.
మొత్తానికి ఓ క్లారిటీ వచ్చింది… ఆయుధాలు విసర్జిస్తామనీ, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తామని మావోయిస్టు పార్టీ పేరిట వచ్చిన లేఖ ఫేక్ కాదు… కాకపోతే అది పార్టీ అధికారిక ప్రకటన కాదు… సెంట్రల్ కమిటీలో సీనియర్ నక్సలైట్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టత ఇచ్చింది మావోయిస్ట్ పార్టీ…
మావోయిస్టుల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదు… సెంట్రల్ కమిటీ ప్రకటనలే శిరోధార్యం… అయితే ఇక్కడ కొన్ని చెప్పుకోవల్సిన అంశాలున్నయ్… ఎందుకంటే..? మల్లోజుల వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చుగాక, కానీ మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నత స్థాయిలో నెలకొన్న సైద్ధాంతిక గందరగోళం, పోరాటం కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు చర్చించదగినవి…
Ads
ఇక ఏమాత్రం పోరాటాన్ని కొనసాగించే అవకాశాల్లేవని సెంట్రల్ కమిటీ సీనియర్ నేత, ఈ పోరాటానికి నాయకత్వం వహించే స్థాయి ఉన్నట్టు భావించబడిన వ్యక్తి అభిప్రాయపడటం నక్సలైట్ల మనుగడ పోరాటాన్ని స్పష్టం చేస్తున్నాయి… స్పష్టంగా రాజ్యం పైచేయి సాధించింది… జనంలో మావోయిస్ట్ పార్టీ పోకడల మీద ఆదరణ లేదు, కొత్త రిక్రూట్‌మెంట్ లేదు, యువతకు ఈ పోరాటం మీద ఆసక్తి లేదు…
దానికితోడు వయస్సు మళ్లిన నాయకత్వాలు, అనారోగ్యాలు, పట్టు సాధిస్తూ ఏరివేతలో దూకుడుగా వెళ్తున్న ప్రత్యేక బలగాలు… నేలకొరుగుతున్న పోరాట కెరటాలు… వెరసి ఇక మావోయిస్టు పార్టీ మనుగడ మీదే సందేహాలు… అసలు ఎవరు ఈ మల్లోజుల అలియాస్ సోను…
69 ఏళ్ల ఈ మావోయిస్టు సీనియర్ నేత బి.కాం గ్రాడ్యుయేట్… తెలుగు బ్రాహ్మణ కుటుంబం… పోరాటం పట్ల విసుగు చెందిన ఆయన గతంలోనే ప్రభుత్వానికి కాల్పుల విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశాడు… టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం… క్షీణిస్తున్న తన ఆరోగ్యం, అలాగే మహారాష్ట్ర సి-60 కమాండోలు, తెలంగాణ గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక దళాల ముందు తమ సాయుధ బలగాల ప్రభావం తగ్గిపోవడం… తనను తుపాకీ పడేసి లొంగిపోయే మార్గాన్ని సూచిస్తున్నాయి…
సోను, 2011లో కోల్‌కతా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషెన్‌జీ పెద్ద అన్నయ్య… సోను త్వరలోనే తన భార్య తారక్కతో చేరవచ్చని చెబుతున్నారు… ఆమె 2023 చివర్లో మహారాష్ట్ర పోలీసులకు లొంగి, ప్రస్తుతం గడ్చిరోలి పోలీసుల పునరావాస శిబిరంలో ఉంటోంది… అంటే తనూ లొంగుబాటలో ఉన్నట్టే…
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ లొంగుబాట్లు ఉంటాయని చెబుతోంది… అంటే సోను బ్యాచ్ అంతా తుపాకులను వదిలేయడానికి సిద్దపడుతున్నట్టేననే విశ్లేషణలు మీడియాలో కనిపిస్తున్నాయి… “సోను ప్రస్తుతం అబుజ్మాడ్ అటవీ పర్వత ప్రాంతంలో దాగి ఉండవచ్చని అనుకుంటున్నాం…’’ అంటున్నారు పోలీసు అధికారులు…
ఓ ఉన్నతాధికారి ఏమంటాడంటే..? (వ్యూహాత్మకం కావచ్చు)… ‘‘ సీపీఐ (మావోయిస్టు) తెలుగు నాయకత్వం పట్ల దిగువ స్థాయి గిరిజన కేడర్లలో పెరుగుతున్నది అసంతృప్తి… గిరిజన నక్సలైట్లను ఎలా వాడుతున్నారన్న దానిపై గాఢమైన వ్యతిరేకత ఉంది… గిరిజనులను పోరాటంలో ముందుపెడుతున్నారు, నాయకత్వాల్లో వెనక్కి నెడుతున్నారనే అసంతృప్తి, ఆగ్రహం ఎస్టీ దళసభ్యుల్లో ఉంది…’’
సో, ఇవన్నీ విశ్లేషిస్తే… మల్లోజుల అలియాస్ అభయ్ అలియాస్ సోను త్వరలో పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది… సో, పార్టీలో చీలిక కాదు, అసలు ఆయుధాల విసర్జన అసలే కాదు..!! అనగా అమిత్ షాకు క్రెడిట్ దక్కే చాన్స్ ఇప్పట్లో లేదు..!! నో, నో, ఆయుధాల విసర్జనపై సెంట్రల్ కమిటీలో చర్చ జరిగిందనీ, అదే మల్లోజుల బయటపెట్టాడనీ మరికొందరి వివరణలు… ఎవరేం చెబుతున్నారో అంతా గందరగోళం…
అన్నట్టు మల్లోజుల లొంగిపోవాలని అనుకుంటే తెలంగాణ ప్రభుత్వమే బెస్ట్… లోతు కారణాలిక్కడ ప్రస్తావనకు అనర్హం… చాయిస్ ఈజ్ యువర్స్ సోనూ..!!
Share this Article