.
కేసీయార్‌కూ రేవంత్‌రెడ్డికీ అదే తేడా… కేసీయార్ ఫామ్ హౌజు నుంచి కదలడు… ముఖ్యమంత్రిగా ఉండీ అప్పుడప్పుడూ కొన్నిరోజులపాటు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా తెలియదు… ఇప్పుడైతే ఇక తన హౌజులో తనే బందీ…
కొండగట్టు ప్రమాదబాధితుల వద్దకే కాదు, ఏ ఇన్సిడెంట్ జరిగినా తను వెళ్లేవాడు కాదు… చివరకు భద్రాచలం ముత్యాల తలంబ్రాలకు కూడా మనమడిని పంపించాడు తప్ప తను మాత్రం వెళ్లడం ఆపేశాడు… రేవంత్‌రెడ్డి కథ వేరు…
Ads
నగరంలో భారీవర్ష ప్రాంతాలకు వెళ్తాడు… సైలెంటుగా ట్యాంక్ బండ్ దగ్గరకు వినాయక నిమజ్జనాల పర్యవేక్షణకు వెళ్తాడు… ఇప్పుడు మేడారం వెళ్లాలనే నిర్ణయం కూడా అభినందనీయం… అది ఓ ముఖ్యమంత్రిగా స్వయంగా వెళ్లి, అక్కడ డెవలప్‌మెంట్ పనుల మీద గిరిజనుల్లో నెలకొన్ని అపోహల్ని తనే క్లియర్ చేయాలనుకోవడం…
(అఫ్‌కోర్స్, కేసీయార్ కూడా ఒకటీరెండుసార్లు సతీసమేతంగా మేడారం వెళ్లి దేవతలను దర్శించి, తన ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించాడు…)
రేవంత్ రెడ్డి పర్యటన వేరు… ఎందుకంటే..? బీఆర్ఎస్ మార్క్ దుష్ప్రచారాలు, గిరిజనులను రెచ్చగొట్టాలనే ప్రయత్నాలకు ఈ రేవంత్ రెడ్డి పర్యటన ఓ విరుగుడు అవుతుంది… మాస్టర్ ప్లాన్ పేరిట స్థానిక గిరిజన సంప్రదాయిక, సాంస్కృతిక ఆనవాళ్లను డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది కదా బీఆర్ఎస్ ప్రచారం…
ప్రత్యేకించి కాకతీయులపై పోరు సలిపిన సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర అదే కాకతీయ కళాతోరణంలా కనిపించే స్వాగత నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంటున్నదని ఓ ప్రాపగాండా… ప్రభుత్వంపై గిరిజనుల్లో ఆగ్రహం పెంచే ఎత్తుగడ…
సరే, ఆమధ్య సీతక్క అక్కడి ఎస్పీ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ… దేవతల గద్దెల వద్ద గిరిజనుల సంస్కృతి, మనోభావాలు దెబ్బతినే ఒక్క చర్య కూడా ప్రభుత్వం తీసుకోదనీ, నేనూ మీ బిడ్డనే కదా అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది… ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వెళ్లి మాట్లాడితే, అందరి అపోహల్ని క్లియర్ చేస్తే ఇంకా బెటర్…
నిజానికి ఆ గద్దెల దగ్గర… విగ్రహాలు గానీ, మరే ఇతర దేవాదాయ శాఖ బాపతు జనరల్ పైత్యాలు గానీ గిరిజనులు రానివ్వరు… తమ సంప్రదాయాన్ని, తమ పూజా విధానాల్ని తాము రక్షించుకుంటారు… దాన్ని ఏ ప్రభుత్వమైనా గౌరవించాల్సిందే…
కోట్ల మంది హాజరయ్యే తెలంగాణ, గిరిజన కుంభమేళా అది… అఫ్‌కోర్స్, ఇప్పుడు గిరిజనేతరులు కూడా భారీ సంఖ్యలో మామూలు రోజుల్లో కూడా వెళ్తున్నారు… ఇక జాతర రోజుల్లోనయితే చెప్పనక్కర్లేదు…
రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి ప్రణాళికపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్షించాక… ఈ నెల 23 న మేడారానికి తనే స్వయంగా వస్తానని చెప్పాడు… అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను కూడా మాట్లాడతానన్నాడు…
గిరిజన పూజారుల సూచనల మేరకు, వారి అంగీకారంతోనే డెవలప్‌మెంట్ వర్క్స్, ఆ డిజైన్లను విడుదల చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన… సరైన పని… అంతేకాదు, మేడారం జాతర పనులకు సంబంధించి ఓ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించాడు సీఎం…
గద్దెల జోలికి పోదు ప్రభుత్వం… ఆలయ ఆవరణను మరింత విస్తరించి, భక్తులకు దర్శనం సులభంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం… అక్కడ నిర్మించే స్వాగత తోరణాలను కూడా గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించాలని సీఎం ఆదేశం… ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నాడు…
తనతోపాటు ఈనెల 23న మేడారం వెళ్లనున్నారు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు… బాగుంది… గిరిజనుల సందేహాలకు సరైన దిశలో నివృత్తి..!!
Share this Article