.
Subramanyam Dogiparthi
…. తెలుగు ప్రజలు మీసం మెలేసి గర్వంగా చెప్పుకునే యుధ్ధాలు రెండు . ఒకటి ఆంధ్ర మహాభారతం పల్నాటి యుధ్ధం . రెండవది బొబ్బిలి యుధ్ధం . పల్నాటి యుధ్ధం మా పల్నాడు ప్రాంతానికి సంబంధించినది అయితే బొబ్బిలి యుధ్ధం ఉత్తరాంధ్రది . బొబ్బిలి యుధ్ధం అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చే యోధుడు , బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు .
తాండ్ర పాపారాయుడు అనగానే గుర్తుకొచ్చే మహా నటుడు యస్వీఆర్ . 1964లో వచ్చిన బొబ్బిలి యుధ్ధం సినిమాలో ఆఖరి సీన్లో విజయరామరాజుని గుండెల మీద కూర్చుని పొడిచి పొడిచి కసితీరా చంపేసే యస్వీఆరే గుర్తుకొస్తాడు .
Ads
అలాంటి ఆ పాత్రను కృష్ణంరాజు వేయటమంటే సాహసమే . ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజే జయప్రదతో చెప్పారు . పొగరుతో తీసాను ఆ సినిమాను అని . అంతే కాదు చాలా రిచ్ గా కూడా తీసారు . వాస్తవానికి ఆ యుధ్ధం ఒక్క రోజులోనే ముగిసే యుధ్ధం . బొబ్బిలి చిన్న రాజ్యం . అలాగే రాజాం కూడా చిన్న పరగణా .
అయితే ఈ సినిమాలో మూడు అంతఃపురాలను , రాజసభలను అద్భుతమైన సెట్టింగులతో చూపారు నిర్మాత కృష్ణంరాజు , దర్శకుడు దాసరి . ఆర్ట్ డైరెక్టర్ని , సెట్టింగులను వేసిన సాంకేతిక బృందానికి అభినందనలను చెప్పాల్సిందే . భారీ ఖర్చుతో నిర్మించారు . సుమారు 1.5 కోట్ల భారీ బడ్జెట్తో తీసారు . వ్యాపారపరంగా వర్కవుట్ కాలేదు .
మూడేళ్ళ కింద ఇదే రోజుల్లో మేము విజయనగరం , బొబ్బిలి , రాజాం , రణస్థలం ప్రాంతాలను , దేవాలయాలను సందర్శించాం . బొబ్బిలి పట్టణంలోని వార్ మెమోరియల్ని , కోటను కూడా చూసాం . బొబ్బిలి రాజ్యం చిన్నదయినా శౌర్యానికి , పౌరుషానికి , నీతినిజాయితీలకు ప్రతీక . తమ కన్నా ఎంతో పెద్ద రాజ్యమయిన విజయనగరం రాజులతో పలు యుధ్ధాలలో వారిని ఓడించారు .
ఆ కక్షతో , అవమాన భారంతో ఆనాటి విజయనగరం మహారాజయిన విజయరామరాజు ఫ్రెంచి వాడయిన బుస్సీతో , హైదర్ జంగుతో చేతులు కలిపి బొబ్బిలి కోటను నాశనం చేస్తాడు . 1756 జనవరిలో జరిగింది ఈ యుధ్ధం .
ఈ కధను దాసరి , కృష్ణంరాజు , కొండవీటి వెంకట కవి అద్భుతంగా ఓ దృశ్య కావ్యంగా మలిచారు . యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు , పద్యాలు చాలా కళాత్మకంగా , శ్రావ్యంగా ఉంటాయి . బొబ్బిలి యుధ్ధం సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడు .
ఈ సినిమాలో ముఖ్యంగా అభినందన మందార మాల అధినాయక స్వాగత వేళ పాట సూపర్ హిట్ సాంగ్ . చిత్రీకరణ అద్భుతం . కృష్ణంరాజు , జయప్రద జంట కమనీయంగా ఉంటుంది . సినిమాలో కృష్ణంరాజు కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉంటాయో ! ఆయనవే కాదు అందరి కాస్ట్యూమ్స్ కూడా చాలా రిచ్ గా ఉంటాయి . కాబట్టే కాస్ట్యూమ్స్ డిజైనర్ కామేశ్వరరావుకు నంది అవార్డు వచ్చింది .
విజయరామరాజు సభలో రాజంటే నీవేలే రాజరాజంటే నీవేలే అంటూ సాగే పాటలో హేమా చౌదరి , సీమల నృత్యం కూడా చాలా బాగా చిత్రీకరించారు దాసరి . అలాగే సిల్క్ స్మిత , జయమాలిని డాన్సులను కూడా చాలా అందంగా చిత్రీకరించారు దాసరి .
మల్లె కన్నా తెల్లనిది తల్లి దీవెనా పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది . సినిమాలో పద్యాలను కొండవీటి వెంకట కవే వ్రాసారు . సంభాషణలను కొండవీటి వెంకటకవి వ్రాసారు . ఓ యస్ ఆర్ ఆంజనేయులు , యామినీ సరస్వతి సహ రచయితలుగా పనిచేసారు .
పాటల్ని సి నారాయణరెడ్డి , కొసరాజు , దాసరి వ్రాసారు . జేసుదాస్ , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , నాగూర్ , వాణీ జయరాంలు చాలా శ్రావ్యంగా పాడారు .
చారిత్రక సినిమా కాబట్టి భారీ తారాగణం ఉంది . కృష్ణంరాజు , జయప్రద , మోహన్ బాబు , జయసుధ , సుమలత , ప్రభ , అంజలీదేవి , గుమ్మడి , జె వి సోమయాజులు , సుధాకర్ , కోట శ్రీనివాసరావు , త్యాగరాజు , కాంతారావు , సూర్యకాంతం , సారధి , నగేష్ , పి జె శర్మ , విజయలలిత , మిక్కిలినేని , సుత్తి వేలు , ప్రభృతులు నటించారు . ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్ బుస్సీగా , మరో నటుడు మాణిక్ ఇరానీ నటించారు .
ఈ సినిమాకు ఓ విశేషం ఉంది . వేర్వేరు కాలాల్లో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఆరుగురు యంపీలు ఈ సినిమాకు పనిచేసారు . కృష్ణంరాజు , దాసరి , సి నారాయణరెడ్డి , జయప్రద , సుమలత , మోహన్ బాబులు … కృష్ణంరాజు , దాసరి మంత్రులుగా కూడా పనిచేసారు . కోట శ్రీనివాసరావు MLA అయ్యారు …
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడవచ్చు . ముఖ్యంగా పాటలు , కృష్ణంరాజు నటన , క్లైమాక్స్ యుధ్ధంలో జయప్రద , సుమలతల వీర మరణం బాగుంటాయి .
తెలుగు వీర నారీమణుల శౌర్యప్రతాపాలను తెలుసుకుంటాం . యుధ్ధంలో ఓడిపోయిన రాజ కుటుంబీకుల స్త్రీలందరూ శత్రువులకు చిక్కకుండా ప్రాణ త్యాగాలు చేయటం గుండెల్ని పిండేస్తుంది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article