.
నిజానికి ఇది రాయాల్సిన సబ్జెక్టే కాదు. రాశామన్న తృప్తికోసం రాయాల్సిన మొక్కుబడి విషయం- అంతే.
పాపం! దీనికి హైదరాబాద్ లో మనముండే కాలనీ ఏమి చేయగలదు చెప్పండి? కాలనీ మెయిన్ రోడ్డంతా అటు ఇటు ఇళ్లు కూల్చి…కింది ఫ్లోర్లు షాపులు చేయాలా? అద్దెలకివ్వాలా? పైన ఇంటి ఓనర్ ఉండాలా? పదడుగుల ఒక్కో షాపు ముందు పది బైకులు పెట్టాలా?
Ads
ఒకటో అరో ఓనర్ పాతరాతి యుగపు నాటి ఏనాడూ వాడని కవర్ కప్పిన కారు పెట్టాలా? రోడ్డంతా ఇవన్నీ ఆక్రమించగా మిగిలిన సూది మొన మోపినంత సందులో మా బైకులు వెళ్ళాలా? మా ఆటోలు వెళ్లాలా? మా కార్లు వెళ్లాలా? మా స్కూల్ బస్సులు వెళ్లాలా? పార్కింగ్ చోటు లేకపోయినా కొన్న మా కార్లు పెట్టుకోవాలా?
ఎక్కడెక్కడివారో రౌడీఇజంతో మా ఇళ్లముందు ఏళ్లతరబడి పెట్టుకునే క్యాబ్ లు, పాత తుక్కు వాహనాలకు కొంత చోటివ్వాలా?
ఏదో… గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లే రోడ్డయితే అడ్డుగా ఉన్న వాహనాలను పోలీసులు ఎంత కష్టపడి అయినా ఎత్తి, తోసి, తీసేసి రోడ్డును క్షణాల్లో క్లియర్ చేస్తారు కానీ… మా కాలనీ రోడ్డు అలాంటిది కాదు కదా! ఆఫ్టరాల్ అర్భకులైన అత్యంత సామాన్యులు తిరిగే రోడ్డు.
కాలనీలో బాధ్యతగల భారతీయులందరూ బాధపడ్డం తప్ప చేయగలిగింది లేదు. ఒక బాధ్యతగల పెద్దాయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే-
“సార్! మీరు- చదువుకున్నవారు. సౌమ్యులు. ప్రభుత్వాలకు పన్నులు కట్టేవారు. వాళ్ళు- రౌడీలు, పన్నులు కట్టనివారు, చట్టాలను గౌరవించనివారు. ఇలా వారిమీద ఫిర్యాదు చేస్తే… మీకే ప్రమాదం కదా!” అని పెద్దాయన బాగుకోరి చదువుకున్న, చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీసు చక్కగా విడమరిచి చెప్పి వెళ్ళినప్పటినుండి పెద్దాయనకు రాత్రిళ్లు నిద్ర కరువయ్యిందట.
చట్టం ముందు అందరూ సమానులేనన్న భ్రమలు తొలగి ప్రశాంతత కోల్పోయి… శేషజీవితాన్ని పెద్దాయన దిగులు దిగులుగా గడుపుతున్నారట. “పదిహేను రోజులకు పైబడి మీ ఇంటి ముందు గుర్తు తెలియని వాహనాలను పార్క్ చేసి ఉంటే ఫిర్యాదు చేయండి” అన్న పోలీసు హెచ్చరిక పెద్దాయన చెవుల్లో మారు మోగుతూనే ఉంది.
మనకే అది “గుర్తు తెలియని వాహనం”. పెట్టినవాడికి “గుర్తు తెలిసిన వాహనమే”-అన్న విషయం పెద్దాయనకు ఎప్పటికి గుర్తొస్తుందో… పాపం!
కాలనీలో నడవబోతే మురుగు ప్రవాహం. బైకులు, కార్లలో వెళ్లబోతే పార్కింగ్ సమస్య. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక గంటలు గంటలు ఇరుక్కుపోతాం.
యాభై గజాల జాగాలో అయిదు ఫ్లోర్లు కట్టే ఒంటి స్తంభపు మేడల ద్వాపరయుగ నిర్మాణ శైలి మా కాలనీలో ఒక అద్భుతం. ఆశ్చర్యం. వీటి అనుమతుల గురించి మతులు లేనివారు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు.
ఇదికాక- తాతలు తాగిన నేతుల మూతుల వాసన గొప్పలు చెప్పుకునే మనం ఇంటి ముందు కుంటి కారును తుక్కుకు వేస్తామా ఏమిటి? చక్కగా రోడ్డును అడ్డగిస్తూ ఇంటి ముందు పనికిరాని కారు, ఇంటి షెడ్డులో పనికిరాని కారు ఉంటే… ఖాళీ జాగా కనపడితే అక్కడ కదలని కార్లను పెట్టుకుంటే… వచ్చే తృప్తి, కారుందన్న అప్రతిహతమయిన గర్వం, ఆనందం తుక్కుకు వేస్తే వస్తాయా? చచ్చిన మనిషిని శవమని వెంటనే శ్మశానానికి పంపి స్నానాలు చేస్తాము కానీ… చచ్చిన కారును చచ్చినా తుక్కుకు వేయం!
ఇవన్నీ కలగలిపి మా కాలనీలో రాంగ్ పార్కింగే రైట్!
రైట్ పార్కింగ్ అన్నది మా కాలనీ నిఘంటువులో లేనే లేదు!!
అన్నట్లు-
మిజోరాం రాజధాని ఐజోల్ (మొన్నటివరకు ఐజ్వాల్ అనేవారు) దేశంలో వాహనాల శబ్ద కాలుష్యం లేని, పోలీసులున్నా లేకున్నా ఎవరికివారు విధిగా, బాధ్యతగా, క్రమశిక్షణగా ట్రాఫిక్ నిబంధనలను పాటించే “సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా”గా పేరు తెచ్చుకుంది. ట్రాఫిక్ సిగ్నల్సే లేకపోవడం ఈ ఊరి విశేషం.
మొన్నటిదాకా విమానం తప్ప సరైన రోడ్డు రవాణా వ్యవస్థలేని ఐజోల్ కు ఇప్పుడు రైలుమార్గం తోడయ్యింది. కొండాకోనల మధ్య ఎత్తుపల్లాల ఊరు. మలుపులు తిరిగే చిన్న రోడ్లు. అలాంటి చోట్ల మనలా త్రేతాయుగంలో రాముడు అడవికి వెళ్ళే ముందు అయోధ్యలో బాధతో ఇంటిముందు నడి రోడ్డు మీద ప్రజాసమూహం కార్లను పార్క్ చేసి కలియుగం అయిపోతున్నా… అంగుళం కూడా పక్కకు జరపనట్లు ఇలాగే వదిలేస్తే…ఐ జోల్ లో అడుగు తీసి అడుగు వేయడమే కష్టమయ్యేది.
ఏమిటి? ఐజోల్ అసలు హారన్ కొట్టదా?
హేమిటి? ఐజోల్ అసలు రాంగ్ రూట్లో వెళ్ళదా? రాంగ్ పార్కింగ్ చేయదా? హ్హేమిటి? ఐజోల్ తనకు తాను గీతగీసుకుని… ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తుందా?
మన కాలనీని ఒకసారి ఐజోల్ కు తీసుకెళ్ళిరావడానికి ఎంత ఖర్చవుతుందో? లేదా ఐజోల్ ను ఒకసారి మన మహానగరం ట్రాఫిక్ మధ్యలోకి తీసుకొస్తే!
పాపం- వాళ్ళనెందుకు చెడపడం? మనం చెడింది చాలు!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article