.
మహాభారతంలో ఓ చిక్కుప్రశ్న వేస్తుంది ద్రౌపది వస్త్రాపహరణం ఎపిసోడ్‌లో… ‘ధర్మరాజు నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..?’ భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్ద తలకాయలూ సమాధానం చెప్పలేక తలలు దించుకుంటారు…
నిన్నటి మావోయిస్టు ప్రకటన చదివితే ఆ భారత ప్రశ్నే గుర్తుకొస్తుంది… ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే ఆయుధాలు వదిలేయడానికి సిద్ధం అని మావోయిస్టుల ప్రకటన అది… ఆయుధాలు వదిలేస్తే ఇక ఆపరేషన్ కగార్ అవసరం ఏముంది..,? అలాగే ఆపరేషన్ కగార్ ఆపేస్తే ఇక ఆయుధాలు వదలడం దేనికి..?
Ads
సరే, ఎవరికి తోచిన బాష్యం వాళ్లు చెప్పుకోవచ్చు గానీ… ఈ ప్రకటనకు మావోయిస్టు పోరాటచరిత్రలోనే విశేష విలువ ఉంది… స్థూలంగా ఆలోచిస్తే మావోయిస్టులు రిట్రీట్ ప్రకటిస్తున్నారా..,? రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామనే వాక్యాలు మరింత లోతైన చర్చకు ఆస్కారమిస్తున్నయ్… తాత్కాలిక యుద్ధవిరమణా..? లేక పూర్తి పోరాట విరమణా..?
అంటే ఆయుధ సన్యాసం తరువాత రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా ఇతర లెఫ్ట్ పార్టీల్లాగా..? మరి పదిరోజుల క్రితమే ఆపరేషన్ కగార్‌ను ఎదుర్కుందామని సెంట్రల్ కమిటీ ప్రకటించింది, అప్పుడే మళ్లీ ఇదేమిటి..? మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఫోటో ఉండటం కూడా అసాధారణంగా ఉంది…
నెల రోజుల సమయం ఇచ్చి, కాల్పులు విరమిస్తే… వివిధ స్థాయిల కేడర్‌తో చర్చించి, ప్రతినిధి బృందాన్ని కూడా పంపిస్తామని మావోయిస్టులు సంసిద్ధత వ్యక్తపరిచారు… అందుకని ఆ లేఖ అసలా..? నకిలీయా..? అనే ప్రశ్నల్ని లేవనెత్తుతోంది… ఆ క్లారిటీ కూడా మావోయిస్టుల నుంచే రావాలి ఇక… సరే, ఆ లేఖ నిజమే అనుకుందాం… కానీ ఈ అసహాయ స్థితి ఎందుకొచ్చింది..?
రిక్రూట్‌మెంట్ లేదు.., యువత త్యాగాలకు, పోరాటాలకు సిద్ధంగా లేదు… ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం… పైగా మావోయిస్టు కీలక నేతల వయోభారాలు, అనారోగ్యాలు… రాజ్యం ఇన్‌ఫార్మర్లు, కోవర్టులను విపరీతంగా ప్రోత్సహిస్తోంది… స్థానికులతో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి దాడులు చేస్తోంది… పెద్ద పెద్ద నేతలు, చివరకు సెంట్రల్ కమిటీ నేతలు కూడా దొరికిపోతున్నారు… కొందరు బహిరంగ జీవితంలోకి వచ్చేస్తున్నారు… నక్సల్స్ సురక్షిత అడ్డాలు అనుకున్న ప్రాంతాల్లోకి కూడా కేంద్ర బలగాలు జొరబడుతున్నాయి…
కాల్పుల విరమణ దిశలో ప్రజాసంఘాలు, మేధావులు, జర్నలిస్టులతో ప్రభుత్వాలపై కొంత ఒత్తిడి క్రియేట్ చేయాలని ప్రయత్నించినా కేంద్ర కఠిన వైఖరితో అవి సక్సెస్ కాలేదు… నక్సలైట్లపై గరిష్ట స్థాయిలో పట్టు సాధించాక ఈ దశలో మావోయిస్టులు బ్రీత్ టేకింగ్ కోసం కాల్పుల విరమణ ప్రతిపాదనలు చేస్తున్నారనీ, ఈ దశలో మరింత అణిచివేతతో మొత్తంగా నక్సలైట్ల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రం ఆలోచన…
ఈ స్థితిలో మావోయిస్టుల ఆయుధవిరమణ ప్రకటనకు విశేష ప్రాధాన్యం ఉంది… నిజంగానే ఇది రిట్రీట్ ప్రకటనా..? అదే నిజమైతే కేంద్రం సానుకూలంగా స్పందించి, అందరిపైనా ఉన్న అన్ని కేసులు ఉపసంహరించుకుంటుందా..? ఆ కేంద్ర ప్రకటన గనుక వచ్చి, నిజంగానే నక్సల్స్ ఆయుధసన్యాసం గనుక జరిగితే దేశవ్యాప్తంగా కణకణమండిన నక్సలైట్ల సాయుధపోరాట చరిత్రకు శుభం కార్డు పడినట్టే…!!
Share this Article