.
నిన్న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా… టూరిజం కాన్‌క్లేవ్ – 2025 పేరిట ఓ కార్యక్రమం జరిగింది…రాష్ట్ర ప్రభుత్వంతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి వివిధ సంస్థలు…
మొత్తం 30 ప్రాజెక్టులు – 15,279 కోట్ల పెట్టుబడులు… వీటిలో 14 పీపీపీ ప్రాజెక్టులు (7,081 కోట్లు), 16 ప్రైవేట్ ప్రాజెక్టులు (8,198 కోట్లు)… అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతోపాటు రామోజీ ఫిలిం సిటీ 2,000 కోట్ల విస్తరణ… (రామోజీ ఫిలిమ్ సిటీ విస్తరణకు ప్రభుత్వంతో ఎంవోయూ ఏమిటో క్లారిటీ లేదు)
Ads
మొదటిసారి ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్ కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్‌కి రానున్నాయి… 10,000 కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు… గుడ్ డైరెక్షన్… అయితే..?
జిల్లాల్లో ఉన్న అరుదైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి..? అన్నీ హైఫై, ఎక్స్‌పెన్సివ్ టూరిజం ఆలోచనలేనా..? తెలంగాణలో పలు వాటర్ ఫాల్స్ ఉన్నాయి… రెండు ప్రధాన నదీ ప్రవాహాలున్నాయి… దట్టమైన అడవులున్నాయి… గుట్టలున్నాయి… ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బోట్ టూరిజం… ప్లస్ ప్రజెంట్ ట్రెండ్ టెంపుల్ టూరిజం… వాటిపై అసలు ఓ దశ లేదు, ఓ దిశ లేదు…
పర్‌ఫెక్ట్ ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం… గుహలంటే బెలుం గుహలేనా? గుహలంటే బొర్రా గుహలేనా? వీటిని మించి మైమరిపించి ఆహ్లాదాన్ని పంచే గుహలు మన దగ్గర కూడా ఉన్నాయి… అవి రంగుల గుహలు… అవి సరైన గుర్తింపునకు నోచుకోలేదు… పర్యాటక ప్రదేశాలుగా పేరుగాంచలేదు…
వసతులు ఉండాలే గానీ మంచి అడ్వెంచర్ టూరిజం స్పాట్ ప్లస్ డిఫరెంట్ టూరిస్ట్ స్పాట్ అయ్యే స్కోప్ ఉంది… కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా, చందంపేట మండలంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఉండే అరుదైన గుహలున్నాయి… కాచరాజుపల్లికి దగ్గర వున్న గుట్టల వరుసలో మునుల గుహగా పేరున్న గాజుబేడం గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో మెరిసిపోతూ కనపడుతుంది…
ఇలాంటివి ప్రపంచంలోనే అరుదు… కొన్ని గుహలకు సరైన వెలుతురు లేదు… గుహల్లోకి ప్రవేశించే మార్గం విశాలంగా ఉంటుంది… కళ్ళుచెదిరే రంగుల గోడలు, అంతస్తుల గుహలు మనల్ని అబ్బురపరుస్తాయి… గుహాంతర్భాగాలు సొరంగాలుగా, అంతస్తులుగా చక్కగా చెక్కినట్టుగా రాతిగోడలు, అందమైన ఆకృతులు…
ఒకచోట ఎరుపు రంగు, మరొకచోట కొంచెం నారింజ వర్ణం, గుహలో 90 శాతం ఆక్వా మెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో చాలా అందంగా కనిపిస్తాయి… అగ్నిపర్వతపు లావా ప్రవాహంతో గుహలకు ఈ రంగులు ఏర్పడి వుంటాయా..? లావావేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గుహల గోడలకు ఈ రంగులు వచ్చి ఉంటాయా…?
దేశంలోనే అరుదైనవి ఈ గుహలు… మంచి విహార యాత్రాస్థలంగా రూపొందడానికి బోలెడు స్కోప్ ఉంది…. గుహలోని మార్గాలను అన్వేషిస్తే అనేకమైన కొత్త సంగతులు, ఆశ్చర్యపరిచే చారిత్రక విశేషాలు బయటపడే అవకాశాలున్నాయి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టకి చేరువలో ఉన్న మైలారం గుహలు లక్షల సంవత్సరాల నాటి ఆనవాళ్లకు, ప్రకృతి చెక్కిన అందాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి… నల్లగుట్టలుగా పేరొందిన నల్లరాతి గుట్టలలో 3.5 కి.మీ. మేరకు ఈ సున్నపు గుహలు విస్తరించి ఉన్నాయి… నల్ల గుట్టల్లో గుహల లోపలికి సహజసిద్ధంగా ఏర్పడిన సొరంగాలు, ఆ సొరంగాల్లో రహస్య మార్గాలు ఉన్నాయి… ఇలా బోలెడు అవకాశాలు..!!
Share this Article