అవి జయలలిత పేరిట అప్పుడెప్పుడో వెలిసిన అమ్మ క్యాంటీన్లు… తక్కువ ధరలతో పేదల కడుపులు నింపే ధర్మసత్రాలు… స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని పీకేయలేదు… అవి తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీకి మైలేజీ తీసుకొచ్చేవి అని కన్నెర్ర చేయలేదు… ఈ లాక్ డౌన్ల కాలంలో అవే పది మందికి తిండి పెడతాయి, వాటిని అలాగే నడిపిస్తాను అని ప్రకటించాడు… ఓహో, స్టాలిన్‌లో మనకు తెలియని ఏదో రాజకీయ పరిణత కోణం ఉన్నట్టుంది అనుకున్నారు అందరూ… ఓచోట అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీ చింపేసిన డీఎంకే నాయకుడి మీద కేసు పెట్టి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా… స్టాలిన్ ఓ సంకేతం ఇచ్చాడు… అసలే రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే, అన్నాడీఎంకే శ్రేణుల నడుమ ఉప్పూనిప్పూ యవ్వారం ఉంటుంది… ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడానికి వీల్లేదు… ఏ ఊరు చూసినా రెండు పార్టీలుగా చీలిపోయి ఉంటుంది… కానీ ఈ విజయంతో తమ పార్టీ వాళ్లు అన్నాడీఎంకే కేడర్ మీద ప్రతీకార చర్యలకు దిగుతారనేది స్టాలిన్ సందేహం… దాన్ని నివారించడానికి ఈ సంకేతం ఉపయోగపడింది…
నిజానికి ఎంజీఆర్, కరుణానిధిల నడుమ వైరంతోనే ఈ రెండు పార్టీల నడుమ ద్వేషావేశాలు ప్రబలినయ్… ఐనాసరే, బలమైన ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా వారి నడుమ వ్యక్తిగతంగా మరీ మొహాలు చూసుకోలేనంత వైరం ఉండేది కాదు… ఉదాహరణ ఏమిటంటే..? ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెళ్లికి వాళ్లిద్దరూ హాజరై, పక్కపక్కన కూర్చుని జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు… (ఆమె తండ్రి కుమరి అనంతన్ అప్పట్లో కాంగ్రెస్ లీడర్)… ఎంజీఆర్ మరణం తరువాత, అన్నాడీఎంకే మీద జయలలిత పెత్తనం మొదలయ్యాక రెండు పార్టీల నడుమ వైరం బాగా ముదిరింది… ఎవరైనా డీఎంకే నాయకులతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తే వాళ్లను నిర్దాక్షిణ్యంగా తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిపారేసేది ఆమె… అసలు కరుణానిధికీ ఆమెకూ నడుమ చాలా తీవ్రంగా సాగేది ఈ తూకిత్తా తూకిత్తా వైరం… ఓ అర్ధరాత్రి కరుణానిధిని అరెస్టు చేసిన తీరు తెలిసిందే కదా…
Ads
ప్రత్యర్థుల పట్ల ఆమె మరీ అగౌరవంగా, అమర్యాదకరంగా వ్యవహరించేది… 2016లో ప్రమాణస్వీకారం సందర్భంగా ఆమె స్టాలిన్‌కు మరీ 16వ వరుసలో సీటు కేటాయించింది… ఆమె మరణించాక పళనిస్వామి సీఎం అయ్యాడు, సేమ్, జయలలిత టైపు మెంటాలిటీయే ఉన్న శశికళను పూర్తిగా ఇగ్నోర్ చేసి, పార్టీ నుంచే కట్ చేసి పారేశారు… కొన్నాళ్లకు కరుణానిధి కూడా మరణించాడు… డీఎంకే పెత్తనం పూర్తిగా స్టాలిన్ చేతుల్లోకి వచ్చింది… అప్పట్నుంచే ఈ ప్రత్యర్థిత్వం బాగా చల్లబడటం స్టార్టయ్యింది… డీఎంకే ప్రతినిధి బృందం ఎప్పుడొచ్చినా సీఎం పళనిస్వామి వెంటనే టైమ్ ఇచ్చి కలిసేవాడు… కరుణానిధి ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన పన్నీర్ సెల్వంను కొందరు మంత్రులతో ఒక టీంగా పరామర్శ కోసం పంపించాడు,.. కరుణానిధి మరణించాక ఇతర మాజీ సీఎంల సమాధుల పక్కన సమాధి చేయడానికి రూల్స్ ఒప్పుకోలేదు… కానీ కోర్టు ఇన్వాల్వయి సూచనలు జారీ చేశాక పళనిస్వామి దాన్ని గౌరవంగా అమలు చేశాడు… పళనిస్వామి తల్లి చనిపోయినప్పుడు కూడా స్టాలిన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించాడు…
ప్రస్తుతం స్టాలిన్ కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటిప్పుడు సలహాలు ఇవ్వడానికి 13 మందితో ఓ సలహామండలిని ఏర్పాటు చేశాడు… దానికి తనే ఛైర్మన్… మిగతా 12 మంది పన్నెండు వేర్వేరు పార్టీలకు చెందినవారు… అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేను తీసుకున్నారు అందులోకి… అన్నాడీఎంకేకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా ఉన్నాడు… ఇదొక పరిణత రాజకీయం… ఎన్నికలు, పోటీలు, రాజకీయ వైరుధ్యాలు, ఆ పోరాటాలు వేరు… పాలనకు సంబంధించిన కొన్ని కీలక విషయాల్లో అందరినీ కలుపుకుని వెళ్లడం వేరు… ఇప్పటికైతే స్టాలిన్ తీసుకునే నిర్ణయాల్లో పరిపక్వత కనిపిస్తోంది… ఇదిలాగే ఉంటుందా..? కొనసాగుతుందా..? కాలం చెప్పాలి… గతంలో రెండు పార్టీ కేడర్ల నడుమ కనిపించే పగలు, శత్రుత్వాలు, దాడులు గట్రా ఇప్పుడైతే పెద్దగా లేవు… పన్నీర్ సెల్వానికి గానీ, పళని స్వామికి గానీ ఢీఅంటేఢీ అనేలా డీఎంకేను ఢీకొట్టేంత సీన్ లేదు, పైగా వాళ్ల తత్వాలూ అవి కావు… స్టాలిన్ కక్షగట్టి వేటాడేంత వైరం కూడా వాళ్ల నడుమ లేదు… ఎలాగూ ఓడిపోయారు, ఇక మళ్లీ లేవకుండా తొక్కేద్దాం అనే ధోరణి స్టాలిన్‌లో కనిపించడం లేదు… ప్రస్తుతానికి ఇది అభినందనీయం…!!
Share this Article