.
8 సార్లు ఒలింపిక్ విజేత పరుగులో… తన రికార్డుల దరిదాపుల్లోకి వెళ్లేవారే లేరు… ప్రపంచంలోకెల్లా వేగంగా పరుగెత్తే చిరుత తను… కానీ ఇప్పుడు పరుగు తీస్తే ఎగశ్వాస, మెట్లెక్కితే ఆయాసం… ఏమిటిలా..? ఎవరతను..?
.
Ads
(రమణ కొంటికర్ల) …. ఎంత పరిగెత్తి పాలు తాగేవారైనా.. ఒక దశకు చేరుకున్నాక నిల్చుండి నీళ్లు తాగాల్సిందే. ఎందుకీ మాటా అంటే.. ఒకప్పుడు వేగానికి మారుపేరు.. వడివడిగా పరిగెత్తే చిరుతకూ అసూయ పుట్టించిన దూకుడు.. వాయువేగానికి పర్యాయపదంగా కనిపించిన నమూనా.. జమైకా డైనమైట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కథ అందుకో ఉదాహరణ కనుక!
కొద్దికాలం క్రితం భూమిపైనే అత్యంత వేగంగా పరిగెత్తగల్గిన మనిషిగా ఉసేన్ బోల్ట్ కు పేరు. అలాంటి ఉసేన్ బోల్ట్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా.. తన ముగ్గురు పిల్లలతో శేషజీవితాన్ని గడిపేస్తున్నాడు. హాయిగా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నాడు.
2017లో తాను అథ్లెటిక్స్ నుంచి విరమణ ప్రకటించాక.. ఫ్యామిలీ లైఫ్ కే అంకితమైపోయాడు. అయితే, ఇప్పుడా ఉసేన్ బోల్ట్ మెట్లెక్కితే కూడా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండమే జీవన వైచిత్రి!
పిల్లలు.. వారిని స్కూల్ పంపించడం.. వారిని స్కూల్ కు పంపేందుకు సమయానికి తాను లేవడం.. వారిని లేపడం.. సమయముంటే కాసింత వ్యాయామం చేయడం.. పిల్లలు వెళ్లపోయాక సినిమాలు చూడటం.. మళ్లీ వాళ్లు వచ్చాక వారితో గడపడం.. వారు కొంత చికాకు తెప్పించినప్పుడు మళ్లీ సినిమాలు చూడటం.. లేదా, ఎలక్ట్రానిక్ టాయ్స్ తో ఆడుకోవడం.. ఇదిగో ఇలా నడుస్తోందట ఉసేన్ బోల్ట్ లైఫ్.
1986 ఆగస్ట్ 21న జన్మించిన బోల్ట్ వయస్సు ఇప్పుడు కేవలం 39 ఏళ్లే. ఇప్పటికీ జిమ్ లో అప్పుడప్పుడూ వెళ్తూ వ్యాయామం చేస్తూనే ఉన్నా.. కొన్నిసార్లు మెట్లెక్కడం కూడా సవాల్ గా మారుతోందంటున్నాడు ఈ అథ్లెట్. తను వారంలో మూడునాల్గు రోజులు జిమ్ చేస్తున్నప్పటికీ.. తను నడుస్తుంటే దమ్ము రావడం, మెట్లెక్కడం సవాల్ గా మారతోందంటే.. నేనిప్పుడు వాకింగ్, జాగింగ్ చేయాల్సిన అవసరముందంటున్నాడు బోల్ట్.
పరుగు ఆపేస్తే ఏం జరుగుతుంది..?
ఫిట్నెస్ కోసం క్రమం తప్పకుండా పరిగెత్తేవారికి ఎన్నో శారీరక ప్రయోజనాలుంటాయి. పరుగు కేలరీస్ ని బర్న్ చేస్తుంది. గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంది. ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. వీటన్నింటితో పాటు.. మానసిక ఉల్లాసాన్నీ అందిస్తుంది.
పరుగును ఉన్నపళంగా మొత్తంగా ఆపేస్తే ఆ పరిణామం శరీరంలో కొత్త మార్పులకు కారణమవుతుంది. అప్పటివరకూ ఏ పరుగైతే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచిందో.. ఏ పరుగైతే మీ కండరాలను బలపర్చిందో.. అదే పరుగు ఆపేసినప్పుడు ఫిట్నెస్ స్థాయిపై అది అనూహ్యమైన ప్రభావం చూపుతుంది.
తక్కువ ఆక్సిజన్ తో కూడిన రక్తప్రసరణ జరుగుతుంది. కొన్నేళ్లపాటు నుంచి జాగింగో, వాకింగో చేస్తున్నవారు అనూహ్యంగా ఓ వారమో, పదిహేను రోజులో ఆపేస్తే జరిగే పరిణామాలను గమనించినప్పుడు ఆ తేడా స్పష్టంగా గమనించొచ్చంటాడు బోల్ట్.
చాలాకాలంపాటు పరుగెత్తి పరుగెత్తి ఒక్కసారి ఆపేస్తే ఆ తర్వాత శరీరం తుప్పుపట్టిన అనుభూతిని పొందుతుందనేందుకు ఇప్పుడు బోల్ట్ కథే ఓ ఉదాహరణ.
అయితే జాగింగ్ చేయలేక అలసిపోయేవారు.. వారి వ్యాయామాన్ని మార్చుకుని వాకింగ్ కు పరిమితం కావాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. దాంతోపాటు, సైక్లింగ్, ఈత వంటివి కూడా ఉపయోగపడుతాయంటున్నారు. అలా జాగింగ్ చేయలేక మానేశాక దుష్ఫలితాలు పొందుతున్నవారు తమ ఫిట్నెస్ ను పెంచుకునే మరిన్ని అవకాశాలను సూచిస్తున్నారు.
వార్మప్స్ మేలంటున్న నిపుణులు!
కండరాలు సులభంగా కదిలేందుకు ముందు వార్మప్స్ చేయడం మంచిదన్నది నిపుణులు చెప్పే మాట. దాంతో పరుగు పెట్టాలనుకునేవారికి, మన గుండెస్పందనను అందుకనుగుణంగా పెంచాలనుకునేవారికి, కండరాలను ఉత్తేజపర్చేందుకు ఐదు నుంచి పది నిమిషాల పాటు వార్మప్ ఎంతో ఉపయుక్తమైందన్నది నిపుణులు చెప్పే మాట.
అలా నిత్యం కాస్త సమయాన్ని పెంచుకుంటూ.. వ్యాయామాన్ని చేయడం వల్ల శారీరక, మానసిక ఉత్సాహాన్ని పొందగలమంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఇప్పుడు 8 సార్లు ఒలింపిక్స్ విజేతైన ఉసేన్ బోల్ట్ జీవితమే ఓ ఉదాహరణ. ఈ విషయాలన్నీ ఈ మధ్య ది గార్డియన్ పత్రికతో ఉసేన్ బోల్ట్ పంచుకున్న తర్వాత.. ప్రస్తుతం వ్యాయామంపై చాలామంది దృష్టిసారిస్తున్న క్రమంలో జరుగుతున్న ఓ చర్చ ఇది…
Share this Article