.
Subramanyam Dogiparthi
….. సారధి స్టూడియోస్ బేనర్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1986 చివర్లో వచ్చిన మాస్ మసాలా సెంటిమెంటల్ ఏక్షన్ సినిమా ఈ జైలుపక్షి .
- సాధారణంగా ఔట్ డోర్ షూటింగులంటే శోభన్ బాబు ఇష్టపడడట . ఊటీ లాంటి ప్రదేశాలలో వసతులు బాగా ఉంటాయి కాబట్టి ఊకొడతాడట . ఫారెస్ట్ ఏరియాలంటే కొద్దిగా ఎవాయిడ్ చేస్తాడట . దానిని బ్రేక్ చేస్తూ వచ్చిన అడవి రాజా , దాని తర్వాత వచ్చిన ఈ జైలుపక్షి రెండూ హిట్టయ్యాయి శోభన్ బాబుకి .
చెప్పటం మరచిపోయా . ఇదీ 1+2 సినిమాయే . కాకపోతే one after one ; not at a time . ఈ సినిమాలో హీరో శోభన్ బాబే అయినా షీరో రాధికే . రాధిక పాత్ర షీరోయిక్ గా ఉన్నా శోభన్ బాబు పాత్రని మరీ మింగేయకుండా జాగ్రత్తలు పడ్డారు .
Ads
ఓ స్ట్రిక్ట్ పోలీస్ ఇనస్పెక్టర్ ఓ ఇరవయ్యో శతాబ్దపు విలన్ వలన మాన్యాలకు బదిలీ అవుతాడు . ఆ ప్రదేశమంతా విలన్ గారి స్వంత అడ్డా . అక్కడ ఆయనకో మధురవాణి సెటప్ కూడా ఉంటుంది . ఆ ఊళ్ళో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ మధురవాణి సేవలో కూరుకుపోయి తరించిపోతుంటారు .
అలాంటి ఆ ఊరికి బదిలీ చేయబడ్డ హీరో గారికి గలగలగలా గోల చేసే ఓ అల్లరి రాధిక జైలుపక్షిగా పరిచయం అవుతుంది . చేయని నేరాలను , చేసిన నేరాలను నెత్తి మీదేసుకుని జైలుకు వెళుతుంటుంది . ఏ ఊళ్ళో ఏ జైల్లో ఏ ఫుడ్ బాగుంటుందో కూడా చెప్పేస్తుంటుంది .
ఆ ఊరి నిండా విలన్ సార్వభౌమరావు బాధితులే . జైలుపక్షి కూడా బాధితురాలే . హీరో గారు ఎలాగూ బాధితుడే . కావటం వలనే ఆ ఊరికి బదిలీ అయ్యాడు . సార్వభౌమరావు హత్య కేసులో జైలుశిక్ష పడిన హీరోని రక్షిస్తానికి జైలుపక్షి రాధిక పట్టణంలో పేరున్న గొప్ప క్రిమినల్ లాయర్ రావు గోపాలరావుని ఆశ్రయిస్తుంది . ఆ లాయరూ సార్వభౌమరావు బాధితుడే .
తన అద్భుతమైన వాదనా పటిమతో రావు గోపాలరావు హీరో గారిని బయటపడేస్తాడు . జైలుపక్షికి తక్కువ శిక్షతో బయటపడేస్తాడు . సినిమా చివర్లో వచ్చి కాసేపే ఉన్నా రావు గోపాలరావు లాయరుగా అదరగొట్టేసాడు . కోర్ట్ సీన్లో గొప్పగా నటించాడు . జైలుపక్షిగా వేర్వేరు పార్శ్వాలతో రాధిక దడదడలాడిస్తుంది .
శోభన్ బాబు హీమాన్ గా చాలా బాగా నటించారు . అతిధి పాత్రలో హీరో మొదటి భార్యగా సుమలత నటించింది . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది విలనుగా చలసాని అనే నూతన నటుడి గురించి . బాగా చేసాడు . తర్వాత మరే సినిమాలో కనిపించినట్లుగా లేదు .
ఆయన మధురవాణిగా కృష్ణవేణి , అమ్మగారి తమ్ముడిగా బాలాజి , నిస్సహాయ కానిస్టేబుళ్ళుగా సుత్తి వేలు , నూతన్ ప్రసాదులు బాగా నటించారు . ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , రాజ్ వర్మ , అల్లు రామలింగయ్య , వంకాయల , భీమేశ్వరరావు , పి జె శర్మ , ఐటమ్ డాన్సర్లుగా జయమాలిని , అనూరాధలు నటించారు .
ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో పాత్ర హీరో గారి కూతురు . బేబీ షాలిని బాగా నటించింది . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో సి నారాయణరెడ్డి , సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాసిన పాటలు శ్రావ్యంగా ఉంటాయి . జయమాలిని , అనూరాధల జాయింట్ డాన్స్ తోటలో షూట్ చేయబడింది . కోడి గారు అందంగా చిత్రీకరించారు . నేరం చేసిందెవరో అనే విషాద గీతం కూడా బాగుంటుంది .
బేబీ షాలిని మీద చిత్రీకరించబడిన బొమ్మల కొలువు పాట అమ్మలగన్నయమ్మ పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది . మిగిలిన రెండు డ్యూయెట్లు ఇద్దరు హీరోయిన్లకు చెరొకటి . మనసంతా ప్రేమ కళా , చెవులున్న గోడలు లేవు అంటూ సాగుతాయి . పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , వాణీ జయరాం , శైలజలు పాడారు .
కళైమణి అనే తమిళ రచయిత ఈ కధను వ్రాసారు . పరుచూరి బ్రదర్స్ డైలాగుల్ని వదిలారు . బాగుంటాయి . తమిళంలో తీసిన శిరై పరవై సినిమాను ఇలా తెలుగులో రీమేక్ చేశారు… హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉందని విజయకాంత్ నసిగితే అతనికి మరి కొన్ని సీన్లు జోడించి తీసారట . రాధిక , బేబీ షాలిని తమ పాత్రల్ని తామే వేసారు .
సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూడనివారు తప్పక చూడవచ్చు . మంచి కాలక్షేపం సినిమాయే . శోభన్ బాబు అభిమానులు మళ్ళా చూడవచ్చు . ఎక్కడా బోర్ కొట్టకుండా మధురవాణి చూసుకుంటుంది . ఆ పేరే పేరు . గురజాడ గారిది కదా ! #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
ఈ సినిమా రివ్యూతో సంబంధం లేదు గానీ… నిన్న రాధిక తల్లి మరణించింది… ఇదీ ఆ వార్త…
Share this Article