.
ప్రపంచంలో ఏ భాషలో అయినా మొదటి పలకరింపు “బాగున్నారా?”. ఒకవేళ మనం ఆ సమయానికి కష్టంలో ఉన్నా బాగున్నామనే చెబుతాం. వెనువెంటనే “మీరెలా ఉన్నారు?” అని అడుగుతాం. వాళ్ళు కూడా బాగున్నామనే చెబుతారు. “ఉభయకుశలోపరి” మిగతా మాటలు మొదలవుతాయి.
సెల్ ఫోన్లు రాకముందు ఉత్తరాలు రాసుకునే సత్తెకాలంలో మొదట రాయాల్సిన మాటలు “నేను క్షేమం”; “మీరు క్షేమమని తలుస్తాను”. దానమో ధర్మమో చేస్తే చివరికి అడుక్కుతినేవారు కూడా “దయగల మారాజులు చల్లంగ ఉండాల” అని ఆశీర్వదిస్తారు. లోకంలో అదొక మర్యాద. మన నరనరాన ప్రతిఫలించే ఆచారం.
Ads
అదే ప్రభుత్వ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఎప్పుడూ బాగుండము. ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటాం. మన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేము. మన రోగాలకు వైద్యం చేయించుకోలేము. మన పిల్లలను పైచదువులకు విదేశాలకు పంపలేము.
పెరిగి చెట్టంత అయిన మన పిల్లలకు పెళ్ళి చేయలేము. మనకు నిలువ నీడ ఉండదు. కట్టుకోవడానికి గోచీ గుడ్డ కూడా ఉండదు. వండుకోవడానికి ఏ పూటా పిడికెడు బియ్యం ఉండవు. పొయ్యి వెలిగించడానికి సిలిండర్ కు డబ్బులు ఉండవు.
దాంతో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఇచ్చి… మనకు మేలిరకం సన్న బియ్యం ఇచ్చేదాకా మన ఇళ్లల్లో వంటింటి పొయ్యిలో పిల్లి లేవదు. బియ్యం ఇచ్చిన ఆ చేత్తోనే పప్పు- ఉప్పు- నిప్పు ఇచ్చేదాకా మనకు మింగ మెతుకు ఉండదు.
తెలంగాణాలో జనాభాతో దాదాపు సమానంగా రేషన్ కార్డులున్నాయని మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలొస్తున్నాయి. అంటే రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లమందిలో మహా అయితే పది, పదిహేను లక్షల మంది తప్ప మిగతావారందరూ పేదవారే. నిరుపేదలే.
పది లక్షల ఉద్యోగులు, హైదరాబాద్ కోటీశ్వరులు, లక్షలు, కోట్లలో ఆదాయపు పన్ను కట్టేవారు…ఇలా స్థిర ఆదాయ, అధికాదాయ, దారిద్ర్య రేఖకు పైనున్నవారికి మరీ ఇంతగా కరువొచ్చిందా? ఏమో! వచ్చే ఉంటుంది.
లేకపోతే ఇప్పుడున్న మూడు కోట్లా ఇరవై అయిదు లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు తోడు ఇప్పటికిప్పుడు మరో పది లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి…వెంటనే కార్డుల పంపిణీని ఒక బ్రహ్మోత్సవంగా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చేది?
రాష్ట్రంలో పాతిక లక్షల కార్లున్నాయి, పదిహేను లక్షలు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లు… ఇలాంటి కాకిలెక్కలకిక్కడ విలువ లేదు. కార్లుంటే రేషన్ కార్డు ఉండకూడదా! ఈరోజుల్లో కార్లు సైకిళ్ళతో సమానం. కారు కారే- రేషన్ కార్డు రేషన్ కార్డే! రెండు, మూడు తరాలకు సరిపడా ఇంట్లో మూలుగుతున్నా… పూటగడవడం కష్టంగా ఉందని చెప్పుకుంటూ… రెండు, మూడు రేషన్ కార్డులు తీసుకోవడంలో ఉన్న ఆ కిక్కే వేరప్పా!
ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు, సామాజిక అంశాల విశ్లేషకుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ “Everybody loves a good drought (అందరూ ప్రేమించే మంచి కరువు)” పేరిట గొప్ప సామాజిక పరిశోధన వ్యాసాల సంకలనంతో ఇంగ్లిష్ లో ఒక పుస్తకం ప్రచురించారు.
కరువును నిర్మూలించడం కంటే… కరువును శాశ్వతంగా అలాగే ఉండేలా చేస్తూ… కరువు పేరిట నిధులు అడుక్కునే, ఆ కరువు నిధులను కరువుదీరా దిగమింగే మన పాలనా వ్యవస్థలను, రాజకీయ యంత్రాంగాన్ని యథార్థగాథలతో ఇందులో ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇలాంటివి చదవడానికి, చదివి జీర్ణించుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. అదొక దశాబ్దాల విషాదగాథ. ఇకముందు కూడా కొనసాగే అంతులేని వ్యథ.
జనాభాను మించి రేషన్ కార్డుల సంఖ్య ఉండడాన్ని కూడా “అందరూ ప్రేమించే మంచి కరువు”లో భాగంగా అనుకుని… తూరుపు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప మెడమీద తలకాయ ఉన్నవారు, ఆ తలకాయలో మెదడున్నవారు చేయగలిగింది ఏమీ లేదు!
దారిద్య్ర రేఖ భూమధ్య రేఖలాంటిది! అది కంటికి కనిపించదు. దారిద్య్రరేఖకు అందరమూ కిందే ఉంటాం కాబట్టి తెల్ల రేషన్ కార్డుల నిచ్చెనలు వేస్తూ ఉంటే… ఎన్నో కొన్ని యుగాలకు ఆ రేఖను అందుకోగలుగుతాం!
“ఎవెరీబడీ లవ్స్ ఎ వైట్ రేషన్ కార్డ్!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article