Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోడ్ల గుంతలా మజాకా… పెద్ద పెద్ద కంపెనీల్నే తరిమేస్తున్నయ్…

September 19, 2025 by M S R

.

మనం రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. “పన్నుమీద పన్నున్నవారు ఇంటిమీద ఇల్లు కడతారు” అని సామెత కూడా ఉంది. ఈ సామెతలో నిజమెంతో కానీ…ఇంటిమీద ఇల్లు కట్టిన ప్రతివాడూ ప్రభుత్వానికి పన్ను మీద పన్ను కట్టడం మాత్రం నిజం.

పన్నులో అంతర్భాగంగా ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ లాంటి సమసమాజ నిర్మాణానికి అవసరమైన ఎన్నెన్నో ఉప పన్నులు జత అయి ఉంటాయి. చెవిలో జోరీగ; చెప్పులో ముల్లు; కంటిలో నలుసు, ఇంటిలో పోరు ఇంతింత కాదయా! అని వేమన బాధపడ్డాడు కానీ… పంటికింద రాయిలాంటి పన్నుపోటు గురించి ఎందుకో పట్టించుకోలేదు.

Ads

ఇప్పటి వ్యవహారాలు అప్పుడు ఉండి ఉంటే పన్నుపోటును కూడా ఇదే పద్యంలో కలిపి ఉండేవాడు. లేదా పన్నుపోటును కుళ్ళబొడుస్తూ లెక్కలేనన్ని ఆటవెలదులు రాసేవాడు. అయినా మన గొడవ పన్నుపోటు గురించి కాదు. ఆ పన్నులతో ప్రభుత్వాలు కనీసం గుంతల్లేని రోడ్లయినా మనకు వేసిపెట్టాల్సిన బాధ్యత గురించి. ఆపన్నులమైన మన గుండెలో గుంతలను పూడ్చేదెవరు? చింతలను తీర్చేదెవరు?

జాతీయ రహదారులు నాలుగు వరుసలతో, ఆరు వరుసలతో చూడ్డానికి అందంగా, ప్రయాణానికి అనువుగా ఉంటాయి కానీ…టోల్ గేట్ల ద్వారా వాటి నిర్మాణానికి కొన్ని తరాలపాటు మన జేబుల్లోనుండి వడ్డీలు, చక్ర వడ్డీలు, లాభాలతో పాటు వసూలు చేసే లోగుట్లు, పెట్టుబడి రాబట్టినా కొనసాగే టోల్ గేట్ల దోపిడీలు తెలుసుకుంటే మన భవిష్యత్తు కూడా ముందే జాతీయీకరణ అయిన విషాదం తెలిసివస్తుంది. అందుకే మెడకాయమీద తలకాయ ఉన్నవారెవరూ ఆ లెక్కలు తెలుసుకోరు.

ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్లు స్థానిక ప్రజాప్రతినిధుల శక్తిసామర్థ్యాలను బట్టి ఉంటాయి. చాలా పంచాయతీల్లో తమ పరువు కాపాడుకోవడానికి సర్పంచ్ లు చేతినుండి ఖర్చు పెట్టుకుని సిమెంటు రోడ్లు వేసి…ఆ బిల్లులు ఏళ్ళు గడిచినా రాక నిరసన దీక్షలు, ర్యాలీలు చేస్తూ ఉంటారు.

చేతినుండి ఖర్చు పెట్టుకునే స్థోమత లేనివారు ప్రభుత్వానికి అర్జీ కాగితాలు ఇస్తూ ఉంటారు. మరీ గుంతలు పాతాళం అంచులు తాకుతూ ఉంటే పక్కన మట్టి తవ్వి… పూడుస్తూ ఉంటారు. నాలుగు చినుకులు పడగానే ఆ మట్టి బురదగా ప్రవహించి… గుంత ఎప్పటిలాగే గుడ్లప్పగించి బయటపడుతూ ఉంటుంది.

వేసిన తారు రోడ్లు వేసవి రాగానే ఎండ వేడికి కరిగి కన్నీరు కార్చినా గుంతలే తేలుతాయి. వర్షాకాలంలో నీటి నిలువకు, కోతకు గురైనా గుంతలే తేలుతాయి. రుతువు ఏదైనా గుంతలు కామన్. ఆ గుంతల రోడ్లమీద బైకులు, కార్లు, బస్సులు తమ మానాన తాము వెళుతూ ఉంటాయి.

వాహనాలమీద, లోపల ఉన్నవారికి వెన్నెముకలు విరుగుతూ ఉంటాయి. చీకట్లో, వెలుగులో గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గంట ప్రయాణం గతుకుల రోడ్డుమీద మూడు గంటలు దాటినా పూర్తవ్వదు. ఈలోపు పాడయ్యే వాహనాల రిపేరీ ఖర్చు, విరిగిన ఎముకలకు అతుకులు పెట్టుకునే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి.

రోడ్లమీద గుంతలు పడగానే ఆటోమేటిగ్గా రోడ్డే ఆ గుంతను పూడ్చుకునే సాంకేతిక వెసులుబాటు ఉంటే ఈ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది కదా! అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. మొదట వినడానికి ఈ ఐడియా తమాషాగా ఉన్నా…అనేక పదార్థాల మిశ్రమాలతో ప్రయోగాలు చేయగా…చేయగా…చివరికి అద్భుతం జరిగింది. “సెల్ఫ్ హీలింగ్ తారు” తయారయ్యింది. ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చక్కటి ఫలితాలు వచ్చాయి.

bt

కృత్రిమ మేధ సహకారంతో బయోమాస్ వ్యర్థాలు, మొక్కలనుండి సంగ్రహించిన సూక్ష్మ బీజాలతో ఈ వినూత్న పదార్థాన్ని లండన్ కింగ్స్ కాలేజీ, స్వాన్సీ యూనివర్సిటీ, చిలీ శాస్త్రవేత్తలు కలిసి ఆవిష్కరించారు. దీనితో ఖర్చు తక్కువ- ఫలితాలు ఎక్కువ అని తేలింది.

బాబ్బాబూ!
అర్జెంటుగా మెట్రిక్ టన్నులకు టన్నుల సెల్ఫ్ హీలింగ్ తారు తయారు చేసి… లండన్ నుండి కార్గో షిప్ కంటెయినర్లలో క్షణం ఆలస్యం చేయకుండా… ఇండియాకు ఎగుమతి చేయగలరు! ఇక్కడ మేము, మా ప్రభుత్వాలు గుంతల్లో కూరుకుపోయి… బయటికి రాలేకపోతున్నాము. గుంతల రోడ్లమీద తిరగలేక చస్తున్నాము. గుంతలు పోయే రోజులకోసం గుంతలు పడ్డ కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము!

గుంతల్లో భారత సిలికాన్ వ్యాలీ

భారత సిలికాన్ వ్యాలీగా, స్టార్ట్ అప్ ల స్వర్గధామంగా పేరుపొందిన బెంగళూరులో రోడ్ల గుంతలవల్ల జరుగుతున్న నష్టం విలువ ఏటా అక్షరాలా ఇరవై వేల కోట్ల రూపాయలేనట! అరగంట ప్రయాణానికి రెండు గంటలు పడుతోందట!

bt

వర్షాకాలంలో కార్ల కంటే పడవలు, లైఫ్ బోట్లలో వెళ్ళడమే ఉత్తమమట! గుంతల్లో పడి చస్తున్నామని చిన్నా పెద్దా ఎంతగా ఏడుస్తున్నా బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ- బి డి ఏ నిమ్మకు నీరెత్తినట్లు మొద్దు నిద్రపోతూ…గుంతకళ్ళు తెరిచి కనీసం చూడడం లేదట! దాంతో విసిగి వేసారిన కంపెనీలు మాకొద్దు ఈ బెంగళూరు- ఇంకెక్కడికైనా పోతాం అని బహిరంగంగా చెబుతున్నాయి.

అయితే మా దగ్గరికి రండి అని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగంగానే ఆహ్వానిస్తున్నాయి. ఇప్పుడు జాతీయ మీడియాలో బెంగళూరు గుంతలు- ఊరొదిలి వెళ్ళిపోతామంటున్న కంపెనీల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జరగాలి కూడా.

గుంత సర్వాంతర్యామి!

ఇది ఒక్క బెంగళూరుకే పరిమితం కాదు. దేశమంతా ఇంతే. కరీంనగర్ మెయిన్ రోడ్లో గుంతలతో నరకంలా ఉంది- నెత్తిన హెల్మెట్ లేకపోతేనే మా నెత్తిన ఇన్నిన్ని ఫైన్లు వేశారు కదా! మరి ఇన్నిన్ని గుంతల రోడ్లతో మా ఎముకలు విరిగిపోతుంటే బాధ్యత తీసుకోరా? అని ఒక సామాన్యుడు ఆ గుంతలమధ్య కూర్చుని నిరసన తెలియజేశాడు. ఆవార్త పత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది కానీ గుంతలు మాత్రం అలాగే వికటాట్టహాసం చేస్తూ మనం బాధ్యతగా కట్టే పన్నులను మింగేస్తూ ఉన్నాయి.

నిష్ఫల శ్రుతి!

నిజంగానే ఇండియాకు తనకు తానే రిపేర్ చేసుకునే తారు వచ్చిందనే అనుకుందాం. మన గుంతలో కాంట్రాక్టర్లు పడనిస్తారా? గుంతకాడ నక్కల్లాంటి అవినీతి తిమింగలాలు ఈ తారును వేయనిస్తాయా? వేసినా పనిచేయనిస్తారా? పనిచేయనిస్తే భారత్ కు వికసిత దారులు వచ్చినట్లే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…
  • రోడ్ల గుంతలా మజాకా… పెద్ద పెద్ద కంపెనీల్నే తరిమేస్తున్నయ్…
  • సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…
  • గెలిచానని నవ్వనా… ఏడ్వనా… మనసా కవ్వించకే నన్నిలా..!
  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions