.
మా ఇంటికి ఎప్పుడొచ్చినా… చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తారు.., ఎంత త్వరగా వెళ్లిపోదామా అని… భోజనానికి ఎప్పుడూ ఉండరు…. అని మా చిన్ననాటి స్నేహితుడి భార్య మరీ నిష్టూరమాడుతుంటే చెప్పాను…
భోజనానికి పిలిస్తే ఎందుకు రాం…? కానీ మా భయమేందంటే, మేం భోజనానికి వస్తున్నామంటే మీరు పొద్దున్నే నాలుగింటికి లేచి, బోల్డన్ని వెరైటీలు చేస్తారు… మీ కష్టం చూడలేకే మీ ఇంటికి భోజనానికి వస్తలేం మేం…
Ads
సరే… ఇన్నిసార్లు పిలిచారు కాబట్టి మా షరతులు ఒప్పుకుంటేనే వస్తాం అన్నాను…
సరే, చెప్పండి…. మీరు ఎలా అంటే అలాగే అన్నారావిడ… చెప్పాను…
మరీ ఎక్కువ కాకుండా లైట్‌గా మామిడికాయ పప్పు, పచ్చిపులుసు… అంతే చాలు… అంతకు మించి ఇంకేమీ వద్దు… ఇక నువ్వు ఆన్యపుకాయ పప్పుచారు బాగా చేస్తావని మీ ఆయన చెప్తుంటాడు.., కాబట్టి అదొకటే…
ఇక చిన్నచిన్నవంటావా… ఏదో మరీ ఎక్కువ కాకుండా ఓ నాలుగు సకినాలు, రెండు వడప్పలు, ఐదారు పూరీలు… మీ అత్త బాగా చేస్తుంది కదా, నాలుగైదు సర్వపిండి రొట్టెలు… అంతే, ఇంకేం వద్దు… సుగర్ కదా, మక్క గట్క చేస్తే మంచిదే… పజ్జొన్న రొట్టెలు నాలుగు కాలిస్తే ఆరోగ్యానికి మంచిది…
నాకు గారెలు అంత ఇష్టం ఉండవు కాబట్టి మీకు గారెలు చేసే బాధ లేదు… ఏవో నాలుగంటే నాలుగు కారపప్పలు చాలు… మరీ శ్రమపడకండి ప్లీజ్… ఎలాగూ మీరు భక్ష్యాలు బాగా చేస్తారు కదా… మంచి నెయ్యి వేసి కాల్చిన, గసగసాలు అద్దిన నాలుగు భక్ష్యాలు చాలు…
మీ అమ్మ నీతోనే ఉంది కదా… బజ్జీల చల్లచారు బాగా చేస్తుందట కదా… అది కూడా… ఈ ఇంగువలూ మాకు పడవు గానీ… నీకు తెలియందేముంది…? అసలు భోజనానికి కాస్త ముందు మాంచి మిర్చి బజ్జీలు, కల్లు… అదెలాగూ మా దోస్త్ చూసుకుంటాడు… మిర్చి బజ్జీలు నీవంతే సుమీ… చెప్పలేదంటనకపొయ్యేవూ…
ఐనా నీకు తెలుసు కదా… ఏ పదార్థం అయినా సరే, ఎక్కువ చేసేసి తర్వాత ఇంటికి కూడా పట్టుకెళ్ళండి అని బలవంతం చెయ్యొద్దు ప్లీజ్… ఇక నీకు తెలుసు కదా… నేను సోగి, పచ్చళ్లు తినను… అందుకని ఒనగాయ తొక్కు, బుడుమ కాయ సోగి… అంతే… అబ్బే, మన దగ్గర పూతరేకులు ఎవరు చేస్తారు..? ఎవరు తింటారు…?
ఆ భక్ష్యాలే కొన్ని కట్టిస్తే సరి…’’ ఇంత కంటే ఒక్కటి ఎక్కువ చేసినా వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోతాం, మరి మీ ఇష్టం’’ అని నిష్కర్షగా చెప్పాను… అంత్య నిష్టూరం మంచిది కాదు కదా…
ఇంకో విషయం మర్చిపోయా… మీకు తెలుసుగా, నేను ఉదయం 11 గంటలకే భోజనం చేసేస్తా… అందుకని ఉదయం 10 తర్వాత కాఫీ తాగను… వోన్లీ అంబలి… మేం పొద్దున్నే 7 కల్లా వచ్చేస్తాం… పోద్దాటి కల్లు లేదంటే ఈత కల్లు శ్రేష్టం, ఐనా మావాడికి నేను చెబుతాలే… కాబట్టి చాయ్, కాఫీలు నువ్వు శ్రమ తీసుకోకు….
ఇంత వివరంగా చెప్పానా..? ఏదో అల్ప భోజన సంతోషులం… కానీ… ఎందుకో గానీ… ఇదంతా చెప్పాక… తర్వాత చాలాసార్లు వాళ్ళింటికి వెళ్ళాం కానీ భోజనం ప్రస్తావనే లేదు…. ఎందుకో తెలియదు మరి…
Share this Article