Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…

September 11, 2025 by M S R

.

భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా అందంగా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారమివ్వాలి. పాఠకుడిని ఆకట్టుకోవాలి. కళ్లను కట్టి పడేసేలా డిజైన్ ఉండాలి.

యాడ్ చూశాక ఆ వస్తువును తప్పనిసరిగా కొనాలి అనిపించేలా ఆ యాడ్ లో భాష, భావం, డిస్ ప్లే ఉండాలి.
కంపెనీల నిర్లక్ష్యమో, యాడ్ ఏజెన్సీల చేతగానితనమో, అనువాదకుల అజ్ఞానమో లేక వీటన్నిటి కలగలుపో తెలియదు కానీ-ఇప్పుడొస్తున్న ప్రకటనలు చూడ్డానికే తప్ప చదవడానికి పనికి రావు.

Ads

సాధారణంగా ప్రకటనలు ఎవరూ చదవరు. ఒకవేళ సాహసించి ఎవరయినా చదివినా అర్థం కావు. అలా అర్థం కాకుండా రాయడం, యాడ్ ను ఇనుప గుగ్గిళ్లతో దుర్భేద్యమయిన విషయంగా తయారు చేయడం దానికదిగా ఒక విద్యలా ఉంది.

కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మంది మనసు గెలవాలని చేసే ప్రకటనల్లో అనువధ జరిగి పాఠకులకు కడుపులో ఎలా దేవినట్లు ఉంటుందో ప్రకటనకర్తలకు తెలియదు. లేక తెలిసినా పగబట్టి పాఠకులను హింసిస్తూ అజ్ఞానానందంలో మునిగితేలుతున్నారేమో!

బూడిద మిగిల్చిన స్వగృహ స్వప్నం:- హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్ అంటే భారతదేశంలో ఎక్కడా లేని రేట్లు ఉండే ప్రాంతం. సంపన్నుల స్వర్గసీమ. అన్నీ ఆకాశహర్మ్యాలే ఉంటాయి. 30, 40, 50 అంతస్తులతో పుష్ప సినిమాలో హీరోను పొగిడే పాటలో చెప్పినట్లు ఆకాశం అక్కడి భవనాల కాలి కింద వినయంగా పడి ఉంటుంది.

ఒక్కో అపార్ట్ మెంట్ 5 నుండి 25 కోట్ల దాకా ధర పలుకుతూ ఉంటుంది. అంతంత రేట్లు పెట్టి ఎవరు కొంటున్నారో సామాన్యులకు అర్థం కాదు. కొనేవారు ఉంటారు. లేకపోతే కట్టరు కదా!

అలాంటి ఒక నియోపోలిస్ హై రైజ్ అపార్ట్ మెంట్ ప్రకటన ఇంగ్లిష్ పత్రికల్లో, ఇంగ్లిష్ లో మాత్రమే వచ్చింది. సాధారణంగా అత్యంత విలాసవంతమైనవి కొనేవారు ఇలా ఇంగ్లిష్ లో మాత్రమే అలోచించి కొంటారని మార్కెట్ పరిశీలన కాబట్టి ఇక్కడ భాష చర్చ అప్రస్తుతం!

ads

శుభమా అని ఇల్లు కొనబోతూ ఆ ప్రకటన చూస్తే…ఏదో పెద్ద అగ్నిప్రమాదం వార్తేమో అనిపించేలా నిర్మాణ బ్లూ ప్రింట్లు తగలబెట్టడం, ఆరని మంటలు, బూడిదతో మొదటి పేజీని డిజైన్ చేశారు. పక్క పేజీలో బూడిదను పూసి…”మేము తొక్కలో బ్లూ ప్రింట్లన్నీ తగలబెట్టాం…ఆకాశానికి నిచ్చెన వేసే మా ప్రాజెక్టుకోసం ఎదురుచూడండి” అని హెచ్చరించారు.

ఈ ప్రకటన చూశాక, చదివాక సాధారణ పాఠకులకు కలిగే అభిప్రాయాలివి:-

# హోమం చేసి ఇంట్లోకి వెళ్లినట్లు ఈ ప్రాజెక్టులో మొదట గుమ్మంలో బ్లూ ప్రింట్లు తగలబెట్టి…ఆ బూడిద చల్లుతూ ఇంట్లోకి వెళ్లాలేమో!

# రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని శిథిలాలనుండి శిఖరాలకు ఎదగడం మీద ఇంగ్లిష్ సామెతకు ఇది ప్రతీకాత్మక డిజైన్ ఏమో!

# అందరూ పడిపోతే…వీళ్ళు లేస్తారట. అదెలాగో తెలుసుకోవాలంటే మీరు ఇంగ్లిష్ లో గుమ్మం ముందు మంట పెట్టుకుని బూడిద చేతిలో పట్టుకుంటే కానీ తత్వం బోధపడదు!

# చివరకు మిగిలేది బూడిదే- అన్న తాత్విక సంబంధమైన ఎరుక కలిగించడమే ఇందులో ప్రధానమైన ఉద్దేశమైతే ఈ ప్రకటన రాసిన, డిజైన్ చేసినవారి కాళ్ళెక్కడున్నాయో వెతకడం ఒక్కటే మన తక్షణ కర్తవ్యం కావాలి!

వందేళ్ళ వస్త్ర ప్రయాణం:- ప్రకటన ఎలా ఉండకూడదో చెప్పినప్పుడు…ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడం ధర్మం. రేమండ్స్ బట్టల కంపెనీ జగద్వితం. కంప్లిట్ మ్యాన్ పేరుతో రేమండ్స్ ప్రకటనలు కొన్ని దశాబ్దాలుగా లోకానికి పరిచయం. అలాంటి రేమండ్స్ కు వందేళ్ళు వచ్చిన సందర్భంగా ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్ ఆవిష్కరించిన కామన్ మ్యాన్ ను అద్దం ముందు నిలుచోబెట్టి…ఆ ప్రతిబింబానికి రేమండ్స్ బట్టలు తొడిగి…”డ్రెస్సింగ్ అప్ ది కామన్ మ్యాన్ సిన్స్ 1925″ అని అర్థవంతమైన శీర్షిక పెట్టారు.

raymonds

ఐడియా, రాత, డిజైన్, ప్రెజెంటేషన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీనివెనుక చాలా సృజనాత్మక శ్రమ ఉంది. కనిపించీ…కనిపించకుండా ఒక బట్ట బ్యాగ్రవుండ్ డిజైన్ మీద ఈ మొత్తం యాడ్ ను తయారుచేసినవారిని అభినందించి తీరాలి.

చాలా సింపుల్ గా చెప్పడానికి చాలా కష్టపడాలి. చాలా అధ్యయనం ఉండాలి. విషయం మీద లోతైన అవగాహన ఉండాలి. లేకపోతే నియోపోలిస్ వాడు ఇంటిముందే మంటపెట్టి…పొమ్మనలేక యాడ్ పొగబెట్టినట్లే ఉంటుంది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions