.
తేజ సజ్జ… ఈ ఒకప్పటి బాలనటుడు హను-మాన్ సినిమాతో హీరోగా ఓ మెట్టు ఎక్కాడు… పాన్-ఇండియా ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు… ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరో మెట్టు ఎక్కి, తన కెరీర్‌కు మరికొంత బూస్టప్ ఇచ్చుకున్నట్టే…
(నటన సంగతి ఎలా ఉన్నా… మొన్నామధ్య ఎవరో విలేకరి సినిమాల్లో మతం గురించి వేసిన ప్రశ్నకు తేజ మంచి పరిణత జవాబు ఇచ్చిన తీరు నచ్చింది…) అఫ్‌కోర్స్, ఇంకాస్త నటనలో సాధన అవసరం అనిపిస్తుంది అక్కడక్కడా… కానీ ఈ సినిమా రక్తికట్టించే ప్రజెంటేషన్ ఫ్లోలో అది పెద్ద ఆడ్‌గా అనిపించదు…
Ads
పౌరాణిక పాత్రలు, వర్తమాన కథకూ లింకు పెట్టే చాలా సినిమాలు వచ్చాయి, వస్తాయి, ఇప్పుడిది ట్రెండ్ కూడా..! మనవాళ్లకేమో గానీ హిందీ ప్రేక్షకులకు నచ్చే చాన్స్ ఉన్న మరో తెలుగు సినిమా ఇది… నెగెటివ్ ఫోర్సెస్ వర్సెస్ పాజిటివ్ ఫోర్సెస్… అంటే దైవశక్తులకూ దుష్టశక్తులకూ నడుమ సమరం బాపతు కథ…
ఇక్కడే గ్రాఫిక్స్ గురించి చెప్పుకోవాలి… హను-మాన్ గానీ ఈ సినిమాలో గానీ గ్రాఫిక్స్ తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఔట్‌పుట్ సాధించారు… మహావతార్ నరసింహ కూడా అంతే… ఆల్రెడీ అది దుమ్మురేపింది బాక్సాఫీసు వద్ద… మరి ఆర్ఆర్ఆర్‌లు, ఆదిపురుష్‌లు వందల కోట్ల ఖర్చు ఎందుకు చూపిస్తున్నారు..? ఈ మిస్టరీలను ఈడీ మాత్రమే తేల్చగలదేమో…
సరే, మిరాయ్ కథకు వస్తే… అశోకుడి కాలం నుంచి రహస్యంగా దాగి ఉన్న నైన్ ఆఫ్ అశోక అనే శక్తివంతమైన నిగూఢరహస్యాలను దోచుకోవాలని ఒక శక్తివంతమైన శత్రువు (మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు… వాటిని కాపాడటానికి తరతరాలుగా ఉన్న యోధులు ముందుంటారు… ఆధునిక కాలంలో ఆ రహస్యాలు బయటపడి ప్రపంచానికి ప్రమాదం రాకుండా ఆపాల్సిన బాధ్యత తేజా (తేజా సజ్జ) మీద పడుతుంది… ఈ క్రమంలో అతని వ్యక్తిగత ప్రయాణం, తల్లి (శ్రియా శరణ్) కోరికను నెరవేర్చడం, పురాణాల్లో దాగి ఉన్న సమాధానం కనుగొనడం కథలో కీలకం…
ఒక యోధుడిలా కనిపించే ఈ కథానాయకుడి పాత్రను తేజా సరిగ్గా పోషించాడు… అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు… పాత్రకు అవసరమైనంత… మరీ స్టార్ హీరోలు ప్రదర్శించే ఇమేజ్ బిల్డప్పులు, ఓవరాక్షన్ లేకుండా అన్నమాట… అతని స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్లు, తల్లితో ఉన్న ఎమోషనల్ కోణం— well balanced… ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయుధ శక్తి గ్రహించే సన్నివేశం విజువల్‌గా, ఎమోషనల్‌గా సినిమాలో హైలెట్…
మంచు మనోజ్ కూడా బాగా చేశాడు… బ్లాక్ స్వోర్డ్ పాత్రలో కొత్తగా కనిపించాడు… ఓవర్ యాక్టింగ్ లేకుండా, కంట్రోల్‌లో ఉన్నాడు… ప్రభావవంతంగా నటించాడు… హీరో పాత్రలే కావాలని కోరుకోకుండా, ఇలాంటి పాత్రలు వస్తున్నప్పుడు అంగీకరించడం మేలు…
శ్రియా శరణ్ ఓ తల్లి పాత్రలో ఇమిడిపోయింది… ఆమె నటనానుభవం ఈ పాత్రకు బాగా ఉపయోగపడింది… ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్లు చిత్రానికి కొత్త బలం… రితికా నాయక్‌ది సాదాసీదా పాత్రే అయినా దానికి ఆమె సరిపోయింది… హీరోయిన్‌లా కృత్రిమంగా కాకుండా, సహజంగా కనిపించింది…
జగపతి బాబు పర్లేదు… గెటప్ శ్రీను కంట్రోల్‌లో ఉండటం బాగుంది… దర్శకుడు ఓవరాక్షన్ చేయకుండా తనను కంట్రోల్ చేశాడు…
దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని మొదటి సీన్ నుంచే కథలోకి నేరుగా తీసుకెళ్తాడు… పెద్ద ఉపోద్ఘాతాలు ఏమీ లేవు… సీక్రెట్ నైన్, యోధుల గాధలతో ఆసక్తికరమైన వాతావరణం సృష్టించాడు… ఫస్టాఫ్ తేజ ఎంట్రీ కొంచెం రొటీన్‌గా అనిపించినా, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో అది బోర్ కొట్టనివ్వదు…
ఇంటర్వెల్ బ్లాక్‌గా తేజా- పక్షి సీక్వెన్స్ సినిమాకి పెద్ద ప్లస్… ఆయుధ శక్తి గ్రహించే ఫైట్ బ్లాక్ విజువల్ ట్రీట్… శ్రియ సరణ్ రివీల్, మనోజ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్లు కూడా బాగా పండాయి… గౌర హరి అందించిన BGM సినిమాకి గుండె… యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఎనర్జీని పెంచింది…కార్తిక్ స్వయంగా చేసిన విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి… పక్షి సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్లు సూపర్‌గా కనిపిస్తాయి…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది… తక్కువ బడ్జెట్‌లోనే గ్రాండ్ లుక్ ఇచ్చారు… సీక్రెట్ నైన్ స్టోరీ లైన్ బాగుంది, కొంతమేరకు సెకండాఫ్ లెంతీ అనిపించినా, కొన్ని సీన్లు కృతకంగా ఉన్నా… స్థూలంగా… ఇప్పుడు మార్కెట్‌లో ఓ మోస్తరు పాపులర్ సినిమా కూడా ఏదీ లేనందున… ఇది హిట్ బాటే..!!
Share this Article