నిజానికి ఈ పెళ్లిని చట్టం ఒప్పుకోకపోవచ్చుగాక… కానీ సమాజం హర్షిస్తుంది..! ఓ మాంచి సినిమా కథ… ఛఛ, కాదు కాదు… అంతకుమించి..! ఎందుకంటే ఈ కథలో నిఖార్సయిన ఓ అక్క ప్రేమ ఉంది, కాబోయే భార్య కోరికను తీర్చిన భర్త ఉన్నాడు, హర్షించి ఆశీస్సులు జల్లిన సమాజం ఉంది… సహజంగానే ఎప్పుడూ సొసైటీకి విరుద్ధంగానే వెళ్లే పోలీసులున్నారు, అధికారులున్నారు… అఫ్ కోర్స్, వాళ్లెప్పుడూ అంతే కదా… అదేమంటే చట్టాలు, తొక్కాతోలు… ఈ ఒక్క విషయంలోనే పెద్ద కర్తవ్యనిర్వహణ చేసి, జీవితాల్ని, కొలువుల్ని సార్థకం చేసుకున్నట్టు…!! అసలు కథేమిటంటే..? కర్నాటక… కోలార్ జిల్లా… ముల్బగల్ తాలూకా… వేగమడుగు గ్రామం… 31 ఏళ్ల ఉమాపతికి పెళ్లి నిశ్చయమైంది… వధువు పేరు సుప్రియ, వయస్సు 21…
ఆమె పెళ్లికి ముందే ఓ షరతు పెట్టింది… నిజానికి షరతు అనడంకన్నా ఇంకేదో పదం వెతకాలి… కాబోయే భర్తను బతిమిలాడింది.., ‘‘నా చెల్లెను కూడా పెళ్లి చేసుకో, అది పుట్టుచెవుడు, మూగ… చిన్నప్పటి నుంచీ నేనే దానికి అండ, నేను లేకపోతే దాన్నెవరు చూసుకుంటారు..? నువ్వే చేసుకున్నావు అనుకో, జీవితాంతం నేనే దాన్ని చూసుకుంటాను, ప్లీజ్, ఒప్పుకో…’’ దానికి ఉమాపతి సరే అన్నాడు… ఆమెతోపాటు ఆమె చెల్లె లలిత మెళ్లో కూడా ఒకేసారి పుస్తెలు కట్టేశాడు… ఇదీ స్టోరీ… పెళ్లికి వచ్చిన పెద్దలు మనస్పూర్తిగా అక్షింతలు చల్లి, మంచి పని చేశావురా అబ్బాయ్ అని వరుడిని, అక్కవంటే నువ్వే సుమీ అంటూ సుప్రియను మెచ్చుకున్నారు, దీవించారు… 1979లో కన్నడంలో ఓ సినిమా వచ్చింది… పేరు ధర్మసెరె… సేమ్ కథ… అందరూ ఓసారి ఆ సినిమా కథను గుర్తుచేసుకున్నారు…
Ads
సీన్ కట్ చేస్తే… స్త్రీశిశుసంక్షేమ శాఖ అధికారులు వచ్చారు… ఆయ్ఁ ఇలా చేసుకోవడం చట్టరీత్యా కుదరదు అన్నారు… పోలీసుల్ని పిలిచారు… వాళ్లు కేసులు పెట్టారు, ఎందుకంటే..? లలిత వయస్సు ఇంకా 16 మాత్రమే… 18 ఏళ్లు నిండకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు కనుక… ఇది బాల్యవివాహంగా, నేరంగా పరిగణించారు… ఇద్దరిని చేసుకున్నాడు కాబట్టి బహుభార్యత్వం… ఇందులో ముఖ్యమైంది బాల్యవివాహం కేసు… సరే, ఈ కేసులతో అయ్యేది లేదు, పోయేది లేదులే గానీ… ఇక్కడ కొన్ని ట్విస్టులు ఏమిటంటే…? పోలీసులు మొత్తం ఏడుగురి మీద కేసులు పెట్టారు… ఈ పెళ్లి పత్రికలు ప్రింట్ చేసిన ప్రింటర్ మీద, పెళ్లి జరిపించిన పూజారి మీద కూడా…!! ఉరుమురిమి మామీద పడింది బాబోయ్ అని వాళ్లు లబోదిబో…
ఇందులో అక్క 12 తరగతి చదివింది… చెల్లె లలిత తన వైకల్యం కారణంగా చదువు సరిగ్గా సాగక 9 దాకా చదివి ఆపేసింది… ఇక్కడ ఇంకొన్ని అంశాలు ఉన్నాయండోయ్… ఈ పెళ్లి చేసుకున్న ఉమాపతి బయటి వ్యక్తి కాదు… సాక్షాత్తూ ఈ ఇద్దరు వధువులకు మేనమామ… ఆ కుటుంబం గురించి సంపూర్ణంగా తెలిసినవాడే… అందుకే సుప్రియ అడగ్గానే అంగీకరించాడు… బయటి వ్యక్తి అయితే అంత త్వరగా కనెక్టయి ఉండేవాడు కాడేమో… వధువు తండ్రికి మొత్తం నలుగురు ఆడపిల్లలు… పెద్ద బిడ్డకు గత ఏడాదే పెళ్లి చేశారు… ఇప్పుడు ఇద్దరివి ఇలా జరిగిపోయాయి… నాలుగో బిడ్డ స్కూల్లో చదువుతోంది… ఫైనల్ టచ్ ఏమిటంటే… ఆ తండ్రి నాగరాజప్ప కూడా సేమ్ ఇలాగే ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడుట… వాళ్లిద్దరి పేర్లు సుబ్బమ్మ, రాణెమ్మ… రాణెమ్మ కూడా పుట్టు మూగ, చెవిటి… చెల్లెను పెళ్లిచేసుకోవాలని ఇలాగే సుబ్బమ్మ కోరితే నాగరాజప్ప దయతో ఇద్దరినీ ఒకేసారి చేసుకున్నాడు… సేమ్, తమ తరువాత తరానిదీ అదే కథ… (టైమ్స్ కథనం ప్రకారం…) టచింగ్ స్టోరీ కదా..! మరి ‘ముచ్చట’ అభిప్రాయం ఏమిటీ అంటారా..? ఈ పెళ్లి పట్ల వధూవరులకు అభినందనలు… చట్టాల స్పూర్తిని అప్పుడప్పుడూ పక్కన పెట్టేయడమే సరైన స్పూర్తి అవుతుంది… ఇలాంటి కేసుల్లో…!!
Share this Article