తలుచుకుంటేనే చివుక్కుమంటోంది… ఒక గర్భిణి ప్రసవం కోసం నాలుగైదు హాస్పిటళ్ల చుట్టూ తిరిగి తిరిగీ కన్నుమూయడాన్ని విధిప్రేరేపితంగా భావించాలా..? వ్యవస్థ వైఫల్యం అనుకోవాలా..? ఆ మరణం అలా తన్నుకొచ్చిందిలే అని నాలుగు విరక్తి మాటలతో సమర్థించుకోవాలా..? అసలు అది కాదు… మరణించాక శ్మశానంలో అంత్యక్రియలకూ అకారణ, అనూహ్య కొర్రీలు ఎదురొచ్చి, ఓ రాత్రంతా శవజాగారం చేసి, తెల్లారి మళ్లీ వాళ్లనూ వీళ్లనూ బతిమిలాడి… ఓ ప్రభుత్వ హాస్పిటల్లో తల్లినిబిడ్డనూ వేరుచేశాక గానీ అంత్యక్రియలు జరక్కపోవడం కదిలించి వేస్తున్నది… ఒక రోజంతా బతుకు కోసం పోరాటం, శ్రమ, ప్రయాస, ఖర్చు, ఆయాసం… తీరా ఆ తల్లి, కడుపులో బిడ్డ కూడా మరణించినా, గౌరవంగా పైలోకాలకు పంపించడానికీ అదే శ్రమ, అదే ప్రయాస, అదే యాతన, అదే మానసిక వేదన…. ఆ వార్త చదవలేదా..? ఇదుగో లింకు… ఆ తరువాత కాస్త చెప్పుకుందాం…
చదువుతుంటేనే కడుపు తరుక్కుపోయే ఈనాడు వార్త..! ఐనా ఎవరికి పట్టిందిలే..!!
Ads
ఇక్కడ కొన్ని ప్రశ్నలు… చాలా తరాలుగా కడుపుతో ఉన్న మహిళను దహనం చేయరు… దాదాపుగా అన్ని శ్మశానవాటికల్లోనూ పాటించేదే… ఈ కరోనా విపత్తువేళ కూడా ఇలాంటి యాతన అవసరమా..? అలాంటి పాత మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడాలా అనేది వేరే చర్చ… అయితే అలాంటి మహిళల్ని ఎందుకు దహనం చేయరు..? కడుపులో నుంచి బిడ్డ బయటికి వస్తేనే దాన్ని ప్రాణిగా లెక్కించాలా..? కడుపులో ఉన్నప్పుడు కూడా మరో మనిషిగా భావించాలా..? ఇదీ కీలకప్రశ్న… మొన్నటి నుంచీ వేధిస్తున్నది… అపరకర్మల మీద కాస్త అవగాహన ఉన్నవాళ్లను కొంతమందిని అడిగినా పూర్తి స్థాయి సమాధానం దొరకలేదు… ఇంకా ఎవరైనా సరైన వివరణ ఇవ్వగలరేమో చూడాలి… నిజానికి ఎందుకు మృత గర్భిణిని కాల్చరు అనే ప్రశ్నకు కొన్ని సమాధానాలు…
- బిడ్డ ఆరు నెలల వయస్సు దాటాక ఓ రూపం సంతరించుకుంటుంది… తల్లి కడుపులోనే కదులుతూ కొన్ని విషయాల్ని అర్థం చేసుకోగలదు… అందుకని కడుపులోనే ఉన్నా సరే, ఒక విడి ప్రాణిగా పరిగణించాలి…
- ఈ పావని కేసులో ఆమె నిండు గర్భిణి, పురుటి నొప్పులు పడుతున్నప్పుడే ఈ విషాదం సంభవించింది… అందుకని తల్లిని బిడ్డను వేర్వేరు ప్రాణులుగా చూడాలి అని ఓ సమాధానం…
- పెళ్లయిన మహిళ కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం (కొన్ని కుటుంబాల్లో ఖననం కూడా ఉంటుంది) దహనం చేయాలి… కానీ బిడ్డను ఖననం చేయాలి… అందుకని విడదీసే అంత్యక్రియలు నిర్వహించాలనేది ఆ శ్మశాన నిర్వాహకుల అభిప్రాయం… అందుకే తల్లినీ బిడ్డను వేరు చేశాక ఆమెను దహనం చేశారు, బిడ్డను ఖననం చేశారు అనేది ఓ వివరణ…
- కొన్నిసార్లు తల్లి మరణించినా, లోపల కడుపులో బిడ్డ బతికే ఉంటుంది కాబట్టి… నిర్ధారణ కావాలంటే తల్లినీబిడ్డను వేరుచేసి చూడాలనేది మరో సమాధానం… అందుకే కడుపులో ఉన్న నెలల బిడ్డను తల్లితోపాటు దహనం చేయకూడదు అని ఆ వివరణ…
- ఈ కేసులో కడుపులో బిడ్డ కూడా మరణించింది కాబట్టి, తల్లితోపాటు దహనం చేస్తే ఏమవుతుంది..? మామూలు రోజులు వేరు… ఈ మహావిపత్తు వేళ ఇంకా ఆ కుటుంబసభ్యులను ఈ అనవసర సంప్రదాయాలతో యాతనకు గురిచేయాలా..? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం కష్టం… కష్టం…!!
Share this Article