.
Mohammed Rafee
…. పాతికేళ్ళ క్రితం ఆకెళ్ళ గారిని అడిగాను… మీలా హత్తుకునేలా, ప్రేక్షకుడ్ని మీరు కట్టిపడేస్తున్నట్లు నేను పాఠకుడిని పట్టుకునేలా రాయాలంటే ఏం చేయాలి అని ఇంత ప్రశ్న అడిగితే…
ఆయన నవ్వి సింపుల్ గా “చదవాలమ్మ బాగా చదవాలి” అన్నారు.
“పంచ కావ్యాలు కూడా తెలియని వాళ్ళు రచయితలుగా ఘన కీర్తులు పొందుతున్నారు. చదవాలమ్మ చదవాలి” అని ఆకెళ్ళ చెప్పారు. ఆ మాటలు నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేవి! నాతో ఎన్నో పుస్తకాలు చదివించేలా చేశాయి!
Ads
శుక్రవారం ఆకెళ్ళ కనుమూసారు… పూర్తి పేరు ఆకెళ్ళ వెంకట సూర్య నారాయణ. కానీ, ఆకెళ్ళ అనే ఇంటిపేరుతోనే సుప్రసిద్ధులు!
- గొప్ప రచయిత. 80 పైగా సినిమాలకు కథలు మాటలు రాశారు. వందలాది కథలు, నవలలు రాశారు. ఇక రేడియో నాటికలు, రంగస్థల పద్య, సాంఘిక నాటకాలు, నాటికలు ఎన్నో అద్భుతాలు రచించారు. వెయ్యికి పైగా టివి ఎపిసోడ్స్ రాశారు.
16 నందులు గెలుచుకున్న రచయిత! వ్యవస్థ అనే ఆయన నవల మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన మగ మహారాజు సినిమా! అది ఆకెళ్ళ రచనే! అమ్మ, కళ్ళు, కాకి ఎంగిలి, క్రాస్ రోడ్స్, తలుపు, జీవన వేదం, మూడోపాదం, కొత్త సైన్యం, భయం ఇలాంటి నాటికలు ఎన్నో ప్రేక్షకులను కన్నీరు పెట్టించి హృదయాలకు హత్తుకున్నాయి!
గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాధుడు నాటకం ఒక గొప్ప సంచలనం! అది ఈయన కలం నుంచి వచ్చిందే! నందులు కొల్లగొట్టిన రాణి రుద్రమదేవి రాసింది ఈయనే!
స్వాతి ముత్యం, శృతిలయలు, సిరివెన్నెల, ఆడదే ఆధారం, శ్రీమతి ఒక బహుమతి, ఆయనకు ఇద్దరు, చిలకపచ్చ కాపురం, పచ్చని సంసారం ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయిత ఆకెళ్ళ! కాకినాడ ఆయన స్వస్థలం. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. గెజిటెడ్ ఆఫీసర్ స్థాయిలో ప్రభుత్వంలో రిటైర్ అయ్యారు! ఆయన కాస్త ధైర్యం చేసి ఉద్యోగం వదలి ఉంటే సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి ఉండేవారు!
ఆయన ఎవరినీ లెక్క చేయరు! ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువ! తనను మించిన రచయిత లేడనే పొగరు కూడా కాస్త ఉండేది! నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వల్ల ఆయన ఉద్యోగాన్ని వదల్లేక పోయారు. ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోలేదు!
కానీ, నాటక రచయితగా పూర్తి సంతృప్తిగా జీవించారు. రిటైర్డ్ అయ్యాక పూర్తి స్థాయి రచయితగా కొనసాగారు. చివరి శ్వాస వరకు రాస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఉగాది, కళారత్న పురస్కారాలతో గౌరవించింది! 16 నంది పురస్కారాలు కైవసం చేసుకున్నారు.
చివరిగా ఒక్క మాట…. ఇండస్ట్రీకి ముఖ్యంగా కె. విశ్వనాధ్ కు సీతారామ శాస్త్రిని ఈయన పరిచయం చేయబట్టే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యాడు! సినీ ఇండస్ట్రీకి శాస్త్రి ఒక సుగుణాభరణం అయ్యారు!
ఆయన మరణం నాటక రంగానికి తీరని లోటు! కేంద్ర సాహిత్య అకాడమి గుర్తించలేదనే బాధ ఆయనలో అలాగే ఉండిపోయింది. – డా. మహ్మద్ రఫీ
Share this Article