.
Mohammed Rafee...
సారీ అధ్యక్షా! మెట్టు దిగిన కామినేని శ్రీనివాస్!
చిరంజీవి గురించి తాను చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డ్ నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరిన కామినేని! సభలో అపార్ధాలకు దారి తీసిందని, బాలకృష్ణకు కోపం వచ్చిందని తన మాటలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం!
Ads
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే! మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి అసెంబ్లీలో! అసలే అది సినిమా నటులకు సంబంధించిన విషయం! ఒక్కోడికి టన్నుల కొద్దీ ఇగో ఉంటుంది! నంబర్ల పోటీ ఉంటుంది! ఒకడికి ఒకడు కత్తులు కడుపులో పెట్టుకుని కౌగిలించుకుంటూ ఉంటారు! సినిమాలో కన్నా నిజ జీవితంలో ఇంకా బాగా నటిస్తుంటారు!
కామినేని శ్రీనివాస్ మంచి వైద్యులు! కానీ, కాస్త కులాభిషేకం ఎక్కువ! రాజకీయాల్లో వున్నా రాజకీయం పెద్దగా తెలియదు! పార్క్ హయత్ లో తన కుల నాయకులను కలుస్తూ ఎప్పటికప్పుడు బ్రిడ్జ్ కట్టుకుంటూ ఉంటారు! సరే, అది ఆయన ఇష్టం!
కానీ, ఈ తెలుగు బీజేపీ నేత ఓ తేనె తుట్టెను కదిపారు! కందిరీగలు చుట్టుముట్టాయి! ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి! “సారీ అధ్యక్షా” అంటూ తన మాటలు ఇవాళ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే స్పీకర్ ను కోరారు!
అక్కడ ఉన్నది సమర సింహారెడ్డి! కోపం వచ్చినా ప్రేమ వచ్చినా కంట్రోల్ ఉండదు ఆయనకు! అసెంబ్లీ లో పెద్దగా తన వాయిస్ వినిపించని ఆయనకు కోపం నషాళానికి అంటింది! సుర్రు సుమ్ము అయిపోయింది! చేతులు చూపించి మరీ “ఎందుకన్నావ్” అంటూ గర్జించారు! పనిలో పనిగా జగన్ ను విమర్శించారు! నీకేం తెలుసు అంటూ కామినేనికి చెమటలు పట్టించారు!
పనిలో పనిగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ ను దునుమాడారు! అసలే కూటమి ప్రభుత్వం! మూడు కుంపట్లు! అయినా ఒకే కూర వండుకోవాలి! ఏమాత్రం తేడా వచ్చినా అధిష్టానం నుంచి టపటప మొట్టికాయలు పడుతుంటాయి! తట్టుకోవడం కష్టం!
పైగా మెగాస్టార్ కు కోపం వచ్చింది! ప్రతి విషయంలో ఆచి తూచి అడుగులు వేసే ఆయన ఈ విషయంలో ఇక్కడ లేకున్నా ఎక్కడి నుంచో ఆగమేఘాలపై స్పందించారు! అంత స్పందించాల్సిన విషయం అయితే కాదు! స్పందించినా అంత డిటైల్డ్ గా అసలు అవసరం లేదు!
దాన్ని ఎంత చక్కగా ఎడిట్ చేసుకుని సాక్షి అంత అందంగా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచురించుకుంది! తమ్ముడు, పైగా ఉప ముఖ్యమంత్రి! నోరు విప్పలేదు కానీ, కన్నెర్ర చేశారు! మరో వైపు నేరుగా నట సింహం ఉగ్రరూపం దాల్చాడు! ఇంకేముంది కామినేని మెట్టు దిగక తప్పలేదు! సారీ అధ్యక్షా అనక తప్పలేదు! బూమరాంగ్ అంటే ఇదే మరి! – డా. మహ్మద్ రఫీ
Share this Article