టే ఉంటుంది…
.
రసం వడ, సాంబారు వడ ఏదైనా సరే… కొన్ని చిన్న చిన్న హోటళ్లు, స్ట్రీట్ వెండార్స్ వద్ద మాత్రం చిన్న చిన్న వడలుంటాయి… ఏ ఆధరువూ లేకుండా తిన్నా బాగానే ఉంటయ్… కానీ అక్కడ హైజీన్ ఎలా ఉన్నా సరే, చట్నీ, సాంబారు పెద్దగా బాగుండవ్…
.
మొన్న అనుకోకుండా జగిత్యాలలో… పేరు గణేష్ భవన్ అనుకుంటా… లైట్ అల్పాహారం కావాలనుకుని, సింగిల్ రసం వడ ఇస్తారా అనడిగాను సందేహంగానే… అదే ఎందుకు ఆ సమయానికి స్పురించిందో నాకూ తెలియదు… సింగిల్ వడ ఇస్తాం అని టోకెన్ ఇచ్చాడు ముఫ్పయ్యో నలభయ్యో తీసుకుని.., అక్కడ ఎవరూ పెద్దగా రసం వడ అడగరో ఏమో… టోకెన్ ఇచ్చినప్పుడు రసం వడ అని చెప్పండి సప్లయర్‌కు అన్నాడు కౌంటర్ మీద సేటు…
.
ఆహా… తను వేడి రసంతో పెప్పర్ వడ ఇచ్చాడు… ఎస్, మిరియాల వడ… ఆ రసం, మిరియాల వడ ఎంత సూపర్ కాంబో కదా అనిపించింది తింటుంటే… ఈ పెప్పర్ వడ సాధారణంగా మన హోటళ్లలో దొరకదు…
.
Ads
చాలామంది పొద్దున్నే ఆయిల్ ఫుడ్ దేనికని పూరీ, మైసూరు బోండా, వడ అవాయిడ్ చేస్తుంటారు… ఇడ్లీని ప్రిఫర్ చేస్తుంటారు… సాధారణ హోటళ్లలో అవీ పెద్ద సైజే… ఇడ్లీ తాలూకు మృదువుతనం ఏమాత్రం కనిపించదు… హైదరాబాదులో మాత్రం మినహాయింపు… మైసూరు బోండా తెల్లవారుజామున 5, 6 గంటల నుంచి రాత్రి 11, 12 వరకూ స్ట్రీట్ వెండార్స్ దగ్గర గోలుతూనే ఉంటయ్ నూనెలో… అంత గిరాకీ…
.
హోటళ్లలో, కేటరింగు సర్వీసులో… పొంగల్‌లో వేస్తుంటారు మిరియాలను సాధారణంగా… పొంగల్ కూడా అన్ని రెస్టారెంట్లలో దొరకదు… పంటి కిందకు మిరియాలు ఘాటుగా కటుక్కుమంటాయనే భావనతో కొందరు ఇళ్లల్లో పొంగల్ చేసుకుంటే మిరియాల పొడి వేస్తుంటారు… కానీ పెప్పర్ వడ ఒరిజినల్ మిరియాలతోనే బాగుంది…
.
వచ్చేటప్పుడు కౌంటరుడికి ‘మీ వడ సూపర్‌గా ఉంది సేటూ’ అని చెబితే… బహుశా ఇలాంటి అభినందన ఎప్పుడూ ఎరగలేదేమో, ముందు హాశ్చర్యపోయాడు, తరువాత హానందపడిపోయాడు… నాలుక మీద ఆ టేస్టు కాసేపు అలాగే ఉండాలని టీ అవాయిడ్ చేయబడింది… కరీంనగర్ చేరేవరకూ…!
Share this Article