.
ఎందుకిలా..? ఇండియా మీదే ఏమిటీ దాడి..? ఎందుకు ఈ కక్ష..? ఎక్కడి దాకా..? ఎడాపెడా సుంకాలు, వీసాలపై పిడుగులు… ఎందుకంటే… ట్రంపు ఓ వ్యాపారి… ప్లస్ అమెరికా అధ్యక్షుడు…
అంటే… తన వ్యక్తిగత కోణంలోనూ, అమెరికా అధ్యక్షుడి కోణంలోనూ ఇండియా మీద ఉరుముతున్నాడు… పగబట్టినట్టుగా..! మోడీ నా దోస్త్ అంటూనే ఇండియాపై వరుస దాడులు చేస్తూనే ఉన్నాడు… డబ్బులు పెట్టి తనను గెలిపించిన ఎలన్ మస్క్‌నే తన్నాడు, మోడీ ఎంత..?
Ads
రష్యా కోణం… ఉక్రెయిన్‌కు అన్నిరకాల ఆయుధసాయం చేస్తున్నా సరే, రష్యాను ఏమీ చేయలేడు.,. అదొక ఫ్రస్ట్రేషన్… రష్యా నుంచి చమురు కొంటూ ఇండియా రష్యాకు ఆర్థిక మద్దతుగా నిలబడిందని ఓ అక్కసు… నిజానికి రష్యా నుంచి నాటో దేశాలే ఎక్కువ కొనుగోళ్లు చేస్తుంటాయి… కానీ ఇండియా మీదే ప్రధానంగా కక్ష…
బ్రిక్స్ కోణం… ఒకవేళ బ్రిక్స్ ఇంకా ఓ బలమైన కూటమిగా ఏర్పడితే… సొంత కరెన్సీని కూడా చెలామణీలోకి తెచ్చుకుంటే… అమెరికా డాలర్ పెత్తనం మటాష్… డాలర్‌లో చైనా పెట్టుబడులున్నయ్… చైనాతో గోక్కోలేడు… భయం… ఆ కసి అంతా ఇండియా మీద చూపిస్తున్నాడు…
రిక్ కోణం… బ్రిక్స్ మాత్రమే కాదు, ఒకవేళ రష్యా, ఇండియా, చైనా ఓ కూటమిగా గనుక ఏర్పడితే… అమెరికాకు అనేకరంగాల్లో నష్టం తప్పదు… ఇన్నాళ్లూ తనే నంబర్‌వన్‌గా ప్రపంచం మీద పెత్తనం చేస్తోంది కదా అమెరికా… కానీ రిక్ ఏర్పడితే ప్రపంచ రాజకీయాలే మారిపోతాయి… దేశాల పోలరైజేషన్ తప్పదు… అమెరికాను ఎవడూ దేకడు… అదో ఫ్రస్ట్రేషన్… అఫ్‌కోర్స్, చైనాను నమ్మడం కష్టం, ఇండియా అంత దూకుడుగా ఏమీ పోవడం లేదు ఈ కోణంలో…
ట్రేడ్ డీల్ కోణం… ఇండియాాది అతి పెద్ద వినిమయ మార్కెట్… ఇండియాకు నాన్- వెజ్ పాలు, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేసి, ఇండియన్ మార్కెట్‌ను కమ్మేయాలని ప్లాన్… ఇండియన్ రైతులను తీవ్రంగా నష్టపరిచే ఆ ప్రయత్నాలకు భారత ప్రభుత్వం అడ్డుపడుతోంది… రకరకాల అంకుశాలతో ఇండియాను లొంగదీసుకోవాలని వ్యూహాలు… సుంకాలతో బెదరగొట్టడానికి ఇదీ ఓ కారణమే… బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో ఇండియాకు ట్రేడ్ డీల్స్ ఈజీ అవుతున్నాయి గానీ అమెరికాతో కుదరడం లేదు…
ఆయుధ విక్రయకోణం… ఎఫ్-35 వంటి యుద్ధవిమానాల్ని ఇండియాకు అంటగట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది… మనం సొంతంగానే 5వ తరం యుద్ధవిమానాల్ని (AMCA) డెవలప్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాం… జంట ఇంజన్లు, స్టెల్త్ టెక్నాలజీ, లైట్ వెయిట్… ప్రస్తుతం అమెరికా (F-22, F-35), రష్యా (సుఖోయ్ Su-57), చైనా (చెంగ్డు J-20) వద్దే ఇలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి… ఎఫ్-35కన్నా మెరుగైన రాఫెల్ జెట్లు ఉండనే ఉన్నాయి మనకు… రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ సిస్టమ్స్ కొనడం కూడా అమెరికాకు ఇష్టం లేదు…
చమురు కోణం… ఇండియా రష్యా నుంచి చౌకగా చమురు కొంటోంది… బెదిరించినా టారిఫ్స్ ప్రయోగించినా ఇండియా ఆపదు… పైగా సౌదీ నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించేసింది… అదీ సౌదీకి కోపం… సౌదీకి పాకిస్థాన్ మిత్రదేశం… (నిన్న యుద్ధసహకారం ఒప్పందమూ కుదిరింది…) పాకిస్థాన్ మనకు శతృదేశం… ఇద్దరూ కలిసి అమెరికాపై ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తూ ట్రంప్‌ను ఇండియాపైకి ఎగదోస్తున్నాయి…
వ్యాపార కోణం… పాకిస్థాన్ మీద ట్రంపు ప్రేమకు తన వ్యక్తిగత వ్యాపార కోణం ఉంది… పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో వ్యాపార సంబంధాలు… క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు… సో, పాకిస్థాన్ ఉగ్రవాద ధూర్తదేశం అయినా సరే పాకిస్థాన్‌తోనే ట్రంపు దోస్తీ, అమెరికా దోస్తీ… పాకిస్థాన్‌లో ఉన్నవి అమెరికన్ అణుబాంబులే అనీ, చైనా కోసం అక్కడ మొహరించినవనీ డిఫెన్స్ అనలిస్టులు చెబుతారు… అవేమో మొన్నటి ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్నయ్… అదొక కోపం…
ఆర్థిక కోణం… ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఇండియాది… ఎవరి మీదో ఆధారపడుతూ, ఎవరి రాజకీయాలకో పెత్తనాలకో తలవంచే సిట్యుయేషన్ లేదు… సొంతంగానే డెవలపయింది… మరోవైపు అమెరికా అంతర్గత ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది… ఇక ఎన్నాళ్లో ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేదు… అదొక కడుపుమంట…
నోబెల్ కోణం… ట్రంపుకు నోబెల్ శాంతి బహుమతి కావాలి… అదొక బలమైన కోరిక తనకు… ఇండియా ప్రపోజ్ చేయడం లేదు… చిన్న కారణమే కావచ్చుగాక… ఇలాంటివన్నీ కలిసి ఇండియా మీద ఓ రకమైన ఆగ్రహం… డెడ్ ఎకానమీ అని నోరుపారేసుకోవడం వెనుకా ఇలాంటివెన్నో కారణాలు…
ఇవే కాదు… అరయగ కర్ణుడీల్గె ఆరువురి చేతన్ అన్న తరహాలో…. ఇండియా అమెరికా సంబంధాలు చెడిపోవడం వెనుక అనేకానేక కారణాలు… దేశాల నడుమ అటు పుల్ల ఇటు కదిలినా దాని వెనుక ఏదో బలమైన కారణాలు ఉంటాయి…
హెచ్1బీ వీసాలపై ఆంక్షలు, ఫీజుల పెంపు, ఇక కొత్తగా ఇండియన్ టెకీలు రాకుండా గేట్లు మూసేయడం జస్ట్, ఇండియా వ్యతిరేక కోణంలో కొన్ని చర్యలు మాత్రమే… ఇంకా చాలా చేస్తాడు ట్రంప్… పాకిస్థాన్, చైనాలు ఇండియాకు ప్రత్యక్ష ప్రత్యర్థులు… కానీ అసలు నిగూఢ ప్రత్యర్థి ఏమాత్రం నమ్మదగని అమెరికాయే..!!
Share this Article