.
నన్ను గ్రేస్ అని పిలుస్తారు… నా వయసు 72… నేను 42 ఏళ్లుగా సెయింట్ లూక్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేశాను… 173 మంది బిడ్డలను ఈ లోకంలోకి తీసుకురావడానికి సహాయం చేశాను… ఒంటరిగా చనిపోయిన ప్రతి రోగి చేతిని పట్టుకున్నాను… ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యాను…
కానీ నేను ఇంకా హాస్పిటల్‌కు వెళ్తాను…
Ads
స్టాఫ్‌గా కాదు… సందర్శకురాలిగా కాదు…
నేను మూడో అంతస్తులో, ఎలివేటర్ పక్కన కూర్చునే ఈ మామూలు మహిళగానే వెళ్తాను…
ప్రతి మంగళవారం, గురువారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు, కాఫీ బండి దగ్గర ఉన్న అదే నీలం కుర్చీలో కూర్చుంటాను… నా పాత కార్డిగాన్ (స్వెటర్ లాంటిది) వేసుకుంటాను… నా షూస్ మెత్తగా ఉంటాయి… నేను బిగ్గరగా మాట్లాడను…
నేను ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నానని ప్రజలు అనుకుంటారు…
నేను ఎవరి కోసమూ ఎదురు చూడడం లేదు…
నేను కేవలం… అక్కడ కూర్చుని ఉంటాను…
ఇది యాదృచ్ఛికంగా మొదలైంది… ఒక రోజు, నేను రిహాబిలిటేషన్‌లో ఉన్న మా మాజీ సహోద్యోగిని చూడటానికి వచ్చాను… ఆ తర్వాత అలసిపోయి, కాసేపు కూర్చున్నాను… నా పక్కన ఉన్న వృద్ధుడు ఒకరు తన కోటు చేతిలోకి తలదూర్చి నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు…
నేను ఎందుకు అని అడగలేదు… నా జేబులోంచి ఒక టిష్యూ ఇచ్చి, “చాలా కష్టమైన రోజులా ఉంది, కదూ?” అన్నాను…
ఆయన తల వూపారు. “వాళ్లు నాకు క్యాన్సర్ అని చెప్పారు… నా భార్యకు ఎలా చెప్పాలో తెలియడం లేదు,” అని అన్నారు…
మేమిద్దరం కూర్చున్నాం… తొందరపెట్టలేదు… సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు… కేవలం… అక్కడ అలా ఉండిపోయాం… నా పలకరింపులు, చూపుల్లోని సానుభూతి తనకు ఎక్కడో కనెక్టయ్యాయి…
పది నిమిషాల తర్వాత, ఆయన నవ్వారు… చిన్నగా… కానీ నిజాయితీగా… “ధన్యవాదాలు” అన్నారు… “నన్ను ఉత్సాహపరచడానికి, ఓదార్చడానికి మీరు ఏమీ ప్రయత్నించలేదు… కానీ నేను ఆ బాధను అనుభవించడానికి, మెల్లిగా బయటపడటానికి తగువిధంగా మీరు ఇలా సహకరించారు…”
ఆ విషయం నాతో ఉండిపోయింది…
కాబట్టి, ఆ తర్వాత వారం నేను మళ్లీ వచ్చాను… అదే కుర్చీ… అదే కార్డిగాన్…
మరుసటి వారం వచ్చాను…
ఆ తర్వాత కూడా వచ్చాను…
ఇప్పుడు, రెండు సంవత్సరాల తర్వాత, సిబ్బందికి నేను తెలుసు… నన్ను ఆపరు… సెక్యూరిటీ వారు చేయి ఊపి పలకరిస్తారు… కాఫీ అమ్మాయి నాకు టీ తీసుకొచ్చి ఇస్తుంది… “ఈ నిశ్శబ్ద దేవత కోసం” అంటుంది తను…
రోగులు నన్ను వెతుక్కుంటూ వస్తారు…
తల్లిదండ్రులు. తన కొడుకు ఆపరేషన్ గురించి భయపడుతున్న ఒక యువ తల్లి, నా పక్కన కూర్చుని, తన కొడుకుకి ఇష్టమైన కార్టూన్ల గురించి మాట్లాడుతుంది…
ఒక వృద్ధుడు తికమకపడి, తాను పనికి ఆలస్యం అయ్యానని అనుకుంటాడు… నేను “ఫర్వాలేదు, మీ అమ్మాయికి కాల్ చేస్తాం” అని అంటాను…
కీమో తీసుకుంటున్న ఒక టీనేజ్ అమ్మాయి… హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటుంది, కానీ ఒక చెవి తెరిచే ఉంచుతుంది, అప్పుడు నేను ఒక మ్యాగజైన్ నుండి బిగ్గరగా చదువుతాను…
నేను సలహా ఇవ్వను…
“అంతా బాగానే ఉంటుంది,” అని నేను చెప్పను…
నేను కేవలం “నేను ఇక్కడ ఉన్నాను” “అది కష్టంగా ఉంది కదూ?” “మీరు మీ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు” అని మాత్రమే అంటాను…
ఒక చలికాలంలో, బిజినెస్ సూట్‌లో ఉన్న ఒక మహిళ హాలులో కుప్పకూలిపోయింది.., అది పానిక్ అటాక్… నేను ఆమె పక్కన మోకరిల్లి కూర్చున్నాను… నిదానంగా శ్వాస తీసుకోమని చెప్పాను… ఆమె వీపుపై చెయ్యి ఉంచాను… ఆమె లేవగలిగే వరకు నేను కదల్లేదు…
తర్వాత, ఆమె ఒక ఫ్లాస్క్‌తో తిరిగి వచ్చింది… “ఇది ఇంట్లో చేసిన సూప్” అంది… “నన్ను ఒక సమస్యలా చూడని మహిళ కోసం…” నేనెలా కాదనగలను…
పోయిన నెల, ఒక డాక్టర్ నన్ను ఆపారు… “గ్రేస్” అన్నారు, “మేము రోగి ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించాం… 60 మందికి పైగా మీ గురించి ప్రస్తావించారు… ‘సురక్షితం,’ ‘శాంతం,’ ‘చూస్తున్నారు’ వంటి పదాలు ఉపయోగించారు… మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాము…”
నేను వద్దన్నాను…
నాకు గర్వం ఉందని కాదు… కానీ ఇది అవార్డుల కోసం కాదు…
ఇది అక్కడ ఉండడం గురించి…
ఎందుకంటే ఆసుపత్రులు శరీరాలను నయం చేస్తాయి…
కానీ కొన్నిసార్లు, ప్రజలకు చాలా అవసరమైనది ఏమిటంటే, ఒక హాలులో కేవలం మూడు నిమిషాలు మాత్రమే అయినా, ఓదార్పుగా అనిపించడం…
నిన్న, వీల్‌చైర్‌లో ఉన్న ఒక చిన్న అబ్బాయి నా దగ్గరగా వెళ్లాడు… అతను భయపడినట్లు కనిపించాడు… నేను నవ్వాను… నా ఎరుపు స్కార్ఫ్‌ను పైకి ఎత్తి చూపించాను… “ఇదా?” అన్నాను… “ఇది మాయ… చెడ్డ రోజులను దూరం చేస్తుంది…”
అతను నవ్వాడు…
అతను వీల్‌చైర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు, అతని తల్లి పెదవులతో సైగ చేసింది,.. “వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుండి నవ్వడం ఇదే మొదటిసారి…”
ఆ రాత్రి, నేను ప్రతి వారం చేసేలా నా డైరీలో రాసుకున్నాను..,
చికిత్సకన్నా కొన్నిసార్లు, గొప్ప శ్రద్ధ సాయపడుతుంది… ఊరటనిస్తుంది, భరోసానిస్తుంది… పెద్ద పెద్ద మాటలూ అవసరం లేదు… మన బాధతో సహానుభూతి పొందే ఓ మనిషి పక్కన ఉన్నారనే భావన… మందులతో ఇవ్వబడని సాంత్వన కేవలం నాలాంటోళ్ల ‘ఉనికి’తో ఇవ్వబడుతుంది…”
ఇప్పుడు, ఇతర రిటైర్ అయిన నర్సులు కూడా వస్తున్నారు… ఒక మహిళ పీడియాట్రిక్స్ (పిల్లల విభాగం) దగ్గర కూర్చుంటుంది… మరొకరు ఐసీయూ దగ్గర చదువుతారు… మేము ప్లాన్ చేయము… మేము కేవలం అక్కడ ఉంటాం… అంతే…
వారు మమ్మల్ని “ది సిట్టింగ్ నర్సెస్” అని పిలుస్తారు… యూనిఫాం లేదు… జీతం లేదు… హోదాలు లేవు… కేవలం గుర్తుంచుకున్న హృదయాలు మాత్రమే… మాకు దక్కేది…
ఒక కష్టమైన క్షణంలో అత్యంత శక్తివంతమైన విషయం… వైద్యం కాదు… అది పక్కన ఉండే ఒక మనిషి… – మేరీ నెల్సన్ (Astonishing కథనం నుండి)
Share this Article