.
మంచి పాటలు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ కొన్ని వస్తున్నాయి… అంటే కాస్త పాత్రోచిత, సందర్భోచిత, సాహిత్య విలువలు అరకొరగా అయినా సరే ఉండేవి… కానీ గతమ్ము మేలు వర్తమానముకన్నన్ అన్నట్టుగా… పాత సినిమా గీతాల రచయితలు ఆయా పాత్రల్ని, సందర్భాల్ని ఎలివేట్ చేస్తూనే కాస్త సాహిత్యపు వాసనలకు ప్రయత్నించేవాళ్లు…
గుద్దుతా నీయవ్వ గుద్దుతా వంటి పాటలు అప్పుడూ ఉన్నయ్… జామచెట్లకు కాస్తాయి జామకాయలు వంటి అర్ధరహిత ప్రేలాపనలు ఇప్పుడూ ఉన్నయ్… ఇదెందుకు గుర్తొచ్చిందంటే..? అనుకోకుండా యూట్యూబ్‌లో కనిపించిన ‘మనసా కవ్వించకే నన్నిలా’ పాట వింటుంటే…
Ads
మైలవరపు గోపి పదరచన, కోదండపాణి స్వరరచన… సుశీల పాడిన పాట అది… అందులో జమున పాత్ర ఆత్మఘర్షణను, మథనాన్ని సరిగ్గా ఆవిష్కరించేలా…
నేనోడిపోయి గెలుపొందినాను
నేనోడిపోయి గెలిపొందినాను
గెలిచానని నవ్వనా…. ఏడ్వనా…
నా జీవితం శాపమా పాపమా…
గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే…
ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం
ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం
ఏనాటికైనా అవి చేరువౌన…
కెరటానికి నింగికి స్నేహమా….
…. అంటూ తీవ్ర భావఘర్షణకు లోనవుతుంది ఆ పాత్ర… ఆ కేరక్టరైజేషనే అది… ఆభిజాత్యం, సౌందర్యం, పౌరుషం, ఒంటరితనం, తల్లి ప్రేమ, భంగపాటు, ప్రతీకారం వంటి అనేక ఉద్వేగాలు కలబోసిన పాత్ర… గెలిచిందో ఓడిందో తనకే తెలియని అనుభవాలు, పరిణామాలు…
ఆ పాత్రను ఆవాహన చేసుకుని రాసినట్టుగా సాగుతుంది పాట… ఇదే కాదు, సినిమాలో ఇదుగో దేవుడు చేసిన బొమ్మ, ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు, ఏమమ్మా జగడాల వదినమ్మా, బాబూ వినరా అన్నాదమ్ముల కథ ఒకటి… ప్రతి పాటా సూపర్ హిట్ అప్పట్లో… ఘంటశాల, ఎస్పీ బాలుతోపాటు కోదండపాణి కూడా గాయకులు… దాశరథి మూడు పాటలు రాశాడు…
కృష్ణ సమర్పణలో ప్రభాకరరెడ్డి తీసిన కృష్ణ తొలి స్వర్ణోత్సవ సినిమా… కృష్ణను ఫీల్డులో బలంగా నిలబెట్టిన సినిమా… నిజంగా సినిమా కథాకాకరకాయ వదిలేస్తే… కధే ప్రధానం, ఎంతటి భారీ తారాగణం అయినా సరే కథకు తగ్గట్టు ఒదిగిపోవాలే తప్ప… ఇమేజ్ బిల్డప్పుల కోసం కథను ఖూనీ చేయకూడదని భావించిన బంగారు రోజులు అవి…
ఎస్వీ రంగారావు, జమున, కృష్ణ, విజయనిర్మల, అంజలీ దేవి, సరోజాదేవి, ప్రభాకరరెడ్డి, గుమ్మడి, పండరీబాయితోపాటు అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్న సుజాత అలియాస్ తరువాత రోజుల్లో జయసుధ కూడా… ఇప్పటి కేరక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నరేష్ కూడా..!
సినిమాలో ప్రధాన పాత్రలు ఎస్వీ రంగారావు, జమున… సినిమా మొత్తం వాళ్లే… నువ్వానేనా అన్నట్టు పోటాపోటీ నటన… హీరోహీరోయిన్లు సహా మిగతా పాత్రలన్నీ వస్తూ పోతూ ఉంటాయి… నిజానికి నటశ్రీ ఎస్వీ రంగారావుతో ఢీకొట్టే పాత్ర (రాణి మాలినీదేవి) కాబట్టి ఆ రేంజ్ నటి భానుమతి రామకృష్ణను తీసుకోవాలని అనుకున్నారు… కానీ ఆమె డేట్లు కుదరక, జమునను తీసుకొచ్చారు… భానుమతికి ఏమాత్రం తీసిపోకుండా జమున అదరగొట్టేసింది… ఇండస్ట్రీ చప్పట్లు కొట్టింది, ఆ భానుమతితో సహా…
అప్పట్లో తారల నడుమ పెద్దగా ఆభిజాత్య పోరాటాలు తక్కువే… జమున అంత ప్రముఖమైన పాత్రలో సినిమా మొత్తం కనిపిస్తుంటే… అప్పట్లో అగ్రతార, గ్లామర్ క్వీన్ సరోజాదేవి తను మాత్రం కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది…
సినిమా స్క్రిప్ట్ వర్క్ జరిగే సమయంలో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా ‘ది విజిట్’ లో ప్రధాన కీలకమైన కార్యెక్టర్ ‘కర్లా జనేషియన్’ పోషించిన హీరోయిన్ ‘ఇన్గ్రిడ్ బర్గమెన్’ స్ఫూర్తితో తీర్చిదిద్దారు రాణి మాలినీదేవి పాత్ర… అప్పట్లో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన పాత్ర, సినిమా అది…!!
Share this Article