.
మంత్రి సీతక్క… ఆమె జిల్లా ఎస్పీ శబరీష్ మోటార్ సైకిల్ వెనుక కూర్చుని మేడారం జాతర పరిసరాల్లో పర్యటించిన ఫోటో నిన్న వైరల్… గుడ్ టు సీ దట్ ఫోటో… కానీ ఎందుకు..?
మంత్రుల దాకా ఎందుకు… చిన్న చిన్న ఊళ్ల సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, చోటా నాయకులు కూడా కాన్వాయ్స్ మెయింటెయిన్ చేస్తున్న రోజులివి… అట్టహాసం, ఆడంబరం, పటాటోపం…
ఆమెకు కాన్వాయ్ లేక కాదు… కానీ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఓ జిల్లా ఎస్పీని వెంటేసుకుని ఓ మోటార్ సైకిల్ మీద పర్యవేక్షణ పనుల్లో తిరుగుతున్న ఫోటో సొసైటీకి మంచి సంకేతాలను ఇస్తుంది… స్థానికులను ఈజీగా కలుస్తూ, పలకరిస్తూ తిరగడం అభినందనీయం…
Ads
అవును, ఈమధ్య నల్గగొండ, ఖమ్మం రెడ్డి లీడర్లు హెలికాప్టర్ ప్రయాణాలు బాగా విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ఓ మహిళా ఆదివాసీ మంత్రి ఇలా నిరాడంబరంగా జనంలోకి వెళ్లడం కంట్రాస్టు విశేషమే కదా మరి… జనం అట్టహాసాలను ఇష్టపడరు… తమ దగ్గరకు ఓ కామన్ మ్యాన్‌లా రావడాన్నే ఇష్టపడతారు…
పైగా ఆమె ఒకప్పుడు అడవుల్లో పోలీసులను తప్పించుకుంటూ తిరిగిన నక్సలైట్… ఇప్పుడు ఆమే ఓ పాలకురాలు… ఓ పోలీస్ ఎస్పీని వెంటేసుకుని అవే అడవుల్లో తిరుగుతున్న తీరు మరో కంట్రాస్టు విశేషం… అజ్ఞాతంలో ఉంటూ పోరాడే నక్సలైట్లూ ప్రధాన జీవన స్రవంతిలోకి రండి, మీరే పాలకులైతే మేమే బ్రహ్మరథం పడతామని చెప్పినట్టు లేదా ఇది..? గుడ్ సిగ్నల్...
అక్కడ రోడ్లు లేవా..? కార్లు పోవా..? ఇదంతా పబ్లిసిటీ ప్రయాస అని కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… బహుశా ప్రతిదీ విమర్శించడం అలవాటైన బీఆర్ఎస్ క్యాంపు కావచ్చు… గతంలో కరోనా సమయంలో నడుస్తూ, డొంకల్లో పడి తిరుగుతూ, జనానికి నిత్యావసరాలు సప్లయ్ చేసిన ఫోటోలు కూడా అంతేనని ఓ విమర్శ…
- సరే, నిజమే అనుకుందాం… పబ్లిసిటీయే అనుకుందాం… మరి ఈ సోకాల్డ్ ఇతర నేతలు పబ్లిసిటీ కోసమైనా ఒక్కరోజు, కనీసం ఒక్కపూట అలా పర్యటించొచ్చుగా… అది చేతకాదు కానీ ఆమెను విమర్శిస్తారు…
ఇదే బీఆర్ఎస్ క్యాంపు, నమస్తే తెలంగాణ ఆమె ఆధ్వర్యంలో మేడారంలో సమ్మక్క- సారలమ్మ గద్దెల దగ్గర ఆదివాసీ సంస్కృతిని దెబ్బతీసే మాస్టర్ ప్లాన్ సన్నాహాలు సాగుతున్నాయని రాసుకొచ్చింది… సీతక్కపై ఆదివాసీలు మండిపడుతున్నారట…
ఈ నేపథ్యంలో ఆమే స్వయంగా అక్కడికి వెళ్లి.., ఎవరి మనోభావాలకు, సంస్కృతులకు విరుద్ధంగా ఏ ఆధునికీకరణ పనీ జరగదని స్వయంగా స్థానికులకు చెబుతోంది… బీఆర్ఎస్ దుష్ప్రచారాలకు సరైన విరుగుడు..!!
Share this Article