.
చిలుకూరు బాలాజీ టెంపుల్… పొద్దున్నే… వందల మంది ఎప్పటిలాగే సీరియస్‌గా ప్రదక్షిణలు చేస్తున్నారు… రంగరాజన్ హఠాత్తుగా అందరినీ ఆగి, తన దగ్గరకు రమ్మన్నాడు…
మైకు తీసుకుని… ‘ఇది పితృపక్షంలోని ఏకాదశి… విశేషమైనది ఎందరికి తెలుసు’ అనడిగాడు… చేతులెత్తండీ అన్నాడు… ఎవరూ ఎత్తలేదు… అవును, ఇది విశేషమైన రోజని ఓ కామన్ భక్తుడిని ఏం తెలుసు..? భగవద్గీతలోని ఓ శ్లోకం రెండుసార్లు అందరితోనూ చదివించాడు… అర్థం చెప్పాడు… తెలుగులో, ఇంగ్లిషులో, హిందీలో…
Ads
తరువాత ‘వాట్సప్ చూస్తూ ప్రదక్షణలు చేస్తున్నారు కొందరు, అందుకే మొబైల్ ఫోన్ లోపలకు తీసుకురావద్దంటాం… తన్ మన్ భగవంతుడిపైనే నిమగ్నం చేసి ప్రదక్షిణలు చేయండి, లేకపోతే లాభం లేదు’ అన్నాడు… ఇక్కడివరకూ బాగానే ఉంది…
హఠాత్తుగా గరికపాటి ప్రదక్షిణల ప్రవచనం గుర్తొచ్చింది ఎందుకో… ‘‘నువ్వెన్ని ప్రదక్షిణలు చేస్తావో దేవుడు గుర్తుపెట్టుకోడు, లెక్కపెట్టడు… ఇదేమీ మార్నింగ్ వాక్ కాదు… మనసంతా ఎన్ని ప్రదక్షిణలు పూర్తయ్యాయనే లెక్కపైనే ఉంటుంది… ఇక దేవుడిపై దృష్టి ఏముంటుంది..? పుణ్యమేముంటుంది..? అందుకని మూడు ప్రదక్షిణలు చేయండి’’ అని చెప్పినట్టు గుర్తు…
ఆ వీడియో చూసినప్పుడే అరుణాచలం గిరిప్రదక్షిణలు, చిలుకూరు వీసా ప్రదక్షిణలు గుర్తొచ్చాయి… అది భక్తుల నమ్మకం కదా, ఈయనెందుకు ప్రదక్షిణల్ని వ్యతిరేకించడం అనిపించింది… అంతేకాదు, మాకు దగ్గరలోని నిమిషాంబిక గుడిలో ప్రదక్షిణలూ పాపులరయ్యాయి ఈమధ్య… కానీ రంగరాజన్ చెప్పిందీ, గరికపాటి చెప్పిందీ నిజమే… ప్రదక్షిణల్లో సిన్సియారిటీ ఉండాలి…
పదేళ్ల క్రితం వెళ్లినట్టు గుర్తు… అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు… ట్రంపు మనసు మార్చలేకపోతున్నాయా వీసా ప్రదక్షిణలు…? వీసా రిజెక్షన్లు పెరుగుతున్నాయి కదా… కానీ చాలామంది తమ చదువులు, వీసాల కోసమే వస్తున్నా సరే, ఇప్పుడు రకరకాల కోరికల ప్రదక్షిణకారులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు… ఇదుగో పైన చూపిన 108 అంకెల ఓ టేబుల్ చేత్తో పట్టుకుని, లెక్క తప్పకుండా పెన్నుతో టిక్కులు పెట్టుకుని, గడులు నింపుతూ గబగబా తిరుగుతున్నారు…
వేలాది మంది పోటెత్తుతూ ఉండటంతో ప్రదక్షిణల సిస్టం మార్చారు… పబ్లిక్ హాలీడేస్, వీకెండ్స్‌లో మహాప్రదక్షిణం చేసుకొండి అని చెబుతున్నారు, గుళ్లో గాకుండా గుడి ఆవరణ చుట్టూ… కోరిక కోసం ఒకటి, కోరిక తీరితే 11 అట లెక్క… ప్రదక్షిణలకు టైమింగ్స్ కూడా పెట్టారు… అసలు ఆ గుడి విశేషమే ప్రదక్షిణలు కదా…
ఇవేవీ తెలియనట్టుంది ది వాల్ స్ట్రీట్ జర్నల్ వాడికి… ఇంకా వీసా దేవుడే అన్నట్టు రాసుకొచ్చాడు… సరే, అమెరికా మీడియా కూడా చిలుకూరు బాలాజీని గుర్తించి స్పెషల్ ఆర్టికల్ రాయడం బాగుంది… కానీ దేవాదాయ శాఖ పెత్తనం కిందకు పోకుండా ఆ గుడిని వంశపారంపర్య ధర్మకర్తలు ఎలా కాపాడుకున్నారో సక్సెస్ స్టోరీ రాస్తే బాగుండేది…
మనకు ప్రతి గుళ్లలో కనిపించే ఆర్జిత సేవలు, పెయిడ్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, నానా రకాల పెయిడ్ పూజలు, హుండీలు గట్రా ఏమీ లేకుండా దేవుడి ప్యూరిటీని కాపాడుకున్న తీరును కూడా రాస్తే బాగుండేది అనిపించింది… (నిన్నో మొన్నో వచ్చింది ఈ ఆర్టికల్)…
ఐతే అక్కడ పార్కింగ్ వసూళ్లు (ఓన్లీ క్యాష్ అట, ఎందుకో…) వందల దుకాణాలు, అడ్డగోలు రేట్లు… అసలు గుడి మెయింటెనెన్స్ ఖర్చు ఎలా సర్దుబాటు అవుతుందో తెలియదు గానీ… ఇప్పటికీ చిలుకూరు బాలాజీ ఓ సామాన్య భక్తుడి దేవుడే… మూడు ప్రదక్షిణలు చేస్తుంటే… వందల కోట్లు ఖర్చుపెట్టి యాదగిరిగుట్ట దేవుడిని కేసీయార్ సామాన్య భక్తులకు దూరం చేసిన వైనమూ గుర్తొచ్చి కలుక్కుమంది…
చిలుకూరులో భక్తుల రద్దీ ఎంత పెరుగుతున్నా సరే… అప్పుడూ అదే గుడి, ఇప్పుడూ అదే గుడి… ఎండోమెంట్స్ తాలూకు దోపిడీలు లేవు, ఏ పటాటోపాలూ లేవు… సింపుల్ దేవుడు… ఆమధ్య వాడెవడో ధర్మప్రచారం కోసం డబ్బులు అడుగుతూ బెదిరించి, దాడికి ప్రయత్నించాడు కదా రంగరాజన్‌ను… ఆయన్ని వీవీఐపీలు వెళ్లి పరామర్శించిన అరుగు చూస్తే అదీ గుర్తొచ్చింది…
పుష్కరిణి దురవస్థ గురించి ఆలయ యాజమాన్యం సీరియస్‌గా ఆలోచించాలి… దాన్ని పఢావు పెట్టారు… ఆమధ్య రంగరాజన్ నిర్వహించిన మునివాహన సేవ గుర్తొచ్చి, 2700 ఏళ్ల నాటి ఓ సత్సంప్రదాయాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చినందుకు అభినందించాలనీ అనిపించింది కానీ… కొన్నాళ్ల క్రితం గరుడ ప్రసాదం పేరిట తలపెట్టిన వివాహ ప్రాప్తి తంతు (ఫర్టిలిటీ ప్రసాదం) నచ్చలేదు…
సంతానభాగ్యం కోసం ఏం చేయమన్నా చేస్తారు కదా నిస్సంతులు… వాళ్ల బలహీనత… లక్షన్నర మందిదాకా పోటెత్తేసరికి చేతులెత్తేశారు… చివరకు ఆ కార్యక్రమం రద్దు చేయాల్సి వచ్చింది… (యాదగిరిగుట్టలోనూ పైన పుష్కరిణిలో జంటల స్నానాలకు వివాహ ప్రాప్తి ప్యాకేజీలు గుర్తొచ్చాయి)…
సరే, స్వామి ట్రంపు మనసు మార్చి, కాస్త వీసాల పట్ల కరుణ చూపించేలా చేస్తే వోకే గానీ… దేవాదాయ శాఖ దుష్టచూపుల నుంచి ఈరోజుకూ తప్పించుకుంటున్న గుడిని చూస్తుంటే మాత్రం ముచ్చటేసింది..! అన్ని గుళ్లకూ ఈ భాగ్యం దక్కే రోజులు వస్తే బాగుండు అని మొక్కుకుని బయటపడ్డాను… ఒకప్పుడు ఏమీ లేని ఆ ఏరియాలో ఇప్పుడు రిసార్టులు, ఫామ్ హౌజులు, ఫంక్షన్ హాళ్లు, ఫుడ్ కోర్టులు… అది మరోసారి చెప్పుకుందాం…
Share this Article