.
ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో ఆటోమేటిగ్గా ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకునే సాంకేతికత చాలా దశాబ్దాలుగా అందుబాటులో ఉంది. అయితే సీటు బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకుని రక్షణగా నిలబడతాయన్న విషయం తెలియక చాలా మంది సీటు బెల్ట్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండి ప్రాణాలు కోల్పోతుంటారు.
- వెనుక సీట్లో కూర్చున్నవారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అలా వెనుక సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకోక వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, టాటా గ్రూపు మాజీ సారథి సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం లోకానికి తెలిసిందే.
ఈమధ్య అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానంలో ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. మెడికల్ కాలేజీ మీద ఆ విమానం పడి ప్రయాణానికి సంబంధం లేనివారు కూడా పదుల సంఖ్యలో చనిపోయారు. దీనితరువాత వరుసగా ప్రపంచవ్యాప్తంగా చాలా విమాన ప్రమాదాలు జరిగాయి.
Ads
ఈనేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకునే పద్ధతిలోనే విమానం చుట్టూ ఒక పట్టు పరుపులా ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు, ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడవచ్చు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు. ఫలితం ఆశాజనకంగానే ఉంది.
బిట్స్ పిలానీ దుబాయ్ శాఖకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఎషెల్ వాసిం, దర్శన్ శ్రీనివాస్ “ప్రాజెక్ట్ రీబర్త్” పేరిట ఈ సరికొత్త ఆవిష్కరణ చేశారు. విమానం మూడు వేల అడుగులకంటే తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదం అనివార్యమైనప్పుడు రెండు సెకెన్లలోపు ఎయిర్ బ్యాగ్ రక్షణ కవచంలా మొత్తం విమానం చుట్టూ కప్పేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
మరికొన్ని ప్రయోగాలు జరిపి… ఏరోస్పేస్ ల్యాబ్ తో కూడా పనిచేసి… శాస్త్రీయంగా నిరూపణ కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. దీనిద్వారా ఎంతో కొంత నష్టాన్ని తగ్గించగలిగితే మంచిదే… AirBag to AirBus…
Share this Article