బడా బడా నిర్మాత బాబులు, దర్శక బాబులు, హీరో బాబులు, బ్రోకర్ బాబులు, డిస్ట్రిబ్యూషన్ బాబులు, బయ్యర్ బాబులు…. బాబులందరూ కలిసి కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాను రోగగ్రస్తం చేశారు… అత్యంత పవర్ఫుల్ క్రియేటివ్ కమ్యూనికేషన్ సినిమా… జనానికి చైతన్యాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కాదు, అపరిమితమైన వినోదాన్ని కూడా పంచగల మాధ్యమం… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కొత్త కెరటాలు వస్తున్నయ్… బూజును, పాచిని ఎంతోకొంత కడిగేస్తున్నయ్… ఆ దిశలో ఎవరు కదిలినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది… అలాగని ప్రతి ప్రయోగాన్ని నెత్తికెత్తుకోలేం… ఆస్వాదించలేం… ఆహా అని ప్రస్తుతించలేం… బాగుందబ్బాయ్ అని మనస్పూర్తిగా చెప్పలేని ఈ సినిమా ‘‘సినిమా బండి’’… కాకపోతే షార్ట్ ఫిలిమ్ తీయదగిన కథను పీకీ పీకి, సాగదీసి, కొత్తగా ఓ పూర్తి నిడివి మూవీలా చేసి, నెట్‌ఫ్లిక్స్ వాడికే అమ్మగలిగిన మార్కెటింగ్ సామర్థ్యానికి మాత్రం అభినందనలు చెప్పాలి… అలాగే సినిమాలో ఏమీ లేదా..? ఉంది…
‘‘Every One Is a Film Maker… At Heart’’ అనే ట్యాగ్ ఉంది సినిమా టైటిల్‌కు… అవును, ప్రతి ఒక్కరూ ఫిలిమ్ మేకర్లే… అలాగే తీసేశారు సినిమా… లేకపోతే ఏమిటబ్బా…? ఓ సోనీ వీడియో కెమెరాను కూడా చూసి ఉండలేదా ఆ ఊరోళ్లు..? అంత వింతగా చూస్తారా..? ఐనా కెమెరా అమ్మేయడంకన్నా సినిమా తీసేసి కోట్లు కుమ్మేద్దామని ఆలోచించడమే ఓ బీభత్సమైన పాయింట్… ఇక చూసుకో… ఓ హీరో, ఆ హీరో లవ్వరే హీరోయిన్… ఓ ముసలి తాత స్క్రీన్ ప్లే… సరిగ్గా తీస్తే చాలా ఫన్ క్రియేట్ చేయగల సబ్జెక్టు… కానీ అదే లోపించింది… పైగా అక్కడక్కడా నీరసంగా సాగుతుంది… మలుపుల్లేవ్, ఆ షూటింగుల సీన్లు కూడా పండలేదు… మొత్తానికి కథ రక్తికట్టలేదు… కానీ..? మరొకటి కూడా మెచ్చుకోవచ్చు… ఒకటీ అరా బూతులు తీసేస్తే… దర్శకుడు అసభ్య సీన్ల జోలికి పోలేదు… తను రాసుకున్న కథను సాఫీగా, మసాలాలు లేకుండా వండి ప్రజెంట్ చేశాడు…
Ads
కర్నాటక, ఏపీ సరిహద్దుల్లోని ఓ మాండలికాన్ని ఏమాత్రం ఖూనీ చేయకుండా వాడుకున్నారు… బెంగుళూరుకు వెళ్లి స్థిరపడిన అనంతపురం తదితర ప్రాంత వాసులకు భలే నచ్చేస్తుందేమో బహుశా ఇది… నటీనటులు కూడా బాగా కష్టపడ్డారు… విషయానికొద్దాం, ఎవరైనా సినిమా తీయొచ్చు అనే పాయింట్ దగ్గరకు… నిజమే కదా… యూట్యూబ్‌లో బొచ్చెడు షార్ట్ ఫిలిమ్స్, వాటిల్లోనూ బోలెడంత క్రియేటివిటీ… కాఫీ తాగినంత వీజీగా షార్ట్ ఫిలిమ్స్ తీసేస్తున్నారు… విలేజీ బ్యాక్ డ్రాప్, కామెడీ బిట్లయితే పిచ్చపిచ్చగా హిట్టవుతున్నయ్ కూడా… షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చి క్లిక్కయిన వాళ్లు కూడా ఉన్నారుగా… సో, ఎవరైనా సినిమా తీయొచ్చు… ఈ సినిమాలో హీరోలాగా… కానీ అది రంజింపచేయాలి… లేదా కొత్తకొత్తగా ప్రేక్షకుడిని పట్టేయగలగాలి… లేకపోతే ఇదుగో, ఇలాగే, ఈ సినిమాలో చెప్పినట్టే… ఈ ‘‘తాత రాసిన టైటానిక్కే…’’!!
Share this Article