.
Subramanyam Dogiparthi
…. మనకు దాసరి నారాయణరావు ఎలాగో తమిళ నాటక , సినిమా రంగాలకు విసు అలాంటి వాడు . అయితే దాసరి విజయాలు విసు విజయాల కన్నా చాలా చాలా ఎక్కువ .
విసు తమిళంలో చాలా నాటకాలను వ్రాసారు , వేసారు , వేయించారు . కొన్నింటిని సినిమాలుగా తీసారు , నటించారు కూడా . ఆ వరుస లోనిదే తిరుమతి ఒరు వెగుమతి అనే నాటకం . ఆ నాటకాన్నే అదే టైటిలుతో తమిళంలో సినిమాగా తీసారు . ఒక ముఖ్య పాత్రలో నటించారు కూడా .
Ads
తమిళంలో సక్సెస్ అయిన ఆ సినిమాని తెలుగులో శ్రీమతి ఒక బహుమతి అనే టైటిలుతో ఆయన దర్శకత్వం వహిస్తూ తమిళంలో తాను వేసిన పాత్రనే తెలుగులో కూడా వేసారు . కధను నెగటివ్ గా నడిపిస్తారు . అక్కడక్కడా ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారు . కధ , దర్శకత్వాలతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఆయనదే .
ఐనా మహిళలు బ్రహ్మాండంగా మెచ్చిన చిత్రం . ప్రధాన పాత్రధారిణి జయసుధ చివర్లో చనిపోతుంది . ప్రేక్షకుల సానుభూతితో నిర్మాతలకు , ఎగ్జిబిటర్లకు డబ్బులు బాగానే వచ్చాయి . వంద రోజుల ఫంక్షన్ని సినిమా నిర్మాతలలో ఒకరయిన మద్రాస్ ఎ వి కె రెడ్డి గారి సవేరా హోటల్లోనే జరిగింది . సి నారాయణరెడ్డి గారు ముఖ్య అతిధిగా వచ్చారు .
తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అక్క , ఆమె ఇద్దరు తమ్ముళ్ళ కధ . తల్లిదండ్రులు చనిపోయాక తమ్ముళ్ళను , చెల్లెళ్ళను సాకి , ప్రయోజకులను చేసాక వాళ్ళ భార్యలో , భర్తలో , వాళ్ళో తెప్ప తగిలేసి వెళ్ళిపోయే సినిమాలు మనకు కుప్పలుకుప్పలు . ఆల్మోస్ట్ అలాంటి అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు .
కారణం అలాంటి దురదృష్టకరమైన అనుభవాలు మనలో చాలామందికి ఉంటాయి . ఒకప్పుడు కొడుకులే చేసేవారు . ఇప్పుడు కూతుళ్లు కూడా కొడుకులకు ఏమీ తీసిపోవటం లేదు . మహిళా సాధికారికత ఈ విషయంలో కూడా వచ్చింది .
ఈ సినిమాలో కధ కూడా అలాంటిదే . ఇద్దరు తమ్ముళ్ళను సాకుతుండే జయసుధకు ఆఫీసులో మంచి బాలుడు చంద్రమోహన్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు . సీత ఎక్కడ ఉంటే అదే అయోధ్య నాకు అని అనటమే కాకుండా అలాగే చూసుకుంటాడు .
ఇద్దరు తమ్ముళ్ళకు భార్యలు వస్తారు . పెద్ద మరదలికి డబ్బు పిచ్చి . చిన్న మరదలికి డబ్బున్న కుటుంబం నుండి రావటం వలన స్వాతిశయం , పొగరు ఎక్కువ . ఆ ఇద్దరి ప్రవర్తన వలన కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది . అక్కాబావలు వీధిన పడతారు .
పెద్ద తమ్ముడు అవినీతి నిరోధక శాఖ వారికి చిక్కుతాడు . క్లైమాక్సులో జయసుధ చనిపోయాక అందరికీ పశ్చాత్తాపం కలుగుతుంది . ప్రేక్షకులు బరువైన హృదయంతో థియేటర్ నుండి ఇంటికి వెళతారు .
ఈ సినిమా దర్శకుడు అయిన విసు తమ్ముడు క్రిష్ము కూడా నటించాడు . ఇద్దరూ కాస్త ఒకేలా ఉండటమే కాకుండా నటన కూడా ఒకేలా ఉంటుంది . ఇద్దరి పాత్రలూ ఇంపార్టెంటే . తమ్ముళ్ళుగా నరేష్ , తులసిరాం , జయసుధ మంచి భర్తగా చంద్రమోహన్ నటించారు . చంద్రమోహన్ ఎప్పటిలాగే చాలా బాగా నటించారు . జయసుధకి ఇలాంటి పాత్రలు కరతలామలకమేగా .
మరదళ్ళుగా ముచ్చెర్ల అరుణ , కల్పన బాగా నటించారు . అరుణ తల్లిగా పి ఆర్ వరలక్ష్మి , బిందు ఘోష్ , తదితరులు నటించారు . డైలాగులను ఆకెళ్ళ వ్రాసారు . బాగుంటాయి . పాటలనన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసారు .
శంకర్- గణేష్ ద్వయం సంగీత దర్శకత్వాన్ని వహించారు . పాటలకు శ్రావ్యమైన సంగీతాన్నే కాక చక్కటి బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని కూడా అందించారు . బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , యం యస్ రంగనాధ్ , వాణీజయరాం , శైలజలు పాటల్ని పాడారు .
బాలసుబ్రమణ్యం పాడిన ఆడదె ఆధారం మన కధ ఆడనె ఆరంభం పాటను శాస్త్రి గారు అద్భుతంగా వ్రాసారు . సాహిత్యాభిలాషులు ఆ లిరిక్సుని తప్పక చదవాలి . స్త్రీ గొప్పతనాన్ని , చరిత్రలో చరిత్రలను సృష్టించిన స్త్రీమూర్తుల గురించి బ్రహ్మాండంగా వ్రాసారు . పాట బాగా హిట్టయింది కూడా .
వాణీజయరాం పాడిన కీలు బొమ్మను నేను శ్రావ్యంగా ఉంటుంది . జేసుదాస్ పాడిన నింగిని విడిచిన చినుకును కూడా శ్రావ్యంగా ఉంటుంది . అక్కాబావ మా అమ్మానాన్న , వాటెయ్యరా స్వామి పాటలు కూడా బాగుంటాయి . వాటెయ్యరా స్వామి కాస్త హాటుగానే ఉంటుంది .
తమిళంలో పాండ్యన్ , విసు , కల్పన , ప్రభృతులు నటించారు . కృష్ణ మెచిడ రాధె అనే టైటిలుతో కన్నడంలో కూడా రీమేక్ అయింది . కన్నడంలో సంగీత , శ్రీనాధ్ , వినోద్ కుమార్ , చిత్ర , ప్రభృతులు నటించారు . మహిళా సెంటిమెంట్ ఉన్న కధ కావటంతో అన్ని భాషల్లోనూ కమర్షియల్గా సక్సెస్ అయింది .
స్లోగా నడిచినా సినిమా సంసారపక్షంగా బాగానే ఉంటుంది . జయసుధ అభిమానులకు , సెంటిమెంట్ ఎమోషన్ సినిమాలను లైక్ చేసేవారికి నచ్చుతుంది . సందేశం ఏమిటంటే మొగుళ్ళను హింసించకండి , కాపురాలను కూల్చుకోకండి . అప్పట్లో ఏడిపించే వాళ్ళు . ఇప్పుడయితే లేపేయటమే . 1986 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . ట్రై చేయవచ్చు . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article