.
Subramanyam Dogiparthi ….. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కధ . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయిఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు .
మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా ఇది . 1986 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా రాజేంద్రప్రసాద్ , వంశీ కెరీర్లలో ఓ మైలురాయిగా మిగిలి పోయిన మసాలా క్లాసిక్ .
Ads
గోదావరి , గోదావరి గ్రామాల , కాలువల , కొబ్బరిచెట్ల అందాలను అద్భుతంగా చూపించిన మరో సినిమా . ఫొటోగ్రఫీ డైరెక్టర్ హరి అనుమోలుని ప్రత్యేకంగా అభినందించాలి . ప్రకృతినే కాదు ; నలుగురు సుందరీమణులను కూడా ప్రకృతి అంత అందంగా చూపారు హరి అనుమోలు .
జమజచ్చ కోసం ముందు ముగ్గురు సుందరీమణులకు గాలం వేస్తాడు టైలర్ సుందరం . ఆ ముగ్గురుగా నాగమణి , దయ , నీలవేణి పాత్రల్లో వై విజయ , దీప , సంధ్య . సంధ్య అనే నటి మా గుంటూరు అమ్మాయి అనుకుంటా . Subject to correction .
పాపం ఈ ముగ్గురు అమ్మాయిలు సుందరాన్ని నిజంగానే వీర ప్రేమించేస్తారు . ఎవరికి వారు సుందరంతో ఊహల్లో విహరిస్తూ ఉంటారు . పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు . ముగ్గురికీ జమజచ్చ లేదని తెలిసాక వాళ్ళను తప్పించుకుంటూ ఊరికి కొత్తగా వచ్చిన టీచరమ్మ సుజాత (అర్చన)కు గాలం వేస్తాడు .
సుందరం అమాయకత్వానికి సానుభూతి కలిగిన టీచరమ్మ తన చుట్టూ తిరిగే సుందరంని వద్దనదు . క్లైమాక్సులో సుందరం మోసం తెలిసి అసహ్యించుకున్నా అతని పశ్చాత్తాపానికి మనసు మార్చుకుని పెళ్ళి చేసుకుంటుంది . ఇదంతా మెయిన్ ట్రాక్ .
సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చివర్లో బాగుంటుంది . మా గుంటూరు విలన్ ప్రదీప్ శక్తి చెల్లెలు గర్భవతి కావటం , అందుకు కారణమైన సీతారాముడు పాత్రధారి , టైలర్ సుందరం అసిస్టెంట్ శుభలేఖ సుధాకర్ని ఏసేయపోవటం , అతన్ని వారించి టీచరమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించటంతో సినిమాకు శుభం కార్డ్ పడుతుంది .
విశ్వనాధ్ , బాపు , జంధ్యాల , వంశీ సినిమాల్లో నటీనటులు కనపడరు మనకు . పాత్రలే కనిపిస్తాయి . ఊరూపేరు లేని వారితో కూడా గొప్పగా నడిపించేస్తారు సినిమాలను . ఈ లేడీస్ టైలర్ సినిమాలో కూడా రాజేంద్రప్రసాద్ , శుభలేఖ సుధాకర్ , దీప , వై విజయ , రాళ్లపల్లిలు మినహాయిస్తే మిగిలిన వారందరూ ఔత్సాహికులు , జూనియర్ ఆర్టిస్టులే .
నటనపరంగా రాజేంద్రప్రసాద్ , శుభలేఖ సుధాకర్లకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . అర్చన నటనా ప్రతిభను నిరీక్షణలో చూసాం . ఈ సినిమాలో కూడా నల్లందంతో , కళ్ళందంతో కట్టి పడేసింది . టీచరమ్మల్ని ప్రేమిస్తే ఊరకూరకే ప్రేమపూర్వక బడిత పూజ చేస్తారని భయపెడుతుంది .
వై విజయ నటన గురించి చెప్పేదేముంది . మెలికలు తిరుగుతూ హాల్లో కూర్చున్నోళ్ళని కూడా మెలికలు తిరిగేలా చేసేసింది . దీప , సంధ్య , విలన్ చెల్లెలు (పేరు గౌరి ) , మధ్య వయసులో కూడా మెలికలు తిరిగే సంధ్య తల్లి బాగా నటించారు .
ప్రదీప్ శక్తి నటించినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులు గుర్తుంచుకునే నటుడు . ముఖ్యంగా ఆయన కెరీర్లో ఈ సినిమాలోని వెంకటరత్నం పాత్ర పేరుతో సహా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే . అతని అసిస్టెంటుగా శీను పాత్రలో కర్ణన్ నటనని కూడా ఎవరూ మరచిపోరు .
మరో ప్రధాన పాత్ర బట్టల సత్యం మల్లికార్జునరావుది . వాస్తవానికి సెకండ్ ఇంపార్టెంట్ పాత్ర ఇదే . మల్లికార్జున
రావు బ్రహ్మాండంగా నటించాడు . కనిపించేది కాసేపే అయినా సినిమాను ముందుకు నడిపించే కోయదొర పాత్ర రాళ్ళపల్లిది . ఇలాంటి పాత్రలు అతనికీ కొట్టిన పిండే . మరో పాత్ర చావు ఫొటోల స్పెషలిస్ట్ థం . పెళ్లిచూపుల పోలీస్ కానిస్టేబులుగా తనికెళ్ళ భరణి నటించారు .
స్క్రీన్ ప్లే తయారీలో వంశీతో పాటు భరణి , వేమూరి సత్యనారాయణ కూడా పాలుపంచుకున్నారు . భరణి సంభాషణలను కూడా వ్రాసారు . ఈ సినిమాలో ప్రేక్షకులకు ఊతపదాలయిన మాటలు చాలానే ఉన్నాయి . ముఖ్యంగా “జ” భాష , జమజచ్చ , బల్లి శాస్త్రం వంటివి చాలానే ఉన్నాయి .
ఇళయరాజా సంగీతం , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు , బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ గొంతులు మంచి హిట్ సాంగ్సునే ఇచ్చాయి . హాయమ్మ హాయమ్మ హాయమ్మా , పొరపాటిది తడబాటిది , ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాటలు బాగా హిట్టయ్యాయి . ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాట చిత్రీకరణ బాగుంటుంది .
మరో పాట గోపికల వస్త్రాపరణం . గోపీలోలా నీ పాల పడ్డానురా అల్లరిఅల్లరిగా బాగుంటుంది . పాటలన్నీ గోదావరి నేపధ్యంలో ఉండటం వలన చాలా అందంగా ఉంటాయి . (ఒక పాటను ముందు షూట్ చేసేసి, తరువాత పాటకట్టారుట… )
ప్రతీ ఫ్రేములో వంశీ కనిపిస్తాడు . హాస్యంతో ఆడుతూ పాడుతూ రొమాంటిగ్గా సాగే సినిమాలో ధనాల్న కుదుపులను పెట్టి ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ పెట్టి రక్తి కట్టించాడు వంశీ . రాజేంద్రప్రసాద్ పాత్ర మీద సానుభూతి కలిగిస్తాడు . టీచరమ్మతో పెళ్లి చేస్తాడు .
ఇంకా ట్విస్ట్ ఏమిటంటే ఆ జమజచ్చ విలన్ పిచ్చి చెల్లెలికి ఉండటం . అయితే అప్పటికే మూఢనమ్మకాలు , సోమరిపోతుతనం , జాతకాల పిచ్చి , వగైరా అంశాల మీద టీచరమ్మ క్లాస్ పీకి ఉంటుంది .
తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళంలోకి డబ్ అయింది . 2006 లో ఇదే టైటిలుతో హిందీలోకి రీమేక్ అయింది కూడా . హిందీలో కూడా హిట్టయింది . మొత్తం మీద సరదా సరదా మ్యూజికల్ హిలేరియస్ మూవీ . చాలామంది చాలాసార్లే చూసి ఉంటారు .
టివిలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది . స్రవంతి కిషోర్ నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article