.
( రమణ కొంటికర్ల ) ….. రాజకీయాలే మాస్టర్ కీ అనే ఏ అర్థంలో చెప్పారోగానీ మహాశయులు… ఎంత చదువుకున్నవాళ్లైనా.. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లిన చీఫ్ సెక్రటరీలైనా.. ప్రజాప్రతినిధులు, నాయకుల చెప్పుచేతల్లో ఉండకపోతే వారికి బెదిరింపులు, బదిలీలు, దౌర్జన్యాలే శరణ్యం. మనం తరచూ అలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూనే ఉన్నాం.
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ ఓ మహిళా ఐపీఎస్ మధ్య నెలకొన్న వివాదం అలాంటి దైన్యస్థితిని మరోసారి కళ్లకుగట్టేది. కానీ, ఆ మహిళా అధికారి సదరు డిప్యూటీ సీఎంతో స్పందించిన తీరు ఆమెను ఇప్పుడు లేడీ సింగంగా వార్తల్లో నిలబెట్టింది.
Ads
ఎవరు ఈ అంజనా కృష్ణ..?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బెదిరింపులకు గురైన మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనాకృష్ణ.. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పనిచేస్తోంది. 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం మహారాష్ట్రలోని కర్మలా తహశీల్ డీఎస్పీగా.. గత రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారామె.
అంజనా కృష్ణ కేరళ తిరువనంతపురం వాసి. ఆమె తండ్రి అక్కడ ఓ చిన్న బట్టల దుకాణం నడుపుతుంటాడు. తల్లి కోర్టులో టైపిస్ట్ గా పనిచేస్తోంది. అంజనా పూజపుర్రలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత నీరంకరలోని హెచ్ఎంఎస్పీబీ ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ చదివింది.
2022లో అంజనా యూపీఎస్సీ రాసి.. సివిల్ సర్వీసెస్ లో అఖిల భారత స్థాయిలో 355వ ర్యాంక్ సాధించింది. నిజాయితీపరురాలైన అధికారిణిగా అంజనాకు పేరుంది. పనిలో ఆమె దృఢ సంకల్పం, పరిపాలనా నైపుణ్యానికి ప్రశంసలు కూడా అందుకుంది.
ఏంటి అసలు వివాదం..?
సెప్టెంబర్ ఒకటో తేదీన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంజనా కృష్ణకు ఫోన్ చేశారు. కాస్త గద్రాయించి మాట్లాడుతూ బెదిరించారు. ఆ విషయంలో ఫోన్ లో రికార్డైంది. కెమెరాలోనూ రికార్డై వైరల్ గా మారడంతో డిప్యూటీ సీఎం వర్సెస్ ఐపీఎస్ వివాదం తెరపైకొచ్చింది.
మాధా తాలూకాలోని కుర్దు గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకందారులకు అంజనా కృష్ణ సింహస్వప్నమై కూర్చుంది. అక్కడివారంతా అజిత్ పవార్ దృష్టికి తీసుకెళ్లేసరికి… మనం మొదటే చెప్పుకున్నట్టుగా అన్నిరంగాలనూ శాసించే మాస్టర్ కీ పాలిటిక్స్ అన్నట్టుగానే… వాటిని నిలిపివేయాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదేశిస్తూ అంజనాకు ఫోన్ చేశారు.
ఆ సందర్భంలో అసలు మీరు అజిత్ పవారేనని గ్యారంటీ ఏంటంటూ ప్రశ్నించింది డీఎస్పీ అంజనా కృష్ణ ఐపీఎస్. అది అసలే సీఎం తర్వాత సీఎం అంతవాడైన అజిత్ పవార్ కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అంతేకాదు, తనకు నమ్మకం కల్గాలంటే తన నంబర్ ఇస్తానని, తనకు వాట్సప్ కాల్ చేయాలని సదరు అజిత్ పవార్ కు చెప్పింది…
- ప్రస్తుత కాలంలో ఎందరో నకిలీ తహశీల్దార్లు, ఎస్సై, సీఐల నుంచి మొదలుకుంటే… ముఖ్యమంత్రి కార్యాలయ పీఆర్వోల పేరిట బురిడీ కొట్టిస్తూ, బెదిరిస్తున్న నకిలీలల ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలోనే.. సదరు ఐపీఎస్ అంజనా కూడా అడిగి ఉండొచ్చు.
దానికి అగ్గి భగ్గైన అజిత్ పవార్ నన్నే నీకు వాట్సప్ కాల్ చేయమంటావా…? నీమీద యాక్షన్ తీసుకోవడానికి ఒక్క నిమిషం చాలంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీచేశాడు. నా నంబర్ నువ్వే తీసుకో. వాట్సప్ కాల్ చేయ్. నీకంత ధైర్యం వచ్చిందా అంటూ అసహనంతో ఊగిపోతున్నట్టుగా పవార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అంతేకాదు, మట్టి తవ్వకాలపై చర్యలు ఆపకపోతే వెంటనే చర్య తీసుకుంటామంటూ కూడా తన ఉప ముఖ్యమంత్రి పదవి దర్పాన్ని అంజనాపై ప్రదర్శించాడు అజిత్ పవార్. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్స్ అంతా అంజనా కృష్ణకు మద్దతుగా.. అజిత్ పవార్ కు వ్యతిరేకంగా తెగ పోస్టులు చేస్తుండటంతో అంజనా కృష్ణ లేడీ సింగంగా ఇప్పుడు వార్తల్లో ప్రధాన వ్యక్తి అయ్యారు.
అయితే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా డీఎస్పీ హోదాలో పనిచేస్తున్న అంజనా కృష్ణకు డిప్యూటీ సీఎం ఎవరో తెలీదా… ? ఆమె మాట్లాడిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదనే వాదన అజిత్ పవార్ వర్గీయల నుంచి వినిపిస్తోంది. దీంతో ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది…
Share this Article