Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో బాలు ఇక పుట్టడు… ఘనగాయకుడు బాలుకు ఇదే అతిగొప్ప నివాళి…

September 25, 2025 by M S R

.
Rochish Mon …….  ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం; గానానికి ఒక ప్రత్యేకమైన పరిణామం
——————————-
ఇవాళ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి.
భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన చలనచిత్ర నేపథ్య గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. దేశ సినిమాలో బాలు స్థాయి ప్రతిభావంతమైన గాయకుడు ఇంత వరకూ రాలేదు! ఇకపై…?

ఒక ప్రేయసికి ఒక ప్రియుడు ఏమౌతాడో , ఒక ప్రియుడికి ఒక ప్రేయసి‌ ఏమౌతుందో ఎస్.పీ.‌ బాలసుబ్రహ్మణ్యం సినిమాగానానికి అదవుతారు!‌సినిమా‌ గానానికి యవ్వనం‌ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం‌.‌

వివిధ భాషల్లో వేనవేల‌ పాటలు‌ పాడిన‌ ఎస్.పీ.బీ. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో “ఏమి ఈ వింత మోహం…” ‌పాటను తన తొలి పాటగా పాడారు. ఆ‌ పాటలో సహ‌గాయకులైన పీ.బీ. శ్రీనివాస్ “అప్పుడే ఇతను గొప్ప గాయకుడు‌ అవుతాడనుకున్నాను ఇప్పుడు ఇంకా ఎంతో గొప్పగాయకుడై పోయాడు” అని నాతో చాలాసార్లు అన్నారు.

Ads

దేశం ఆశ్చర్యపడినంత గొప్ప‌ గాయకుడై రాణించారు ఎస్.పీ.బీ. అవును, మన దేశంలో అందరికన్నా ప్రతిభావంతమైన సినిమా గాయకుడు ఎస్.పీ.బీ. ఆయనకున్నంత‌ గాన ప్రతిభ‌ ఉన్న సినిమా‌ గాయకుడు మనదేశంలో‌ మఱొకరు లేరు. Vocal power అని గాయకుడు హరిహరన్ ఆయన్ను అన్నారు. “ప్రయత్నిస్తే నాలా బాలు పాడగలడు‌ కానీ నేను‌ బాలూలా పాడలేను” అని బాలమురళీకృష్ణ ఆన్నారు.

ఎస్.పీ.బీ.కి తొలిదశ హిట్స్ తమిళ్ష్‌లో వచ్చాయి. 1969లో‌ వచ్చిన‌ “ఇయర్కై ఎన్నుమ్ ఇళైయకన్ని…” (సినిమా‌ శాంతినిలయం), “ఆయిరమ్ నిలవే వా…” ‌(సినిమా‌ అడిమై‌పెణ్) అన్న రెండు గొప్ప హిట్ పాటలతో మంచి గాయకుడని పేరు‌ తెచ్చుకున్నారు ఆయన.

ఆ పాటల్లో ఆయన గానం చాల బావుంటుంది. ఒక పరిణతి ఉన్న గాయకుడి‌ గానంలా ఉంటుంది. ఆయిరమ్ నిలవేవా పాట డబ్బింగ్ పాటగా తెలుగులో ఘంటసాల పాడారు. తమిళ్ష్‌లో బాలు పాడింది విన్నాక తెలుగులో వింటే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగు నటులకన్నా ఎంతో ముందే తమిళ్ష్ ప్రముఖ నటులు ఎమ్.జి. రామచంద్రన్, శివాజీ గణేస(శ)న్ వంటివాళ్లు బాలు గొప్పతనాన్ని గుర్తించి కోరుకుని మరీ ఆయనతో తమకు పాటలు పాడించుకున్నారు.

ఘంటసాలను కాకుండా మొహమ్మద్ రఫీ, పీ.బీ. శ్రీనివాస్ ఈ ఇద్దరినీ ఆదర్శంగా తీసుకున్నారు ఎస్.పీ.బీ. ఇది సరైంది. ఇక్కడే ఎస్.పీ.బీ. గొప్పతనం మనకు తెలియవస్తోంది. ఒక కళాకారుడికి ఉండాల్సిన సరైన పరిశీలనతో, అవగాహనతో ఘంటసాలను ఆయన ఆదర్శంగా తీసుకోకపోవడం వల్ల ఆయనకే కాదు సినిమా పాటకు కూడా ఒక ఔజ్జ్వల్యం వచ్చింది.

సుఖదుఃఖాలు సినిమాలో “మేడంటే మేడాకాదు…” పాట ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఘంటసాలను దాటి‌ ఆలోచించగలగడం ఎస్.పీ.బీ. గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. అదే ఆయన సాధించిన ఇంత పెద్ద గాన‌ విజయానికి కారణం.

  • ఘంటసాలను ఆదర్శంగా తీసుకుని ఉంటే బాలు విఫలమై ఉండేవారు. (ఎమ్.ఎమ్. రాజా, పీ.బీ.శ్రీనివాస్ ఇలా ఎవరూ ఘంటసాలను ఆదర్శంగా తీసుకోలేదు! ఘంటసాలను ఆదర్శంగా తీసుకున్న రామకృష్ణ రాణించలేదు)

“మేడంటే మేడా…” కాదు పాటలో ఎస్.పీ.బీ. గానంలో ‘స్వర సమం’ అన్న అంశం కనిపిస్తుంది. బహుశా ఆ‌‌ అంశం సహజంగా అమరి ఉంటుంది. గానంలో‌ భావం మాత్రమే‌‌ కాదు మనోధర్మం (mood) కూడా ఉండాలి.‌‌‌ ముఖ్యంగా సినిమాకు ఇది‌ అవసరం‌.‌ భావం, మనోధర్మం ఈ రెండిటితోనూ ఎస్.పీ.బీ.‌ఎన్నో‌ గొప్ప‌ పాటలు పాడారు.

పంతులమ్మ చిత్రంలో ఆయన పాడిన “మానసవీణ మధుగీతం…” , “ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా…” పాటలను ఇందుకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఏకవీర‌ సినిమాలో‌ “ప్రతి రాత్రి వసంత రాత్రి…”, మంచి మిత్రులు సినిమాలో “ఎన్నాళ్లో వేచిన‌ ఉదయం…” పాటల్లో ఘంటసాల కన్నా బాలు గానమే మేలైంది. ఘంటసాలలో లేని స్వర సమం, spirit, verve, word throw ఈ అంశాలవల్ల ఆయన గానం ఆ పాటల్లో గొప్పగా అమరింది.

మొహమ్మద్ రఫీ‌ తరువాత‌ మన దేశంలో గాత్రంలో గొప్ప spirit ఉన్న‌ గాయకుడు ఎస్.పీ.బీ. Animated singing బాలుది. గాయకుడు మన్నాడే పాడడం అంటే గొప్పగా పాడడమే. మన్నాడే కన్నా గొప్పగా పాడడమంటే‌ మాటలు కాదు. అలాంటిది “స్నేహమేరా‌ జీవితం…” పాటను‌ హిందీలో‌ పాడిన‌ మన్నాడే కన్నా ఎస్.పీ.బీ.‌‌ గొప్పగా‌‌‌ పాడారు.

బాలు గాత్రం, గానం చాలా emotive. సాహిత్యాన్ని భావయుక్తంగానూ, మనోధర్మంతోనూ పాడడం ఆయనకు వెన్నతో పెట్టిన‌ విద్య. “నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా…”, “కలువకు చంద్రుడు‌ ఎంతో దూరం…” వంటి పాటల్లో మనకు‌ ఈ విషయం తెలుస్తుంది.

ఎస్.పీ.బీ. ప్రతిభను దృష్టిలో పెట్టుకుని‌ తమిళ్ష్‌లో ఎమ్.ఎస్.‌ విశ్వనాద(థ)న్ ఎన్నో గొప్ప పాటలను చేశారు. ముఖ్యంగా పట్టిన ప్రవేశం అన్న సినిమాలో “వాన్ నిలా నిలా అల్ల…” పాటను‌ చెప్పుకోవచ్చు. దర్శకుడు కె. బాలచందర్, ఎమ్.ఎస్. విశ్వనాదన్ కలయికలో ఎస్.పీ.బీ. ఎన్నో గొప్ప‌ పాటలు పాడారు.

కంబన్ ఏమాన్దాన్…”, “ఇలక్కణమ్ మారుదో…” పాటలు మహోన్నతమైనవి. తెలుగుకూ‌ తెలిసిన‌ ఇది కథకాదు, అందమైన అనుభవం, 47 రోజులు సినిమాల్లోని పాటలు‌‌ ఎస్.పీ.బీ.‌ ఉన్నారన్న‌‌ ధైర్యంతో‌‌ చేసిన‌ పాటలే.

సంగీత దర్శకులు సత్యం, చక్రవర్తి, రమేశ్ నాయుడు వంటి‌ సంగీత దర్శకుల పాటలకు‌ ప్రాణం పోశారు ఎస్.పీ.బీ.‌ పెద్దగా తెలియరాని చంద్రశేఖర్, శివాజీ రాజా వంటి సంగీత దర్శకులకూ “నా కొడకో బంగారు తండ్రీ…”, “నీలి మేఘాలలోన నీతో నేనుండి పోనా…” వంటి పాటల్లో గొప్ప గానం చేశారు ఎస్.పీ.బీ.

ప్రేమాభిషేకం సినిమా పాటలు ఆయన పాడకపోతే ఏమయ్యేవో? మల్లెపూవు సినిమాలో ఆయన చాల గొప్ప గానం చేశారు. “ఎవ్వరో ఎవ్వరో …” అన్న పాట‌ను బాలు ఎంతో‌ గొప్పగా పాడారు. కృష్ణ నటించిన దేవదాసు‌ సినిమా పాటల్ని ఎస్.పీ.బీ. చాల గొప్పగా పాడారు. అందులో “కల చెదిరింది కథ మారింది…” చాల గొప్ప గానం.

ఇళైయరాజా వచ్చాక ఎస్.పీ.బీ. ఇళైయరాజాల కలయికతో తమిళ్ష్, తెలుగు, కన్నడ సినిమా పాటల్లో ఒక్కసారిగా కొత్త‌ అందాలు, కొత్త ప్రమాణాలు, కొత్త పరిణామాలు విరిశాయి. ఈ ఇద్దరి వల్ల దక్షిణాది సినిమా పాటలకు యవ్వనం వచ్చింది; వసంతం వచ్చింది. అభిలాష సినిమా పాటలలో ఈ యవ్వనాన్ని మనం చూడచ్చు. “నెలరాజా పరిగిడకు చెలి వేచే నా కొరకు…”, “ఇలాగే‌ ఇలాగే సరాగమాడితే…” వంటి‌ melodious and mood oriented పాటల్ని ఎస్.పీ.బీ. ఉండబట్టే ఇళైయరాజా చెయ్యగలిగారు.

శంకరాభరణం… శంకరాభరణం సినిమాలోని ఎస్.పీ.బీ.‌ గానం ప్రాంత, భాష, దేశ ఎల్లల్ని దాటి విశ్వ జనరంజకమైంది. ఆ గానం ఒక చరిత్ర అయింది. ఆ సినిమాలో ఎస్.పీ.బీ. పాడిన‌ “శంకరా నాద శరీరా పరా…” ఒక‌ emotive wonder. ఆ‌ సినిమాలో ఏ పాటకు ఆ‌ పాటే సాటి. శంకర‌శాస్త్రి‌‌ పాత్రకు పాడిన ఎస్.పీ.బీ. “ఆమని కోయిల‌ ఇలా…” అంటూ ఒక యువ పాత్రకు పాడడం‌ ఆయనేమిటో మనకు తెలియజేస్తుంది.

బాలు పాడిన హిందీ‌ సినిమా ఏక్ దూజే కే లియే సినిమా పాటలు ఉత్తరాదిలో‌ వాడవాడలా మార్మోగిపోయాయి. ఇంకా హిందీలో నొ(నౌ)షాద్, అర్.డీ.బర్మన్,‌ బప్పీ‌ లహరి, నదీమ్ శ్రవన్ లక్ష్మీకాంత్- ప్యారేలాల్ వంటి‌ సంగీత‌ దర్శకులకు ఎన్నో మంచి పాటలు పాడారు ఎస్.పీ.బీ.

ఒక పాట రికార్డింగ్ సందర్భంలో సంగీత దర్శకుడు నౌషాద్, బాలు ప్రతిభకు ఆశ్చర్య‌పోయారట.‌ సంగీత దర్శకుడు ఒ.పీ. నయ్యర్ “రఫీ తరువాత‌‌ దేశంలో ఎస్.పీ.బీ. మాత్రమే గొప్ప గాయకుడు” అన్నారు.
నటులకు తగ్గట్టుగా‌ నటుల గొంతుల్ని అనుకరిస్తూ పాడడంలో‌ ఎస్.పీ.బీ.కి‌ సాటిరాగల వారు ఇంకోకరు లేరు.

తమిళ్ష్‌లో టీ.ఎమ్.‌ సౌందరరాజన్ కొందరు నటుల్ని అనుకరిస్తూ పాడారు. కానీ ఎస్.పీ.బీ. ఈ పనిని తన ప్రతిభతో అనితరసాధ్యమైన స్థాయిలో చేశారు. ఆడ గొంతుతోనూ, పేడి గొంతుతోనూ కూడా కొన్ని పాటలు పాడారు.

మరే గాయకుడూ ఎస్.పీ.బీ. అనుకరించినన్ని గొంతుల్ని అనుకరించలేదు. ఒకే పాటలో రామారావు, నాగేశ్వరరావులను, కృష్ణ , శోభన్‌బాబులను అనుకరిస్తూ‌‌ పాడిన పాటలున్నాయి. రాజాధిరాజు సినిమాలో విజయచందర్‌ను, నూతన్‌ప్రసాద్‌ను‌‌ అనుకరిస్తూ బాలు పాడిన‌‌ విధానం ఆశ్చర్యాన్నిస్తుంది.

రామారావు వంటి‌ వారికి పురుష గాత్రంతో పాడిన బాలు మాడా, అల్లు రామలింగయ్య, సుత్తి వేలు వంటి‌ వారికి కూడా పాడారు. సహజంగా tenor-timbre ఎస్.పీ.బీ.ది. “సువ్వీ‌ సువ్వీ సువ్వాలమ్మ… ” పాటలో‌ ఆయన మంద్రస్థాయిలో మొదలు పెట్టి పాడడం గొప్పగా‌ ఉంటుంది.

యుగళ గీతాలలో గాయనీమణులు ఆయనకన్నా బాగా పాడడం అన్నది ఎప్పుడూ జరగలేదేమో? ఇంత పెద్ద‌ గాన‌‌ జీవితం‌‌ ఉన్న గాయకుడు ఇంకెవరూ లేరు మన దేశంలో.‌ బాలు పాడినన్ని సినిమా పాటలు ప్రపంచంలో ఇంకెవరూ పాడలేదు.

శివస్తుతి బాలు భక్తి‌గానంలో ఓ కలికితురాయి. తమిళ్ష్‌లో కణ్ణదాసన్ రాసి, ఎమ్.ఎస్. విశ్వనాదన్ సంగీతం చేసిన కృష్ణుడి పాటలు కలకాలం నిలిచి‌ ఉండే పాటలు.

కవి ఆత్రేయ ఒకసారి అన్నారు ” బాలు ఫీల్‌తో పాడతాడు‌ ఇతరులు పాడడానికి ఫీల్ అవుతారు” అని. అవును Balu himself is a singing-feel and he himself is a feel of singing. S.P. B. is an enrichment of singing- excellence.

ఎస్.పీ.బీ. ఒక‌‌ ప్రతిభావంతమైన సంగీత దర్శకుడు కూడా. మయూరి‌‌ చిత్రంలో గొప్ప పాటలు చేశారు.
తమిళ్ష్‌లో సిగరం‌ సినిమాలో గొప్ప పాటలు స్వరపఱిచారు.

బాలు ఒక గొప్ప డబ్బింగ్ కళాకారుడు కూడా కదా!
బాలు ఒక గొప్ప నటుడు.‌ తమిళ్ష్ సిగరం, తెలుగు పవిత్ర బంధం,‌‌ మిథునం ఇలా కొన్ని‌ సినిమాల్లో అత్యంత గొప్ప నటనను ప్రదర్శించారు.
ఎస్.పీ.బీ. పాడి‌ ఉండకపోతే సినిమా గానంలో ఎప్పటికీ ఒక లోటు ఉంటూనే ఉండేదేమో? ఎస్.పీ. బీ. పాడినందువల్లే సినిమా గానం పరిపుష్టమయిందేమో?

దేశ సినిమా గానానికి బాలు ఒక‌ అనూహ్యమైన పరిణామం; బాలు గానం ఒక చారిత్రిక సంఘటన.‌
ఎన్నని చెప్పుకోవాలి? ఎంతని చెప్పుకోవాలి ఎస్.పీ.‌ బాలసుబ్రహ్మణ్యం గుఱించి‌? ఎన్నైనా చెప్పుకోవచ్చు , ఎంతైనా‌ చెప్పుకొవచ్చు…
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం సినిమా‌ గాన‌ం పరంగా మ‌న దేశానికి ఒక వరం.
Balu, a boon and boost to the film singing!
మన దేశంలో ఎస్.పీ.‌ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రతిభ‌ ఉండే గాయకుడు మఱోసారి‌ పుట్టరు. సినిమా‌లకు సంబంధించినంత వఱకూ గాన అద్భుతం ఈ శ్రీపతి పండితారాధ్యూల‌ బాలసుబ్రహ్మణ్యం‌!
*** ***

#

Aestheticగా ఎస్.పీ.బీ. కన్నా మొహమ్మద్ రఫీ, పీ.బీ. శ్రీనివాస్ వంటి వారు ఉన్నతంగా పాడారు. ఆయనకు
ముందు ఘంటసాల, మన్నాడే వంటి గొప్పగాయకులు ఉన్నారు. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రతిభ పరంగా అందఱి కన్నా మెఱుగైన వారు.
#
రఫీలోని verve, పీ.బీ. శ్రీనివాస్ లోని attitude రెండిటి సమ్మిళితం ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గానం.
#
ఘంటసాల గొప్పగాయకుడుగా చలామణిలో ఉన్న సమయంలో వచ్చి ఘంటసాలను ఆదర్శంగా తీసుకోకుండా పీ.బీ. శ్రీనివాస్‌ను రఫీని పుణికిపుచ్చుకోవడం ఎస్.పీ.బీ. గొప్పతనం. అదే ఆయన్ను గొప్ప గాయకుణ్ణి చేసింది. తొలిదశలో ఆయన తమిళ్ష్‌లో పాడిన పాటలపై పీ.బీ. శ్రీనివాస్ ప్రభావం తెలుస్తూంటుంది. ముఖ్యంగా బాలు నాదం పట్టడం, నాద సహజత్వం పీ.బీ. శ్రీనివాస్ నుంచి గ్రహించినదే.
#
ఒ.పీ. నయ్యర్ రఫీ తరువాత మన దేశంలో బాలునే గొప్ప గాయకుడు అని ఆంతరంగీక సంభాషణల్లో తన మాటగా చెప్పారు.
#
బాలు లేకపోయి ఉంటే ముఖ్యంగా దక్షిణాది సినిమా పాటలో కొన్ని పరిణామాలు వచ్చేవి కావు. ఇళైయరాజా చూపిన కొత్త పరిణామాలకు బాలు ఊపిరి. బాలు ఉన్నారు కనుకనే ఇళైయరాజా, ఎమ్.ఎస్. విశ్వనాదన్ వంటి వారు కొన్ని అద్భుతాల్ని ఆలోచించి అమలు పఱచగలిగారు.
#
గాయకుల్లో రఫీలోనూ, పీ.బీ. శ్రీనివాస్‌లోనూ ఉండే స్వర సమం బాలులో‌ మాత్రమే మనకు తెలుస్తూంటుంది.
#
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రతిభపై పరిశోధన జరగాల్సి ఉంది.‌ ఒక గొప్ప గాయకుడుగా ప్రశస్తి పొందినా ఆయన గొప్పతనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోబడలేదు.
#
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పేరును ఆయన వసించిన వీధికి తమిళ్ష్ నాడు ప్రభుత్వం పెట్టింది.
కర్ణాటకలో ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పేరుతో రాస్తా ఉంది.
తెలుగువాళ్లం మనం సంతోషించాల్సిన విషయం ఇది.

మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం పేరు ఏ ఊళ్లోనైనా ఏ వీధికైనా ఉందా? పోనీ భవిష్యత్తులోనైనా మన ప్రజలు, ప్రభుత్వాలు ఆ పని చేస్తాయా?
తెలుగు వాళ్లం మనం సిగ్గుపడాల్సిన విషయం కాదా?
#
2025లోనైనా ఘంటసాల కన్నా బాలు గొప్ప గాయకుడు అని గ్రహించడం
తెలివిడి. మధ్యతరగతి మాంద్యం, జాడ్యం వీటికి అతీతంగా ఆ తెలివిడి తెలుగుకు పూర్తిగా రావాలి. ఘంటసాల కన్నా బాలు గొప్ప గాయకుడు అవడంవల్ల ఘంటసాల గొప్ప వారు కాదు అని అర్థం కాదు; ఘంటసాల గొప్పతనానికి భంగం వాటిల్లదు.

సరైన అవగాహన, పరిశీలన ఉన్న ఎవరికైనా బాలు గొప్పతనం తెలుస్తుంది. పాత అభిరుచులు, పాత అభిప్రాయాలు విషయం వివేచన పరంగా పనికిరావు. తెలుగు మధ్యతరగతి అభిప్రాయాలకు అతీతమైన గాయకుడు బాలు; బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు.
#

  • తమిళ్ష్‌లోనూ, కన్నడంలోనూ ఉన్న సాయిలో అభిమాన వర్గం, పరిగణన, ప్రాశస్త్యం బాలుకు తెలుగులో లేకపోవడానికి కారణం తెలుగు మధ్యతరగతి మాంద్యమే, జాడ్యమే. తెలుగు అభిజ్ఞ వర్గం ఘంటసాలలో కూరుకునిపోయి ఉండడంవల్లే ఎస్.పీ.బీ. గాన ప్రతిభకు ఇతర భాషల్లోనూ, దేశ వ్యాప్తంగానూ వచ్చిన గౌరవం, మన్నన తెలుగులో రాలేదు.

#
గజల్ గానంలో గులాం అలీ ఒక ప్రత్యేకమైన పరిణామం. అదే విధంగా భారతదేశ చలనచిత్ర నేపథ్య గానానికి ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేకమైన పార్శ్వం; ఒక పరిపుష్టమైన పరిణామం.
రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions