.
రాష్ట్ర విభజన తరువాత… దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత… ఏం జరిగింది..? కేసీయార్ అరాచక, నియంత పాలనలో చిక్కుకుని మరింత విలవిలలాడిపోయింది… తను ఏది అనుకుంటే అదే రాజ్యాంగం… తను ఏది చెబితే అది శాసనం… మగ శివగామి…
ఆర్థికంగా అస్తవ్యస్త నిర్వహణ… గందరగోళం… అయోమయం… కల్లోలం… ఆర్థిక క్రమశిక్షణ వీసమెత్తు కనిపించని కాలం… అలవిమాలిన అప్పులు… బడ్జెట్లు మొత్తం జీతభత్యాలు, వృథాఖర్చులు, రుణ నిర్వహణ తాలూకు చెల్లింపులు, వడ్డీలు… తొమ్మిదేళ్ల పాలనలో తన ప్రధాన దృష్టి పూర్తిగా ఆ కమీషన్ల, అక్రమాల కాళేశ్వరంపైనే… అదీ ఇప్పుడు మెడలు విరిగింది… అదిప్పుడు తన మెడకే పడింది…
Ads
స్థూలంగా చెప్పాలంటే ఇదే… ఎవరో చెబుతున్నది కాదు ఇదంతా… కాంగ్రెసో, బీజేపీయో కాదు… సాక్షాత్తూ కాగ్ సాధికారంగా చెబుతోంది… తొమ్మిదేళ్ల కాలానికి (2014- 23) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ (కేసీయార్ పాలన) నిర్వాకాలను క్రోడీకరించింది… దీనిపై ‘ముచ్చట’ స్పెషల్ విశ్లేషణ ఇదుగో…
ముందుగా పాఠకుల అవగాహన కోసం… కేపిటల్ వ్యయం అంటే ప్రాజెక్టులు, కట్టడాలు, ప్రజోపయోగం కోసం నాలుగు కాలాలపాటు నిలబడే నిర్మాణాలకు పెట్టే ఖర్చు… అంటే రాష్ట్రానికి ఉపయుక్తం… రెవిన్యూ వ్యయం అంటే జీతభత్యాలు, ప్రభుత్వ పాలన వ్యయం, వడ్డీలు, రుణచెల్లింపులు ఎట్సెట్రా… ఇక పదండి…
1. తొమ్మిదేండ్లలో జరిగిన కేపిటల్ వ్యయం కేవలం రూ.2.55 లక్షల కోట్లు… కానీ రెవిన్యూ వ్యయం ఏకంగా 9.12 లక్షల కోట్లు… అంటే అర్థమవుతోంది కదా… మన బడ్జెట్లు, మన ఆర్థిక నిర్వహణ ఎంత డొల్లగా, ఎంత ప్రజా నిష్ప్రయోజనకరంగా సాగిందో..!!
2. ఆ అతి తక్కువ కేపిటల్ వ్యయంలో కూడా ఇరిగేషన్ వ్యయం లక్ష కోట్లు… అదీ ఎక్కువగా కాళేశ్వరానికే… సీతారామ, పాలమూరు కాసింత… అంతే, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద, పెండింగ్ ప్రాజెక్టుల మీద శీతకన్ను…
3. వాటర్ సప్లయి మీద ఖర్చు చూడటానికి భారీగా కనిపిస్తోంది కదా… 38 వేల కోట్లు, అందులో ప్రధాన వాటా మిషన్ భగీరథ… ఎనర్జీ ఖర్చు 21 వేల కోట్ల ఖర్చు చూపిస్తున్నారు కదా… పవర్ ప్రాజెక్టులు, కారిడార్ ఎట్సెట్రా… దాంతో సమకూరిన అదనపు విద్యుత్తు సామర్థ్యం చాలా తక్కువ…
4. హౌజింగు 13 వేల కోట్ల ఖర్చు కనిపిస్తోంది కదా… తెల్లారిలేస్తే డబుల్ బెడ్రూం అని పదే పదే ఊరించిన పద్దులో మొత్తం 9 ఏళ్లలో పెట్టిన ఖర్చు ఆమాత్రమే… డాంబిక ప్రచారం తప్ప పథకం ఆచరణ అంతంతమాత్రం…
కాళేశ్వరం తప్ప మరేదీ కనిపించని కారణంగా… నిధులన్నీ అటే మళ్లించడం వల్ల… ఆ ప్రభావం ఇతర రంగాలపై పడింది… విద్య, వైద్యం వంటివి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. తొమ్మిదేండ్లలో కేవలం రూ.2550 కోట్లు మాత్రమే విద్య మీద ఖర్చు పెట్టారు… విద్యా మౌలిక వసతులను అసలు పట్టించుకోలేదు… అదే వ్యవధిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కొత్త పాఠశాలలు, విద్యా సంస్థల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి…
వైద్యారోగ్య మౌలిక వసతులు కల్పించటంలోనూ తెలంగాణ వెనుకబడింది… ఏటా రూ.5 వేల కోట్లు జీతాలు, నిర్వహణకు ఖర్చు పెడితే.. వైద్యం మీద కనీసం ఏడాదికి రూ.700 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు… తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కొత్త ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించడంలో ముందు వరుసలో ఉంటే తెలంగాణ పూర్తిగా వెనుకబడింది…
చివరకు ఆహా ఓహో అని డప్పు కొట్టుకున్న గురుకులాలకు కూడా సొంత భవనాలు కట్టాలనే సోయి లేకుండా పోయింది కేసీయార్ ప్రభుత్వానికి..! గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు పరిశ్రమల ప్రోత్సాహానికి భారీగా ఖర్చుపెట్టి ఉద్యోగాలు కల్పించాయి. తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడులపై పోకస్ తగ్గింది… చివరకు నిజాం సుగర్స్, రేయాన్స్ ప్రస్తుత స్థితిగతులు, ఆ దురవస్థ చూస్తూనే ఉన్నాం కదా…
రవాణా మౌలిక వసతుల కల్పనలోనూ నిర్లక్ష్యమే… తెలంగాణ 9 ఏళ్లలో కేవలం ₹19,948 కోట్లు… ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రహదారులు, పోర్టులు, రవాణా లాజిస్టిక్స్ మీద భారీగా పెట్టుబడులు పెట్టాయి… అంటే భవిష్యత్తు ఉపయుక్త మౌలిక వసతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి…
ఓసారి రెవిన్యూ వ్యయం చూద్దాం… కేసీయార్ సర్కారు మన స్వరాష్ట్రంలో మానవవనరులను, సంక్షేమాన్ని, జీవన ప్రమాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడానికి ఈ రిపోర్టే సాక్ష్యం, నిర్దారణ కూడా…
1. తెలంగాణ ఖర్చులో 85% రెవెన్యూ వ్యయం మీదే… అంటే జీతాలు, సబ్సిడీలు, సంక్షేమం పైన ఎక్కువ, కొత్త ఆస్తుల సృష్టి పైన తక్కువ… సొంత పన్నులు, గనులు, భూముల అమ్మకాలపైనే ప్రభుత్వం ఆధారపడింది…
2. అబ్బే, మేం పెద్దగా అప్పులు చేయలేదు అని చెప్పేది కదా బీఆర్ఎస్… ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి… నిజం ఏమిటంటే… బడ్జెటరీ అప్పులే 3.56 లక్షల కోట్లు… దీనికి బడ్జెటేతర రుణాలు 1.98 లక్షల కోట్లు… అంటే మొత్తం 5.07 లక్షల కోట్లు… తెలంగాణ స్థాయికి మితిమీరిన అప్పులు… ధనిక రాష్ట్రాన్ని కాస్తా అప్పుల ఊబిలో పడేశాడు కేసీయార్…
తెలంగాణ ఏర్పడిన రోజు కేవలం రూ. 79880 కోట్లు ఉన్న అప్పు… 2023 మార్చి నాటికి రూ. 3,56,486 కోట్లకు, బడ్జెటేతర అప్పులూ కలిపితే మొత్తం 5.07 లక్షల కోట్లకు చేరింది… తొమ్మిదేండ్లలో క్యాపిటల్ ఖర్చుకు మించి నిర్వహణ ఖర్చులకు కూడా ప్రభుత్వం అప్పులు చేసిందని అర్థమవుతోంది… అదీ అసలు దురవస్థ…
3. రుణ చెల్లింపులు, వడ్డీలే తడిసిమోపెడు… అందుకే వడ్డీ తగ్గింపు, రుణాల రీషెడ్యూలింగు కోసం రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద, ఆర్థిక సంస్థల వద్ద నానా ప్రయాస పడాల్సి వస్తోంది… దీనికితోడు జీతభత్యాల భారం సరేసరి…
4. బడ్జెట్లో దాచిపెట్టేందుకు కార్పొరేషన్ల పేరిట చేసిన బడ్జెటేతర అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది… తొమ్మిదేండ్లలో బడ్జెటేతర అప్పులు, గ్యారంటీ రుణాలు రూ.1,98,244 కోట్లకు చేరింది… జీఎస్డీపీలో గ్యారంటీలు 10 శాతం మించకూడదనే నిబంధన ఉన్నా… తెలంగాణ తెచ్చిన గ్యారంటీ అప్పులు 15 శాతం దాటాయి…
స్థూలంగా…. మెడలు, నొగలు విరిగిన ఆ కాళేశ్వరమే తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన ఘనత…? నిజం… కేసీయార్ తొమ్మిదేళ్ల పాలన ఓ మేడిగడ్డ బరాజు వంటిదే… అంతిమంగా తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాపు, తెలంగాణ తాత తెలంగాణ స్వరాష్ట్రం మెడలు విరిచాడు… మొత్తం కాగ్ రిపోర్ట్ చదువుతూ ఉంటే ఇదే స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది… ఇంకా తవ్వితే బోలెడు పెంకాసులు… ఈ వివరాలు చాలు కదా… కేసీయార్ తెలంగాణను ఎటువైపు తీసుకుపోయాడో..!!
Share this Article